సిద్దిపేట గడ్డ ఇక కాంగ్రెస్ అడ్డా
- రాష్ట్రంలో మళ్లీ వచ్చేది ఇందిరమ్మ రాజ్యమే: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
- బీఆర్ఎస్ గతమే.. దానికి భవిష్యత్తు లేదు
- అప్పుల్లో అమరుల కుటుంబాలు.. వేల కోట్లకు కల్వకుంట్ల కుటుంబం
- వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్లో హరీశ్‌రావు ఉండడు
- జగన్‌కు విందిచ్చి.. రాయలసీమ ప్రాజెక్టు కట్టుకొమ్మన్నది కేసీఆరే
- ఈ మట్టిలోనే పుట్టిన.. ఇక్కడే కలుస్త.. ఈ నేలకు అన్యాయం చేయ
- సిద్దిపేటలో కాంగ్రెస్‌ను గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామని ప్రకటన
- ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించిన సీఎం
సిద్దిపేట, నవంబర్ 19 (విజయక్రాంతి): రాష్ట్రంలో మళ్లీ వచ్చేది ఇందిరమ్మ రాజ్యమేనని, సిద్దిపేట గడ్డ ఇక కాంగ్రెస్ అడ్డా అని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. అధికారంలో ఉన్న పదేండ్లు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు రాష్ట్రాన్ని ముంచారని.. ప్రజలను బానిసల్లా చూశారని మండిపడ్డారు. తెలంగాణ కోసం కొట్లాడిన వేల కుటుంబాలు పేదరికంలో బతుకుతుంటే కల్వకుంట్ల ఫ్యామిలీకి వేలకోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని ఆయన ప్రశ్నించారు.
‘మూడేండ్ల నుంచి అసెంబ్లీకి రాకుండా ప్రజల నుంచి కేసీఆర్ కోటిన్నర రూపాయల జీతం తీసుకున్నడు. పదేండ్లు పాలించి రాష్ట్రాన్ని ఆగం చేసిండు. ప్రజలను బానిసల్లా చూసే ఆ వ్యక్తి మళ్లీ అధికారంలోకి రావాలని ఎవరైనా కోరుకుంటరా? ప్రజలతో ఉండే ఇందిరమ్మ రాజ్యం కావాలని కోరుకుంటారా? తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందంటూ కేటీఆర్, ఆ పార్టీ నేతలు వసూళ్లకు దిగుతున్నరు. తప్పుడు ప్రచారాలు చేస్తున్నరు. బీఆర్ఎస్ ఇక గతమే. దానికి భవిష్యత్తు లేదు’ అని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్లో హరీశ్‌రావు ఉండరని.. బీజేపీతో టచ్‌లో ఉన్నారని సీఎం వ్యాఖ్యానించారు.
ఆదుకున్నవాళ్లను, నమ్మినవాళ్లు నట్టేట ముంచడం కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుకు అలవాటేనని.. తెలంగాణ తొలిదశ ఉద్యమకారుడు మదన్ మోహన్‌ను కేసీఆర్ ముంచారని, మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డిని హరీశ్‌రావు ముంచారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం సిద్దిపేటలో ‘ప్రజాపాలన.. ప్రగతి బాట’ పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఇందులో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొని.. రూ. 5 లక్షల ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా స్కీమ్‌ను ప్రారంభించారు. దాదాపు రూ. 550 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం సభలో మాట్లాడారు.
హరీశ్‌కు వేల కోట్లు ఎట్లొచ్చినయ్?
హరీశ్‌రావును కంటికిరెప్పలా మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కాపాడారని, కానీ రామలింగారెడ్డి చనిపోయాక ఆయన కుటుంబాన్ని హరీశ్‌రావు రోడ్డునపడేశారని సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘హరీశ్‌ను అన్నివేళలా కంటికి రెప్పలా కాపాడిన వ్యక్తి సోలిపేట రామలింగారెడ్డి. ఆయన కుటుంబం ఇప్పుడు ఎలా ఉంది? కనీసం పాత కారు కూడా లేదు. అదే.. హరీశ్ కుటుంబానికి వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి’ అని ప్రశ్నించారు. చెరుకు ముత్యంరెడ్డి కుటుంబాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ మోసం చేసిందన్నారు.
‘రంగనాయక్ సాగర్ దగ్గర హరీశ్‌రావుకు, కొండపోచమ్మ సాగర్ దగ్గర కేసీఆర్‌కు, హైటెక్ సిటీ దగ్గరలోని జన్వాడలో కేటీఆర్‌కు ఫామ్‌హౌస్‌లు ఎట్ల వచ్చినయ్? హరీశ్‌రావుకు పిల్లనిచ్చిన హన్మంతరావుకు ప్రభుత్వ భూమి, హరీశ్ బామ్మర్ది సుమన్‌రావుకు హైదరాబాద్‌లో కోట్ల ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది? తెలంగాణ మలిదశ ఉద్యమంలో పాల్గొన్న, త్యాగాలు చేసిన ఎంతో మంది కుటుంబాలు అప్పుల్లో ఉంటే కేసీఆర్, హరీశ్‌రావు కుటుంబాలు, వాళ్ల బంధువులకు మాత్రం వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినయ్? సిరిసిల్ల, నేరళ్లలో ఇసుక దోపిడీకి పాల్పడింది కేటీఆర్, సంతోష్‌రావు కుటుంబాలు కదా?’ అని దుయ్యబట్టారు. ప్రాజెక్టుల్లో దోపిడీకి పాల్పడ్డందుకే 2018లో హరీశ్‌రావుకు కేసీఆర్ మంత్రి పదవి ఇవ్వలేదన్నారు.
బీజేపీతో టచ్‌లో హరీశ్
వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి బీఆర్ఎస్లో హరీశ్‌రావు ఉండరని, బీజేపీతో టచ్‌లో ఉన్నారని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. ఆ పార్టీతో టచ్‌లో లేకపోతే సిద్దిపేట ఎల్లమ్మ మీద ఒట్టేసి నిరూపించుకోవాలని హరీశ్‌కు సవాల్ చేశారు. ‘2004లో వార్డు మెంబర్‌గా కూడా గెలవకపోయినప్పటికీ పొత్తులో భాగంగా నాడు వైఎస్సార్ మంత్రి పదవి ఇస్తే.. ఆ తర్వాత సిద్దిపేటలో కాంగ్రెస్ లేకుండా చేయాలని హరీశ్ కుట్ర చేసిండు’ అని సీఎం ‘నాడు ఏ ఆంధ్రా సంస్థలకు వ్యతిరేకంగా పోరాడామో.. ఆ ఆంధ్రా సంస్థలతోనే హరీశ్ వ్యాపారం చేస్తున్నడు. నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థలకు పాలు అమ్ముకుంటున్నడు’ అని విమర్శించారు.
వాడు పోతే వీడు.. వీడు పోతే వాడు..!
“నాడు మేడ్చల్‌లో నేను దీక్ష చేసినప్పుడు నా దీక్ష సాగనివ్వకుండా కేసీఆర్ కుట్ర చేసిండు. ఆనాడే సవాల్ చేసిన. ‘కేసీఆర్ కాస్కో.. గజ్వేల్ గడ్డ మీద కాలు పెడుతా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురేస్తా.. నిన్ను, నీ పార్టీని పాతాళానికి తొక్కుత’ అని చెప్పిన. అన్నది అన్నట్టుగా గజ్వేల్ గడ్డ మీద కదంతొక్కినం. 2023 డిసెంబర్ 7 నాడు ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలన తెచ్చుకున్నం. ఇప్పుడు ఈ సిద్దిపేట గడ్డ నుంచే మాట ఇస్తున్న.. కేవలం సిద్దిపేట గడ్డమీదనే కాదు తెలంగాణలో 2029లో రెండోసారి ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చి, ప్రజాపాలన జెండా ఎగరేస్తాం’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
‘సిద్దిపేటలో నాలుగు దశాబ్దాలుగా మామ, మామపోతే అల్లుడు.. ఇప్పుడు అల్లుడు పోతే ఆయన బామ్మర్ది వస్తడట. ఈ మధ్య కేసీఆర్ అన్న కొడుకు అక్కడక్కడ ఫ్లెక్సీలు కడ్తున్నడు. సిద్దిపేట ఏమైనా మీ తాతల గడీలా? మీ భూసాముల భూములా? మామపోతే అల్లుడు.. అల్లుడు పోతే బామ్మర్ది.. వాడు పోతే వీడు.. వీడు పోతే వాడు.. ఎవడెవడో సిద్దిపేట గడ్డనేలడానికి ఇదేమైనా అనాథల రాజ్యం అనుకుంటున్నరా?’ అని చెప్పారు.
ఆలుగడ్డ సీనుకు పదవి.. శ్రీకాంతాచారి తల్లికి ఎందుకివ్వలే?
‘తెలంగాణ కోసం శ్రీకాంతాచారిలాటి వాళ్లు ప్రాణత్యాగం చేస్తే.. కేసీఆర్ మాత్రం కొడుకు, కూతురు, అల్లుడు, సడ్డకుడి కొడుకుకు పదవులు కట్టబెట్టిండు. ఆలుగడ్డ సీనుకు, ఎర్రబెల్లి దయాకర్‌కు కూడా పదవులు ఇచ్చిండు. తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి తల్లికి మాత్రం పదవి ఇవ్వలేదు. ఆమెకు పదవి వస్తే.. తెలంగాణ త్యాగం ప్రపంచానికి తెలిసేది’ అని సీఎం అన్నారు.
‘నాడు హరీశ్‌రావు పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టె లేక డ్రామాలాడితే.. శంకరమ్మ కొడుకు శ్రీకాంతాచారి తెలంగాణ కోసం ఎల్బీనగర్ చౌరస్తాలో, అంబేద్కర్ సాక్షిగా పెట్రోల్ పోసుకొని, అగ్గిపెట్టుకొని ఆకాశంలో తారగా మారిండు. అలాంటి అమరవీరుడి తల్లికి కేసీఆర్ పదవి ఎందుకు ఇవ్వలే? తెలంగాణ కోసం 1,200 మంది ప్రాణాలు అర్పిస్తే.. ఆ అమరుల త్యాగాల మీద కేసీఆర్ అధికారం చెలాయించిండు. ఆ పాపం ఊరికేపోతదా? ప్రజాపాలనలో శంకరమ్మను మహిళా కమిషన్ సభ్యురాలుగా చేసుకున్నం. భవిష్యత్తుల్లో ఇంకా పదవులు ఇస్తం’ అని వివరించారు.
రాయలసీమ రతనాలసీమ చేస్తనన్నడు
నాడు వైఎస్ జగన్‌ను ప్రగతిభవన్‌కు పిలిపించుకొని, విందు ఇచ్చి, రాయలసీమ ప్రాజెక్టు కట్టుకో అని చెప్పింది కేసీఆర్ కాదా? అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. ‘కమీషన్లకు ఆశపడి రాయలసీమ ప్రాజెక్టుకు సహకరించిందే కేసీఆర్. రోజా ఇంటికి వెళ్లి రొయ్యల పులుసు తిని.. రాయలసీమను రతనాల సీమ చేస్తామన్నది ఆయన కదా?!’ అని నిలదీశారు.
ఆస్తుల కోసం చెల్లిని గెంటేసిన కేటీఆర్
‘ఆస్తుల్లో వాటా కోసం సొంత చెల్లిని గెంటేసిన కేటీఆర్.. ఈ రాష్ట్రంలోని కోటిమంది ఆడబిడ్డలకు ఏం న్యాయం చేస్తడు’ అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. ఆడబిడ్డలకు ఇచ్చే బతుకమ్మ చీరల్లో కూడా బీఆర్ఎస్ నేతలు దోపిడీకి పాల్పడ్డారని అన్నారు. ‘నాడు గుజరాత్, సూరత్ నుంచి పనికిమాలిన చీరలు తెచ్చి కమీషన్లు కొట్టేశారు’ అని దుయ్యబట్టారు. కేటీఆర్‌కు గడ్డం రావడానికే 50 ఏండ్లు పట్టిందని, బుద్ధిరావడానికి ఎన్నేండ్లు పడుతుందోనని విమర్శించారు.
కాలేజీకి మదన్మోహన్ పేరు
తెలంగాణ తొలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మదన్ మోహన్ పేరు కేసీఆర్, కేటీఆర్, హరీశ్ చేశారని సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మదన్ మోహన్ పేరును తాము సిద్దిపేట మెడికల్ కాలేజీకి పెడుతామని ప్రకటించారు. నమ్మకద్రోహం కేసీఆర్ రక్తంలోనే ఉందని, రాజకీయ భిక్ష పెట్టిన మదన్మోహన్పైనే పోటీకి దిగిన నీచ చరిత్ర కేసీఆర్‌ది అని ఆయన దుయ్యబట్టారు.
ఈ మట్టిలోనే పుట్టిన.. ఇక్కడే కలుస్త..!
‘కృష్ణా జలాల్లో 299 టీఎంసీలు చాలని సంతకం పెట్టింది కేసీఆర్, హరీశ్‌రావు కాదా? వాళ్లు చేసిన పాపమే తెలంగాణను ముంచింది’ అని సీఎం రేవంత్ మండిపడ్డారు. ‘ఆంధ్రాకు నీళ్లు వదులుతున్నట్లు నాపైన కేసీఆర్ మొసలికన్నీరు కారుస్తున్నడు. ఆయనకు ఒక్కటే చెప్పదలచుకున్నా..! నేను బిడ్డను. ఈ మట్టిలో పుట్టిన.. ఈ మట్టిలోనే పెరిగిన.. ఈ మట్టిలోనే కలుస్త. నా నేలకు అన్యాయం చేయను. నీళ్ల మీద మాట్లాడుదామంటే అసెంబ్లీకి కేసీఆర్ రాడు. తెలంగాణను ముంచిందే ఆయన’ అని సీఎం అన్నారు. ‘దొరలపాలన కావాల్నా.. ఆ పాపాల భైరవుడు ఇంకా కావాల్నా..? పదేండ్ల పాలనలో కేసీఆర్ రూ. 20 లక్షల కోట్లు ప్రజల నుంచి పన్నులు తీసుకున్నడు. రూ.8లక్షల 11వేల కోట్లు అప్పులు చేసిండు. అవన్నీ ఏమైనయ్?’ అని నిలదీశారు.
సిద్దిపేటకు మంత్రి పదవి
ఇప్పటినుంచి సిద్దిపేట గడ్డ కాంగ్రెస్ అడ్డా అని.. దీన్ని పార్టీ కార్యకర్తలు నిరూపించారని సీఎం రేవంత్ ‘ఈ నియోజకవర్గంలో ప్రజలు కోరుకున్న నాయకుడికే కాంగ్రెస్ టికెట్ ఇస్తం. గెలిపించుకునే బాధ్యత మీది. సిద్దిపేటలో కాంగ్రెస్ జెండా ఎగిరితే ఈ నియోజకవర్గానికి మంత్రి పదవి ఇస్త’ అని ప్రకటించారు. 2029లో మళ్లీ ఇందిరమ్మ రాజ్యమే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఆ నేతలకు పిచ్చికుక్క కరిచిందేమో..!
‘గ్యారంటీలు ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నరు. 1983 నుంచి 2023 వరకు ఎన్టీఆర్, వైఎస్, కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాల్లో మేం ఏవైనా ఆపామా? ఉన్న పథకాలను కొనసాగిస్తూనే కొత్త పథకాలను అమలు చేస్తున్నం. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేశాం. పేదలకు రేషన్ కార్డులు మంజూరు చేశాం.
మూడేండ్లలో 8 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశాం. పేదలకు సన్నబియ్యం అందిస్తున్నం. వరి వేస్తే ఉరి అని కేసీఆర్ చెప్తే.. మేం సన్న వడ్లకు బోనస్ ఇస్తున్నం’ అని సీఎం రేవంత్ వివరించారు. ‘మంచి ఏమైనా ఉంటే మైక్‌లో, చెడు ఉంటే చెవిలో చెప్పాలంటరు. కానీ.. కాంగ్రెస్ పార్టీలో కొందరు నేతలకు ఈ మధ్య ఏమైందో, పిచ్చికుక్క కరిచిందో ఏమో.. చెడంతా మైక్‌లో, మంచి మాత్రం ఇంటికొచ్చి చెవిలో చెప్తున్నరు. ఇట్లనే వ్యవహరిస్తే కార్యకర్తలే వాళ్లను ఎర్రగడ్డ దవాఖానకు పంపిస్తరు’ అని హెచ్చరించారు.
తెలంగాణ కోసం శ్రీకాంతాచారి లాంటి వాళ్లు ఎందరో ప్రాణత్యాగం చేస్తే.. ఆ త్యాగాల మీద కేసీఆర్ అధికారం చెలాయించిండు. కొడుకు, కూతురు, అల్లుడు, సడ్డకుడి కొడుకుకు పదవులు కట్టబెట్టిండు. ఆలుగడ్డ సీను, ఎర్రబెల్లిని కూడా మంత్రులుగా చేసుకున్నడు. వేల మంది తెలంగాణ ఉద్యమకారులు, అమరుల కుటుంబాలు అప్పుల్లో ఉంటే కల్వకుంట్ల ఫ్యామిలీకి మాత్రం వేల కోట్ల ఆస్తులు ఎట్లొచ్చినయ్. రంగనాయక్ సాగర్ దగ్గర హరీశ్‌కు, కొండపోచమ్మ సాగర్ దగ్గర కేసీఆర్‌కు, జన్వాడలో కేటీఆర్‌కు ఫామ్‌హౌస్‌లు ఎక్కడి నుంచి వచ్చినయ్? పదేండ్లు ప్రజలను బానిసల్లా చూసి.. రాబందుల్లా దోచుకున్నరు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి