నిరంతర సాహితీవ్రతుడు

14-11-2026 | 05:05am

తన యావజ్జీవితాన్ని సాహిత్యాధ్యయనానికి, పరిశోధనకు, సృజనాత్మక వ్యాసంగానికి వెచ్చించిన మహా రచయిత కపిలవాయి లింగమూర్తి(Kapilavai Lingamurthy). కవులు, పండితులు, భాషాభిమానులు, వ్యాఖ్యాతలు తమ జీవితాలను అక్షరార్చనకు నిష్కళంకంగా, చిత్త శుద్ధితో వినియోగిస్తే ఏర్పడిందే సాహిత్య చరిత్ర. 

లింగమూర్తిగారి సాహిత్య వ్యాస పరంపరను ఒకసారి గమనిస్తే, వారు తెలుగు సాహిత్య చరిత్రకు చేసిన సేవ తెలుస్తుంది. ప్రాచ్య విద్యా కోవిదులైన లింగమూర్తిగారు నాగర్ కర్నూల్ జిల్లాలో జన్మించారు. కొంతకాలం జాతీయోన్నత పాఠశాలలోను, మరికొంతకాలం పాలెంలోని శ్రీ వెంకటేశ్వర ప్రాచ్య కళాశాలలోను అధ్యాపకులుగా పనిచేశారు. 1983లో ఉద్యోగ విరమణ చేసినప్పటికీ జీవితాం తం సాహితీ కృషీవలురుగా తెలుగునాట పేరుగాంచినారు. వారు రచించిన నూటా డెబ్బది రచనల్లో స్వీయరచనలు నూటికి పైగా ఉన్నాయి. పరిష్కరింపబడిన, సంపాదకత్వం వహించిన గ్రంథాలు అరవైదాకా ఉన్నాయి. లింగమూర్తి సాహితీసేవను గుర్తించిన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2014లో వారికి గౌరవ డి.లి ట్ (డాక్టరేట్) ప్రదానం చేసింది. 

2016లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ‘విశిష్ట పురస్కారం’ అందించి గౌరవించింది. లింగమూర్తిగారందుకున్న విశిష్ట సాహితీ పురస్కారాలలో బూర్గుల రామకృష్ణారావు “... పురస్కారం, సి.పి. బ్రౌన్ సాహిత్య పురస్కారం, నోరి నరసింహ శాస్త్రి పురస్కారం, ఎన్.ఆర్.ఐ. వారి కాళోజీ పురస్కారం, ఆంధ్ర సారస్వత పరిషత్తు వారి ‘సప్తతి విశిష్ట పురస్కారం” ముఖ్యమైనవి.లింగమూర్తిగారి కలం నుంచి వెలువడిన రచనలు వైవిధ్యాన్ని సంతరించుకున్నవి. వారొక ప్రక్రియకు పరిమితమైన వారుకారు.

అటు పద్యకృతులు, ఇటు గద్యకృతులు, అటు కావ్యాలు, ఇటు ఖండకృతులు, అటు సంకీర్తనలు, ఇటు వ్యాఖ్యానాలు, అటు చరిత్రలు, ఇటు నవలలు, అటు వ్యాస సంపుటాలు, ఇటు అనువాదాలు అటు పీఠికలు, ఇటు నిఘంటువులు ఎన్ని ప్రక్రియలని చెప్పాలి? తెలు గులో సర్వతోముఖమైన ప్రతిభను కనబర్చి సాహిత్య నిర్మాణానికి నడుంకట్టిన మహానుభావుడు. లింగమూర్తికి అటు సంస్కృతంలోను తెలుగులో వలె సమధిక ప్రజ్ఞ అలంకారమైంది. లింగమూర్తి తెలంగాణలో బి.ఎన్.శాస్త్రితో సమానమైన చారి త్రక, శాసన పరిశోధకుడు. ప్రాచీనస్థల చరిత్రలను పరిశోధించి తానన్ని నిగ్గుదేల్చడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఆయన పుట్టిన ఊరు ఎంతో చిన్నది. కాని ఆయన వల్ల స్వగ్రామానికి వచ్చిన కీర్తి ఎంతో గొప్పది. కేవలం ఆయన పైపై పరిశోధనకు ప్రాధాన్యం ఇవ్వలేదు.

శాసనాలను ఆధారంగా చేసుకొని చరిత్రను తెలియజేయ డం ఆయనలోని విశేషం. వారు రచించిన స్థల పురాణాలకు, చరిత్రలకు సంబంధించిన గ్రంథాలు 20దాకా ఉన్నవి. వాటిలో ‘మహాక్షేత్రం మామిళ్లపల్లి ‘క్షేపాల గంగోత్రి చరిత్ర’ ‘పాలమూరు జిల్లా దేవాలయాలు (300 ఆలయాలను గూర్చి సమాచారం ఇచ్చే గ్రంథం) స్థల చరిత్ర’ ‘సోమశిల దేవాలయాల చరిత్ర’ ‘సోమేశ్వర క్షేత్ర మహాత్మ్యం’ ‘ఉమా మహేశ్వరం ‘ఉమ్మడి పాలమూరు జిల్లా కవిపండిత వంశాలు  యోగులు’ ‘నాగశేషమాంబ జీవిత చరిత్ర’ మొదలైనవి ప్రసిద్ధమైనవి. చరిత్ర పరిశోధకులకు కరదీపికలైనవి.

వీరి వ్యాఖ్యాన గ్రంథాల్లో ‘కావ్య గణపతి అష్టోత్తరం’ (108 కావ్యాల్లోని గణపతిస్తుతి) ‘స్వర్ణశకలాలు’ (90 కావ్యాల్లో స్వర్ణప్రశస్తి) ‘రుద్రాధ్యాయం’ (సామాజిక చరిత్రకు వ్యాఖ్యానం) ‘మాంగళ్యశాస్త్రం’ (కన్నడంలోకి అనువదింపబ డింది)’ హనుమత్‌సహస్రం’ (హనుమంతుని సహస్ర నామాలకు వ్యాఖ్యానం) మైదలైన గ్రంథాలు లింగమూర్తిగారి వ్యా ఖ్యాన కౌశలాన్ని తెలుపుతున్నాయి. మల్లినాథ సూరిని గుర్తుకు తెస్తున్నాయి.

వీరివ్యాస సంపుటాలు అటు సాహిత్యానికి సంబంధించినవే కాక, ఆధ్యాత్మికరంగానికి సంబంధించినవి. 2022 నుంచి రచించిన వ్యాస సంపుటాలు (సుమారు) కపిలవాయి అశోక్ బాబుగారి సంపాదకత్వంలో ప్రచురింపబడి ఆవిష్కృతమైనవి. వీరు రచించిన వ్యాసాలు సుమారు 65 ప్రత్యేక సంచికలలో ప్రచురితమయ్యాయి. 

లింగమూర్తి నవలా రచనలోనూ, కథా రచనలోనూ దిట్ట. వీరు ఐదు నవలలను రచించారు. 1. ఉప్పునూతల కథ, 2. గోదా దేవి కథ, 3. మూడు తరాల ముచ్చట, 4. నాగమణి, 5. ఆంధ్రపూర్ణాచార్యుడు. అట్లే తెలుగు సాహిత్యంలోని వివాదాస్పదమైన పద్యాలనాధారంగా చేసుకొని లింగమూర్తిగారు వీరి ‘కపిలవాయి కథలు’ స్వతం త్రంగా ఉండి వారంతటి గొప్ప కథకులో తెలియజేస్తాయి.

లింగమూర్తిగారి సృజనాత్మక, చారిత్రక పరిశోధనా గ్రంథాలొక ఎత్తుతై, వారి పరిష్కృత గ్రంథాలు మరొకయెత్తు. వీరు సుమారు యాబై గ్రంథా లను పరిష్కరించి తెలుగు సాహిత్యంలో గొప్ప గ్రంథ పరిష్కర్తగా నిలిచారు. మల్లంపల్లి సోమశేఖరశర్మ, వేటూరి ప్రభాకర శాస్త్రి గార్లను గుర్తుకు తెస్తారు.

వీరి పరిష్కృత గ్రంథాల్లో ‘చూతపురీవిలాసం’ ‘శ్రీదామోదాహరణం’ (మహబూబ్‌నగర్ జిల్లాలో రచింపబడిన మొదటి ఉదాహరణం) ‘సాలగ్రామశాస్త్రం’ సంస్కృతం, ‘సావిత్రీ చరిత్ర’ (సువ్వాలఛందస్సులోనిది) ‘భువన మోహినీ విలాసం’ ద్విపద ప్రబంధం, ‘ధీజనమనో విరాజితం’ (తెనాలి రామలింగ కవి విరచతం) ‘అచలతత్తాలు’ (చేవూరి పెద్దలక్ష్మయ్య) ‘శ్రీ హనుమచ్ఛతకం’ (బండ్ల బాలకిష్టయ్య) ‘ఆత్మబోధ’ (యోగానందా వధూతా) ‘మార్కండేయ చరిత్ర’ (పుట్టా లక్ష్మీనారాయణ) మొదలైనవి లింగమూర్తి లోతైన చారిత్రక అవగాహనకు, నిఘంటు పరిజ్ఞానానికి, సాహిత్య పరిమళాల పట్ల గల అభినివేశానికి ఉదాహరణగా నిలుస్తాయి. 

లింగమూర్తిగారి చారిత్ర గ్రంథాలు ముప్పది దాకా ఉన్నవి. వాటిని కపిలవాయి అశోక్ బాబు అచ్చువేసి, పితౄణ విముక్తికి బాట వేసుకున్నాడు. లింగమూర్తి మొదటి నుంచి ఏ రచన చేసినా, దాన్ని ప్రచురించడానికి, లేదా సమీక్షించడానికి పత్రికల సహకారం లభించింది. కృష్ణాపత్రిక, భారతి, రామకృష్ణప్రభ, జాగృతి, వాణి, సప్తగిరి మొదలైన పత్రికల్లో వారి వ్యాసాలు, కథలు ప్రచురిం పబడినవి.

ఇంతటి ప్రతిభావంతుడైన రచయిత మీద ఆయా విశ్వవిద్యాలయా ల్లో పరిశోధన జరగకుండా ఎలా వుంటుం ది? అనంతరాములు లింగమూర్తి శతకాలమీద, మొత్తం సాహిత్యం మీద ఓ.యూ. లో పరిశోధన చేశారు. ఇట్లే యాదగిరాచారి మధురై యూనివర్సిటీలో పరిశోధన చేశారు. జి. వెంకటరాజం ఓ.యూలో ‘లింగమూర్తి సాహిత్యంలో చరిత్ర ‘సంస్కృతి’ మీద పరిశోధన చేసినారు.

లింగమూర్తిగారిని వరించిన బిరుదులు అనేకం. వాటిలో ‘కవితా తపస్వి’ ‘కవితా కళానిధి’ ‘కవికేసరి’ ‘వేదాంత విశారదా’ ‘గురు శిరోమణి’ మొద లైనవి వారి విషయంలో సార్ధకమైనవి. లింగమూర్తి వివిధ సంస్థల నుంచి అవార్డులు పొందడమేగాక, వారి పేరు మీద స్థాపింపబడిన ‘డా. కపిలవాయి లింగమూర్తి సాహిత్య కళాపీఠం’ ఆధ్వర్యంలో 2017 నుంచి ఎంతోమంది సాహితీవేత్తలకు అవార్డులు ఇవ్వబడినవి.

లింగమూర్తిగారి ‘పద్యపేటిక’లో వారి అనుచరులపై పద్యాలు రచింపబడినవి. ‘నేను దేశీకవినే గాని, మార్గ కవిని కాదు. వ్రాసిన దానిలో ఏదో చమత్కారం లేదా అలంకారం ముఖ్యం. అది లేకుంటే వ్రాయడం వృథా ప్రయాస. కాని వ్రాసిన వాటిలో అన్నింటికీ కృతియోగం, ఆకృతియోగం పట్టదు? అని స్వయంగా చెప్పుకు న్న విషయాల్ని బట్టి ‘విశ్వశ్రేయం కావ్యమే’ అన్న ఆర్యోక్తి గుర్తుకువస్తుంది. నేను మహబూబ్‌నగర్ జిల్లాలోని కల్వకుర్తి తాలూకాకు చెందినవాణ్ణి. వారి రచనలతో నాకు గొప్ప అనుబంధం.

వారి పెద్దబాబు కిశోరుబాబు ఓయూలో నాకు సహ పరిశోధక విద్యార్థి. నాగర్ కర్నూల్ వెళ్లినప్పుడు వారి ఇంటికి వెళ్లి వచ్చేవాణ్ణి. నా సహాధ్యాపకుడు వి. నిత్యానందరావు వారి ఇంట్లో ఉండి చదువుకున్నారు. ఒకసారి ఆమనగల్లులో జరిగిన కవి సమ్మేళ నానికి నేను ముఖ్య అతిథిగా వెళ్లవలసి వచ్చింది. ఆహ్వానంలో నా పేరును చూసి వారు నాగర్ కర్నూల్ నుంచి ఆమన్‌గల్‌కు వచ్చారు. నేను “ఇంతదూరం ఈ వయస్సులో ఎందుకు వచ్చారు?” అని అడిగా ను. “వయస్సుతో సంబంధం లేకుండా మనస్సు అనేది ఉంటే, కావలసిన వారిని కలుసుకోవడానికి ఎంత దూరమైన వెళ్లవచ్చు” అని పలికిన పలుకులను వారు గుర్తుకువచ్చినప్పుడల్లా నెమరేసుకుంటాను.

వ్యాసకర్త సెల్: 9885654381

ఆచార్య మసన చెన్నప్ప

మరిన్ని వార్తలు