దేశానికి అతిపెద్ద ఆస్తి యువతే
- 25నుంచి నషా ముక్త్ భారత్ యాత్ర
- అందరూ పాల్గొనాలి
- కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విజ్ఙప్తి
- రాహుల్‌గాంధీవి రాజకీయ నాటకాలే: కే లక్ష్మణ్
నవంబర్ 14 (విజయక్రాంతి): ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా కలిగిన మన దేశానికి యువతే అతిపెద్ద ఆస్తి అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి(Union Minister Kishan Reddy) పేర్కొన్నారు. యువత నిర్వీర్యమైతే ఏ దేశానికైనా, ఏ సమాజానికైనా భవిష్యత్తు ఉండదని స్పష్టం చేశారు. అందుకే 2029 నాటికి దేశాన్ని ‘నషా ముక్త్ భారత్’ (డ్రగ్స్ రహిత దేశం)గా తీర్చిదిద్దాలనేది ప్రధాని మోదీ లక్ష్యమని తెలిపారు.
‘ఇది కేవలం ఒక పార్టీకో, ప్రభుత్వానికో, పోలీసులకో సంబంధించిన అంశం కాదు, 140 కోట్ల మంది భారతీయులందరి బాధ్యత. సమాజం ద్వారా ఎదిగిన కళాకారులు, కవులు, సినీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు, మీడి యా ప్రతినిధులు, విద్యాసంస్థలు, మేధావులు, ప్రజాప్రతినిధులు.. ప్రతి ఒక్కరూ బాధ్యతగా, భావి తరాల భవిష్యత్ కోసం ముందుకు రావాలి..’ అని కోరారు.
ప్రధాని పిలుపుమేరకు, హైదరాబాద్ నగరంలో మొదటి విడత ‘నషాముక్త్ భారత్ యాత్ర’ ఈ నెల 25, 26, 27 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. శనివారం ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో మేధావులతో కలిసి యాత్ర సన్నాహక సమావేశం నిర్వహించారు. ప్రత్యేక బీజేపీ ఎంపీ డా.కె.లక్ష్మణ్, ఇతర నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగడం చూసి కొన్ని దేశాలు ఈర్ష్య పడుతున్నాయన్నారు.
ప్రపంచాన్ని శాసించే శక్తిగల భారత యువత ఇదేవిధంగా ముందుకు సాగితే భారత్ అగ్రస్థానంలో ఉంటుందనే భయంతో కొన్ని అంతర్జాతీయ శక్తులు మన దేశంపై విష ప్రచారం చేస్తున్నాయని పేర్కొన్నారు. నేరుగా యుద్ధం చేయలేక, ఆర్థిక ఆంక్షలతో మనల్ని ఆపలేక, ఇప్పుడు డ్రగ్స్ రూపంలో యువతను నిర్వీర్యం చేసే కుట్ర పన్నుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
యాత్ర రూట్ మ్యాప్..
* ఈ నెల 25న ఉదయం 8 గంటలకు అంబర్‌పేట్ మున్సిపల్ గ్రౌండ్‌లో తొలి రోజు యాత్ర ప్రారంభమవుతుంది. అంబర్‌పేట మహంకాళి అమ్మవారి ఆశీస్సులతో యాత్ర ముందుకు సాగుతుంది. 6 నంబర్ చౌరస్తా, ఫీవర్ హాస్పిటల్ ఎక్స్ రోడ్, హిందీ మహావిద్యాలయ, ఆరట్స్ కాలేజీ, సీతాఫల్‌మండి మీదుగా ముషీరాబాద్ చేరుకుంటుంది. ఆ రాత్రి అంతా అక్కడే బసచేస్తారు.
* రెండో రోజు.. 26వ తేదీన ఉదయం 8 గంటలకు ముషీరాబాద్ నుంచి యాత్ర మొదలవుతుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అశోక్‌నగర్, హిమాయత్ నగర్ చౌరస్తా, లిబర్టీ, జీహెచ్‌ఎంసీ కార్యాలయం, సచివాలయం, టెలిఫోన్ భవన్, ఖైరతాబాద్ చౌరస్తా, ఈనాడు కార్యాలయం, నిమ్స్ ఎదురుగా, పంజాగుట్ట చౌరస్తా, అమీర్‌పేట చౌరస్తా మీదుగా సత్యం థియేటర్ ప్రాంతానికి చేరుకుంటుంది.
* మూడో రోజు.. 27న సత్యం థియేటర్ నుంచి యూసుఫ్‌గూడ, జూబ్లీహిల్స్, కృష్ణానగర్, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ మీదుగా ఫిలింనగర్‌కు యాత్ర సాగుతుంది. ఆ రాత్రి ఫిలింనగర్‌లో బహిరంగ సభతో మొదటి విడత పాదయాత్ర ముగుస్తుంది.
రాహుల్‌వి రాజకీయ నాటకాలే: కే లక్ష్మణ్
హైదరాబాద్ వేదికగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆడుతున్న రాజకీయ నాటకాలను, గిగ్ వర్కర్లపై ఆయన ఒలకబోస్తున్న దొంగ ప్రేమను తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీజేపీ ఎంపీ డా.కె.లక్ష్మణ్ తెలిపారు. అసలు భారత చరిత్రలో మొట్టమొదటిసారిగా‘ గిగ్, ప్లాట్‌ఫారమ్ వర్కర్లు’ అనే పదాన్ని చట్టబద్ధంగా నిర్వచించి, వారికి సామాజిక భద్రత కల్పించింది ప్రధాని మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వమే నని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో చట్టం చేసి అమలు చేస్తున్న అంశాలను, నేడు తెలంగాణలో తామేదో కొత్తగా కనిపెట్టినట్లు రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. గిగ్ వర్కర్ల సభలో రాహుల్ గాంధీ బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌పై చేసిన ఆరోపణలు నిరాధారమైనవని కొట్టిపారేశారు. దేశం కోసం, సమాజ హితం కోసం పనిచేస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌ను, పేదల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న బీజేపీని విమర్శించే నైతిక అర్హత రాహుల్‌గాంధీకి లేవని సూచించారు.
ఒకవైపు వేదికపై అంబానీ, అదానీ పేర్లు ఎత్తుతూ విమర్శలు చేసే రాహుల్‌గాంధీ.. మరోవైపు ఇదే తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం దావోస్ వేదికగా అదానీ గ్రూప్‌తో రూ. 12,400 కోట్ల ఒప్పందాలు కుదుర్చుకోవడంపై ఎందుకు నోరు మెదపడం లేదో సమాధానం చెప్పాలన్నారు.
హైదరాబాద్‌లో కాంగ్రెస్ నిర్వహిస్తున్న ‘భారత్ సమ్మిట్’ దేశ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ‘యాంటీ- భారత్ సమ్మిట్’ అని ఆరోపించారు. 140 కోట్ల భారత ప్రజల చేతిలో పదేపదే తిరస్కారానికి గురైన రాహుల్‌గాంధీని, విదేశీ ప్రతినిధుల ముందు కాబోయే ప్రధానిగా రీలాంచ్ చేయడానికే తెలంగాణ సొమ్మును వృథా చేస్తున్నారని లక్ష్మణ్ మండిపడ్డారు.