ఫాసిస్టు, నియంతృత్వ పార్టీ కాంగ్రెస్సే

15-11-2026 | 05:15am
  1. రాహుల్, రేవంత్ ప్రకటనలు విడ్డూరం
  2. ఓటముల్లో రాహుల్ హిస్టరీ ‘డిఫీట్ సెంచరీ’ 
  3. విదేశీయుల ముందు దేశ పరువు, ప్రతిష్టకు భంగం 
  4. వారిది పక్కా ‘భారత వ్యతిరేక సమ్మిట్’
  5. సమ్మిట్‌తో రాష్ట్రానికి ఒరిగిందేంటో రేవంత్ చెప్పాలి
  6. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి 

నవంబర్ 14 (విజయక్రాంతి): హైదరాబాద్ వేదికగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ‘భారత్ సమ్మిట్’పై(India Summit) కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసలైన ఫాసిస్టు, నియంతృత్వ పార్టీ కాంగ్రెస్సేనని ధ్వజమెత్తారు. ఫాసిస్టుల చేతిలో భారత్ ఉందని రాహుల్ ప్రసంగించడం.. పెట్టుబడులు వస్తాయని రేవంత్ ప్రకటనలు చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. శనివారం బీజేపీ  రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని ‘ఫాసిస్ట్ ప్రభుత్వం’ అని రాహుల్ గాంధీ పేర్కొనడాన్ని తప్పుపట్టారు. 18 నెలల ఎమర్జెన్సీ కాలంలో పత్రికా స్వేచ్ఛను కాలరాసి, ప్రాథమిక హక్కులను అణగదొక్కిన అసలైన ఫాసిస్ట్, నియంతృత్వ పార్టీ కాంగ్రెస్సేనని నిప్పులు చెరిగారు. జయప్రకాష్ నారాయణ్, అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎల్‌కే అద్వానీ, జార్జ్ ఫెర్నాండెజ్ వంటి నేతలను చీకటి జైళ్లలో బంధించిన చరిత్ర కాంగ్రెస్‌దని మండిపడ్డారు.

దేశం ఫాసిస్టుల చేతిలో ఉందని ఒకపక్క రాహుల్‌గాంధీ చెబుతుంటే.. ఫాసిస్టుల పాలనలో ఉన్న దేశానికి విదేశీ పెట్టుబడులు ఎలా వస్తాయో రేవంత్‌రెడ్డే సమాధానం చెప్పాలని సవాల్ చేశారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలకు బహుళజాతి కంపెనీలు, డేటా సెంటర్లు, పెట్టుబడులు వస్తున్నాయంటే అది రేవంత్ రెడ్డినో, డీకే శివకుమార్‌నో, రాహుల్ గాంధీనో చూసి కాదని పేర్కొన్నారు.

గుజరాత్ సీఎంగా మోదీ ప్రారంభించిన ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ స్ఫూర్తితోపాటు నేడు కేంద్రంలో మోదీ సుపరిపాలన వల్లేనని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసి, విదేశీయులకు ఫస్ట్ క్లాస్ విమాన టికెట్లు, స్టార్ హోటళ్ల విడిది ఖర్చులు పెట్టి చివరకు రాష్ట్రానికి రేవంత్ సంపాదించిందేమిటో శ్వేతప్రతం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో ‘భారత్ సమ్మిట్’ కాదని, ‘భారత వ్యతిరేక సమ్మిట్’ అని కిషన్ రెడ్డి ఆరోపించారు.

భారత్ మీద, ప్రధాని మోదీ మీద విషం చిమ్మే విదేశీ శక్తులను, జేఎన్‌యూలో ‘తుక్డే తుక్డే’ గ్యాంగ్‌లకు మద్దతిచ్చే వారిని హైదరాబాద్‌కు పిలిపించి ప్రపంచం ముందు దేశ పరువు తీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఉగ్రవాదులు, తీవ్రవాదులు, నక్సలైట్లతో అంటకాగిన చరిత్ర కాంగ్రెస్‌దని, ఉమ్మడి రాష్ట్రంలో స్పీకర్ శ్రీపాదరావు, సీనియర్ నేతలు హయగ్రీవాచారి, నర్సిరెడ్డి, ఐపీఎస్ అధికారి వ్యాస్ వంటి ఎందరినో నక్సలైట్లు పొట్టనపెట్టుకున్న విషయాన్ని రేవంత్ రెడ్డి మర్చిపోయారా అని నిలదీశారు.

విదేశీ గడ్డపై అటల్ బిహారీ వాజ్‌పేయి అయినా, మన్మోహన్ సింగ్ అయినా, నరేంద్ర మోదీ అయినా వారంతా భారత ప్రధానమంత్రులేనని.. జర్మనీ నుంచి భారత ప్రధానిని, దేశ ప్రజాస్వామ్యాన్ని అవమానించే వ్యక్తులకు రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలికే కుసంస్కారం బీజేపీ ప్రభుత్వానికి లేదని తేల్చిచెప్పారు. 

100 ఎన్నికల్లో ఓడిపోయి ‘డిఫీట్ సెంచరీ’ కొట్టిన రాహుల్ గాంధీ.. పిట్టల దొరలా తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఎన్నికల వ్యవస్థలను తప్పుపడుతున్నారని మండిపడ్డారు. తనను తాను మోదీకి బానిస అని రేవంత్ రెడ్డి విమర్శించడంపై స్పందిస్తూ.. ప్రధానమంత్రి నాయకత్వంలో మంత్రులందరూ కలిసి పనిచేయడం రాజ్యాంగబద్ధమైన సంప్రదాయమని, రేవంత్ రెడ్డిలాగా వారానికోసారి సూట్‌కేసులు మోసుకుంటూ ఢిల్లీకి వెళ్లి అధిష్ఠానానికి కప్పం కట్టే సంస్కృతి తమది కాదని బదులిచ్చారు. 

మరిన్ని వార్తలు