తెలంగాణ గురించి చెప్పండి!
- విదేశీ ప్రతినిధులతో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
- రాష్ట్రంలో పెట్టుబడులకు రాయబారులుగా నిలవాలని పిలుపు
నవంబర్ 14 (విజయక్రాంతి) : తెలంగాణలో పెట్టుబడులకు గల అవకాశాలను ప్రపంచానికి చాటే రాయబారులుగా నిలవాలని రాష్ట్ర నీటిపారుదల ఉత్తమ్ కుమార్‌రెడ్డి(Uttam Kumar Reddy) విదేశీ ప్రతినిధులకు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో జరిగిన భారత్ సమ్మిట్(India Summit) ముగింపు సమావేశంలో శనివారం ఆయన మాట్లాడారు. ఆర్థిక వృద్ధికి విస్తృత పెట్టుబడులకు అత్యంత ఆశాజనకమైన రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని పేర్కొన్నారు.
ఆవిష్కరణలు, అంతర్జాతీయ భాగస్వామ్యాలకు రాష్ట్రం ప్రధాన కేంద్రంగా ఎదిగిందని పేర్కొన్నారు. తమకున్న అంతర్జాతీయ పరిచయాలను ఉపయోగించి ఆయా దేశాల పెట్టుబడిదారులు, సంస్థలు, వ్యాపార వర్గాలను తెలంగాణతో అనుసంధానించాలని కోరారు. సదస్సుకు వచ్చిన విదేశీ ప్రతినిధులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. మారుతున్న ప్రపంచ వ్యవస్థను, అందులో భారత్ స్థానాన్ని పరిశీలించేందుకు ఈ సదస్సు వేదికగా నిలిచిందని ఉత్తమ్‌కుమార్ అన్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ పాల్గొనడంతో సదస్సుకు ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుందని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను వినేందుకు రాహుల్ గాంధీ చూపే ఆసక్తిని, రాజ్యాంగ విలువలు, సామాజిక న్యాయం, భారత వైవిధ్యానికి సంబంధించిన కీలక ప్రశ్నలను ఆయన లేవనెత్తే తీరును అభినందించారు. అంతర్జాతీయ వేదికపై భారత్ స్వరానికీ, దేశం తీసుకునే నిర్ణయాలకూ ప్రాధాన్యం పెరుగుతున్న తరుణంలో, ప్రజల ఆకాంక్షలను ప్రపంచంలో భారత్ పోషించాల్సిన పాత్రతో ముడిపెట్టి చూడగల రాహుల్ గాంధీ దృక్పథానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉందన్నారు.
‘మా రాష్ట్రంలో మీ అనుభవాలను పంచుకోండి. ఇక్కడి అవకాశాలను పరిశీలించేందుకు ఇతరులను ప్రోత్సహించండి. తెలంగాణకు పెట్టుబడులు తీసుకు రావడంలో తోడ్పడండి’ అని విదేశీ ప్రతినిధులకు మంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ సద స్సులో జరిగిన చర్చలు, అభిప్రాయాల మార్పిడి దీర్ఘకాలిక సంబంధాలకు, మరింత విస్తృతమైన అంతర్జాతీయ సహకారానికి దారితీస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.