న్యాల్‌కల్‌లో ‘నల్లరాయి’ దోపిడీ!

15-11-2026 | 05:20am
  1. మలిగి శివారులో పెట్రేగిపోతున్న మైనింగ్ మాఫియా
  2. బీదర్ మాఫియా చేతిలో సరిహద్దు కొండలు
  3. అక్రమంగా కంకర తరలింపు
  4. ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి
  5. పట్టించుకోని రెవెన్యూ, మైనింగ్ అధికారులు

జహీరాబాద్, నవంబరు ౧౪ (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాల్‌కల్ మండలంలో మైనింగ్ మాఫియా(Mining mafia) ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ అనుమతులు(Government Approvals) లేకుండానే కొండలను పిండి చేస్తూ, నల్లరాయిని ఇష్టారీతిన తరలిస్తున్నా పట్టించుకోవాల్సిన అధికారులు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మండలంలోని మలిగి గ్రామ శివారు కర్ణాటక రాష్ట్రానికి సరిహద్దుగా ఉండటాన్ని ఆసరాగా చేసుకుని, కొందరు మైనింగ్ కేటుగాళ్లు ఇక్కడ మూడు పువ్వులు ఆరు కాయలుగా అక్రమ వ్యాపారాన్ని సాగిస్తున్నారు. మలిగి గ్రామ శివారులో అనేక సంవత్సరాలుగా ఈ అక్రమ తవ్వకాలు సాగుతున్నాయి. కర్ణాటక రాష్ట్రం బీదర్‌కు చెందిన కొందరు మైనింగ్ నిర్వాహకులు ఇక్కడి సరిహద్దు ప్రాంతాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్నారు.

తెలంగాణ పరిధిలోని నల్లరాయిని భారీ మిషన్లతో తవ్వి, అక్కడికక్కడే కంకరగా మారుస్తున్నారు. అనంతరం ఆ కంకరను యథేచ్ఛగా సరిహద్దు దాటించి బీదర్‌కు తరలిస్తూ రూ.లక్షలు గడిస్తున్నారు. మలిగి శివారులో దాదాపు పది మీటర్ల (30 అడుగులకు పైగా) లోతు వరకు భూమిని తవ్వేసి నల్లరాయిని పిండి చేస్తున్నట్లు క్షేత్రస్థాయి పరిశీలనలో తేలింది. వీరు ప్రభుత్వానికి ఎలాంటి రాయల్టీ గానీ, మైనింగ్ ఫీజులు గానీ చెల్లించకపోవడంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతోంది.

భారీ బ్లాస్టింగులు.. దద్దరిల్లుతున్న గ్రామాలు

ఈ ప్రాంతంలో మైనింగ్ మాఫియా నిబంధనలకు విరుద్ధంగా భారీ ఎత్తున విస్ఫోటనాలు (బ్లాస్టింగ్స్) జరుపుతోంది. పెద్ద పెద్ద శబ్దాలతో జిలెటిన్ స్టిక్స్ వాడుతుండటంతో చుట్టుపక్కల గ్రామాలు దద్దరిల్లుతున్నాయి. కంకర తీసేందుకు భారీ క్రషర్ యంత్రాలను రాత్రింబవళ్లు ఉపయోగిస్తుండటంతో వస్తున్న శబ్దాలు, విపరీతమైన దుమ్ము వల్ల స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

అధికారుల తీరుపై అనుమానాలు!

ప్రతిరోజూ వందలాది లారీల కంకర సరిహద్దులు దాటుతున్నా మండల తహసిల్దార్ గానీ, జిల్లా మైనింగ్ అధికారులు కానీ అటువైపు వెళ్లకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మైనింగ్ మాఫియా ప్రతి ఏటా స్థానిక యంత్రాంగానికి భారీగా ‘మామూళ్లు’ సమర్పిస్తుండటం వల్లే చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఈ మైనింగ్ ప్రాంతానికి వెళ్లాలంటే తెలంగాణ వైపు నుంచి సరైన దారి లేదు.

కర్ణాటక సరిహద్దులోకి వెళ్లి, అటు నుంచి బీదర్ మున్సిపాలిటీకి చెందిన చెత్త డంపింగ్ యార్డ్ మధ్య నుండే ఈ కంకర మిషన్ల వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ కుప్పలుగా పేరుకుపోయిన మున్సిపల్ చెత్త వల్ల వచ్చే విపరీతమైన దుర్వాసన భరించలేకే అధికారులు ఆ ప్రాంతానికి వెళ్లేందుకు వెనుకాడుతున్నారని స్థానికులు వాపోతున్నారు. ఈ లూప్హోల్ను వాడుకుని మాఫియా తమ అక్రమ సామ్రాజ్యాన్ని నిరాటంకంగా నడుపుతోంది.

స్థానిక రెవెన్యూ, పోలీస్ అధికారుల పాత్రపై నిరుపేద రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరిహద్దు సమస్యలను సాకుగా చూపిస్తూ, కర్ణాటక స్మగ్లర్లకు ఇక్కడి అధికారులు పరోక్షంగా సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సరిహద్దు ముసుగులో సాగుతున్న ఈ దోపిడీపై జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు