హాట్ హాట్‌గా హుజురాబాద్ క్లబ్ ఎన్నికలు
హుజురాబాద్, నవంబర్ 14 (విజయక్రాంతి): హుజురాబాద్ ఆఫీసర్స్ క్లబ్ ఎన్నికలు(Huzurabad Officers' Club Elections) పట్టణంలో హాట్ హాట్ చర్చకు దారితీస్తున్నాయి. ఈ నెల 15న జరగనున్న ఎన్నికల్లో రెండు ప్యానళ్ల మధ్య హోరాహోరీ పోటీ నెలకొనడంతో క్లబ్ రాజకీయం వేడెక్కింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు వివిధ ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది.
మందు, విందులతో క్లబ్ సభ్యులకు ఆతిథ్యాలు ఇస్తూ తమ ప్యానల్‌కు మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఎన్నికలు క్లబ్ అభివృద్ధి, సభ్యుల సంక్షేమం కోసమా? లేక వ్యక్తిగత ప్రయోజనాలు, రాజకీయ మనుగడ కోసమా? అన్న ప్రశ్నలు పట్టణంలో వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వ స్థలంలో.. ప్రజాధనంతో నిర్మాణం!
హుజురాబాద్ ఆఫీసర్స్ క్లబ్ ప్రభుత్వ స్థలంలో, ప్రభుత్వ నిధులతో నిర్మాణమై కాలక్రమేణా అభివృద్ధి చెందిందని స్థానికులు పేర్కొంటున్నారు. ప్రజాధనంతో ఏర్పాటైన క్లబ్ మాత్రం సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా కొందరు సంపన్నులు, పలుకుబడి కలిగిన వర్గాలకే పరిమితమైందనే విమర్శలు ఉన్నాయి.
ప్రజల ఆస్తిగా భావిస్తున్న క్లబ్ నిర్వహణలో పారదర్శకత ఎందుకు లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. క్లబ్ బైలాలో పేర్కొన్న నిబంధనలు, ఆస్తుల నిర్వహణ, ఆదాయ వ్యయాల వివరాలను సభ్యుల ముందు ఉంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.
ముఖ్యంగా గత పదేళ్లుగా క్లబ్‌కు వచ్చిన ఆదాయం ఎంత? ఖర్చు చేసిన నిధులు ఎక్కడెక్కడ వినియోగించారు? సభ్యత్వ రుసుముల ద్వారా సమకూరిన డబ్బు ఎంత? క్లబ్ భూముల విక్రయం ద్వారా వచ్చిన ఆదాయం ఏ ఖాతాలో జమ చేశారు? అనే ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. క్లబ్ ప్రాంగణంలో గతంలో నిర్వహించిన పోలీసు క్యాంపుల ద్వారా సుమారు రూ.19 లక్షల ఆదాయం వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
అదేవిధంగా కోర్టు నిర్వహణకు సంబంధించిన అద్దెల రూపంలో కూడా లక్షలాది రూపాయలు సమకూరినట్లు సమాచారం. క్లబ్కుచెందిన నాలుగు గుంటల స్థలాన్ని పక్కనే ఉన్న సినిమా థియేటర్‌కు విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారాలకు సంబంధించిన ఒప్పందాలు, అనుమతులు, నగదు లావాదేవీలు, ఆదాయ వ్యయాల వివరాలను బహిర్గతం చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.