మురిపిస్తున్న టెట్..దిక్కులేని డీఎస్సీ!
రెండున్నరేళ్లు గడిచినా ఊసే కరువు
- ఇప్పటికే 6 టెట్ నోటిఫికేషన్లు
- ప్రభుత్వ తీరుపై నిరుద్యోగుల్లో ఆగ్రహం
- మెగా డీఎస్సీ వేయాలని డిమాండ్
నవంబర్ 14 (విజయక్రాంతి): ‘టెట్(TET) (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) రాసిరాసి విసిగిపోయాం. ఇంకా డీఎస్సీ వేసేదెప్పుడు?’ అని డీఎడ్, బీఎడ్ అభ్యర్థులు(D.Ed. and B.Ed. candidates) ప్రశ్నిస్తున్నారు. డీఎస్సీ కోసం వేలాది మంది అర్హత ఉన్న అభ్యర్థులు మూడేళ్లుగా ఎదురు చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్(Congress in power) అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఆరు టెట్ నోటిఫికేషన్లు(TET notification) వేయగా ఒక్కటే డీఎస్సీ నోటిఫికేషన్‌ను(DSC Notification) భర్తీ చేసింది.
ఈ డీఎస్సీ కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనిదే. బీఆర్ఎస్ వేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేసి దానికి మరికొన్ని పోస్టులు కలిపి 11 వేల ఉపాధ్యాయ పోస్టులతో నోటిఫికేషన్‌ను జారీ చేశారు. ఆతర్వాత మరో డీఎస్సీ వేస్తామని డిప్యూటీ సీఎం అప్పట్లోనే ప్రకటించారు. కానీ ఇంతవరకు దానిపై ఊసేలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో ఆరు టెట్ నోటిఫికేషన్లు వేసింది. కేవలం టెట్ నోటిఫికేషన్లు వేసి కాలయాపన చేస్తుందనే విమర్శలు అభ్యర్థుల నుంచి వినిపిస్తున్నాయి. స్వరాష్ట్రం లో ఉద్యోగ నోటిఫికేషన్లు వరుసగా వస్తాయనుకుంటే ఏళ్లుగడుస్తున్నా నోటిఫికేషన్ల జాడ లేదని వాపోతున్నారు.
టెట్తోనే సరి..
ఉపాధ్యాయ ఉద్యోగం కోసం నిరీక్షిస్తున్న అభ్యర్థుల ఆవేదన అంతా ఇంతా కాదు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లుగానే ఏడాదికి రెండు సార్లు.. ఆరు నెలలకు ఒకటి చొప్పున టెట్ నోటిఫికేషన్‌ను జారీ చేస్తోంది. కానీ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మాత్రం వేయా ల్సిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను వేయడం లేదు. డీఎస్సీ నోటిఫికేషన్ వేయకుండా కేవలం ఈ టెట్ నోటిఫికేషన్‌తోనే సరిపెడుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అభ్యర్థులు పలుమార్లు టెట్ రాసి అర్హత సాధించి ఉన్నారు.
రాసినవాళ్లు ఇంకెన్ని సార్లు టెట్ రాయాలని ప్రశ్నిస్తున్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ వేస్తే దానికోసం సన్నద్ధమవుతామని చెప్తున్నారు. డీఎస్సీ వేయకుండా ఇలానే టెట్ రాస్తూ ఎన్ని సంవత్సరాలు ఎదురు చూడాలని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. తక్షణమే 10 వేల నుంచి 15 వేల పోస్టులతో డీఎస్సీ వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 నుంచి నేటి వరకు ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం లక్షలాది మంది డీఎడ్, బీఎడ్ అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు.
ప్రత్యేక రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని, ప్రతి సంవత్సరం ఉపాధ్యాయ నియామకాలు జరుగుతాయని ఆశించిన నిరుద్యోగులకు నేటికీ నిరాశే ఎదురవుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల పాలనలో ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియ ఆశించిన స్థాయిలో జరగలేదు. 2017లో 8,792 పోస్టులతో టీఆర్టీ నోటిఫికేషన్ విడుదల కాగా, 2023లో 5,089 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి అనంతరం దాన్ని రద్దు చేసి,
2024 ఫిబ్రవరి 29న 11,062 పోస్టులతో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ ప్రక్రియను చేపట్టింది. అయితే ఆ తర్వాత ఏర్పడిన ఉపాధ్యాయ ఖాళీల భర్తీపై ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టమైన కార్యాచరణ ప్రకటించకపోవడం అభ్యర్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. 2024 జూలైలో డీఎస్సీ పరీక్షలను వాయిదా వేసి, అన్ని ఖాళీలతో మెగా డీఎస్సీ నిర్వహించాలని నిరుద్యోగ అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందిస్తూ, ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీని వాయిదా వేయడం సాధ్యం కాదని, అదనంగా గుర్తించిన సుమారు 5,000 నుంచి 6,000 ఉపాధ్యాయ పోస్టులతో మరో డీఎస్సీ నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేస్తామని అభ్యర్థులకు హామీ ఇచ్చారు.
అయితే ఆ హామీ ఇచ్చి రెండేళ్లు గడుస్తున్నా మరో సాధారణ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కాకపోవడం దురదృష్టకరమని అభ్యర్థులు వాపోతున్నారు. అధికారంలోకి వచ్చినప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా? నిరుద్యోగుల ఆందోళనలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
ఎందుకీ నిర్లక్ష్యం?
తెలంగాణ వస్తే మన ఉద్యోగాలు మనకు వస్తాయని చెప్పిన పాలకులు ఆశించిన స్థాయిలో ఉద్యోగ నోటిఫికేషన్లను జారీ చేయడంలేదని వాపోతున్నారు. గత ప్రభుత్వం తరహాలోనే ఈ ప్రభుత్వం కూడా భారీ నోటిఫికేషన్లను వేయడంలేదని చెప్తున్నారు. తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా డీఎస్సీలను అక్కడి ప్రభుత్వాలు వేస్తున్నాయి. ఏపీలో నాలుగు డీఎస్సీలు వేస్తే తెలంగాణలో మాత్రం కేవలం రెండు నోటిఫికేషన్లే వేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా ఉపాధ్యాయ నియామకాలు చేపడుతుంటే తెలంగాణలో మాత్రం తదుపరి డీఎస్సీ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యా వ్యవస్థ, నిరుద్యోగుల అవసరాలు ఒకే విధంగా ఉన్నప్పుడు తెలంగాణలో మాత్రమే ఉపాధ్యాయ నియామకాలకు ఎందుకింత జాప్యం జరుగుతుందని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు.
డీఎస్సీ నోటిఫికేషన్ వేయాలి
డీఎస్సీ నోటిఫికేషన్ వెంటనే వేయాలి. టెట్ ప్రక్రియ పూర్తయ్యేలోపు నిర్ణయం ప్రకటించాలి. పరీక్ష ఫీజుల పేరిట ఆదాయం సమకూర్చుకోవడానికే టెట్లు వేస్తున్నట్లు ఉంది. ఇప్పటికే ఆరుసార్లు టెట్ పెట్టారు. ఉద్యోగాల నోటిఫికేషన్‌కు మాత్రం ప్రభుత్వం ముందుకు రావడం లేదు. రెండేళ్ల క్రితం ఇచ్చిన హామీని కూడా అమలు చేయలేని పరిస్థితి ఎందుకు ఏర్పడింది. డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల జీవితాలతో చెలగాటం ఆడకుండా తక్షణమే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌పై స్పష్టత ఇవ్వాలి.
దుర్గం హరీష్, మంచిర్యాల
ప్రభుత్వానికి ప్రధాన డిమాండ్లు
1. 2026లో తదుపరి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయాలి.
2. 2024లో ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన మరో డీఎస్సీ హామీని వెంటనే అమలు చేయాలి.
3. అదనంగా గుర్తించిన 5,000 నుంచి 6,000 ఉపాధ్యాయ పోస్టుల ప్రస్తుత స్థితిని వెల్లడించాలి.
4. పదోన్నతులు, రిటైర్మెంట్లు, కొత్తగా ఏర్పడిన ఖాళీలతో కలిపి సమగ్ర ఉపాధ్యాయ ఖాళీల నివేదిక విడుదల చేయాలి.
5. 2027 జనవరి టెట్ అనంతరం ఆలస్యం చేయకుండా మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలి.
6. గురుకుల, మోడల్ స్కూల్స్, కేజీబీవీలు, ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి.
7. ప్రతి సంవత్సరం ఉపాధ్యాయ నియామకాలు చేపట్టేలా వార్షిక జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి.
8. టెట్ పరీక్ష ఫీజులను తగ్గించి నిరుద్యోగులకు ఉపశమనం కల్పించాలి.
9. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయ పోస్టులను మంజూరు చేయాలి.