రైతుల కష్టం వ్యాపారులపాలు!
వెంకగారి భూమయ్య :
తెలంగాణలో బియ్యం ధరల(Rice prices) పెరుగుదలపై ప్రభుత్వం ఒక్కసారిగా అప్రమత్తమైంది. బియ్యం కొరత ఉందంటూ జరుగుతున్న ప్రచారాన్ని పౌరసరఫరాల శాఖ(Department of Civil Supplies) ఖండించడమే కాకుండా వివిధ రకాల బియ్యానికి గరిష్ట విక్రయ ధరలను నిర్ణయించింది. బీపీటీ, కేఎన్ఎం రకాల బియ్యం కిలో రూ.66, ఆర్ఎన్ఆర్, తెలంగాణ సోనా రూ.74, హెచ్ఎంటీ, జేఎస్ఆర్ రకాల బియ్యం రూ.79గా ధరలను ప్రకటించింది. నిర్ణయించిన ధరల కంటే అధికంగా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
సామాన్య వినియోగదారుల(Consumers) ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సమంజసమే. కానీ ఇక్కడే ఒక ప్రశ్న ఉత్పన్నమవుతోంది. బియ్యం ధరలు పెరిగితే వెంటనే స్పందించే ప్రభుత్వానికి ధాన్యం పండించిన రైతుకు గిట్టుబాటు ధర దక్కకపోతే ఎందుకు స్పందన ఉండటం లేదు?
పంట రైతుది.. ధరలేమో వ్యాపారిదా?
రైతు విత్తనం వేసిన రోజు నుంచి పంట చేతికి వచ్చే వరకు ఎన్నో కష్టాలు పడతాడు. విత్తనాలు, ఎరువులు, పురుగుమం దులు, కూలీల వేతనాలు, సాగునీరు, విద్యుత్, యంత్రాల అద్దెలు, కోతలు, రవా ణా ఇలా ప్రతి దశలోనూ పెట్టుబడి పెడతాడు. ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాలు, తెగుళ్లు ఎదురైనా పంటను కాపాడుకోవడానికి శ్రమిస్తాడు.చివరకు ధాన్యం చేతికి వచ్చినప్పుడు మాత్రం దాని ధర నిర్ణయించే అధికారం అతని చేతిలో ఉండదు. అప్పులు తీర్చాలి, కుటుంబాన్ని పోషించాలి, పిల్లల చదువులు కొనసాగించాలి, తదుపరి పంటకు పెట్టుబడి సమకూర్చుకోవాలి. ఈ పరిస్థితుల్లో వ్యాపారులు చెప్పిన ధరకు ధాన్యం విక్రయించాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. పంట పండించే రైతుకు ధర నిర్ణయించే అవకాశం లేకపోవడం వ్యవసాయ వ్యవస్థలోని ప్రధాన లోపం.
వడ్లు రూ.3 వేలు, రైస్ రూ.7వేలు !
క్వింటాల్ ధాన్యం సుమారు రూ.3 వేల ధర పలుకుతుంటే, అదే ధాన్యం నుంచి తయారైన బియ్యం క్వింటాల్ సుమారు రూ.7 వేల వరకు విక్రయించే పరిస్థితి కనిపిస్తోంది. అంటే రైతు ఉత్పత్తి చేసిన ముడిసరుకుకు లభిస్తున్న ధరకు, వినియోగదారుడు చెల్లిస్తున్న ధరకు మధ్య భారీ వ్యత్యాసం ఉంది. అయితే ఈ వ్యత్యాసమంతా వ్యాపారుల లాభమేనని చెప్పడం సరైంది కాదు. ధాన్యాన్ని మరపట్టడానికి విద్యుత్, కార్మికుల వేతనాలు, రవాణా, నిల్వ, ప్యాకింగ్ వంటి ఖర్చులు ఉంటాయి. బియ్యంతో నూకలు,తవుడు, పొట్టు కూడా వస్తాయి. వీటి విలువను కూడా లెక్కించాలి. కానీ అన్ని ఖర్చులు పోను మిల్లర్లు, వ్యాపారులకు మిగులుతున్న లాభమెంత? రైతుకు అందుతున్న వాటా ఎంత? ప్రభు త్వం ఈ లెక్కలను ఎందుకు ప్రజల ముందుంచడం లేదు? ఇదే అసలు ప్రశ్న.
రైతును పట్టించుకునేదెవరు?
బియ్యం ధరలు పెరిగితే వినియోగదారులపై భారం పడుతుందని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. మరి ధాన్యం ధరలు పడిపోయినప్పుడు రైతులపై పడే భారం గురించి ఎవరు ఆలోచించాలి? కనీస మద్దతు ధర ప్రకటించడం మాత్రమే సరిపోదు. ఆ ధరకు కొనుగోళ్లు జరిగేలా చూడాలి. తేమ శాతం, నాణ్యత, తరుగుదల పేరుతో రైతుల ధాన్యానికి అన్యాయ మైన కోతలు విధించకుండా పర్యవేక్షించాలి. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో జాప్యం జరిగితే రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇదే అవకాశంగా భావించే కొందరు వ్యాపారులు తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతు అప్పుల ఒత్తిడిలో ఉన్నప్పుడు తన పంటను నిల్వ చేసుకునే స్థోమత ఉండదు. చివరకు వచ్చిన ధరకు అమ్ముకొని నష్టాన్ని భరించాల్సి వస్తోంది.
ధరల నియంత్రణలో రైతుకేం లాభం!
ప్రభుత్వం బియ్యం విక్రయ ధరలకు గరిష్ట పరిమితులు విధించడం ఎంత ముఖ్యమో, రైతు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించడం కూడా అంతే ముఖ్యం.
వినియోగదారుడికి తక్కువ ధరకు బియ్యం అందించాలనే పేరుతో రైతు ఆదాయాన్ని తగ్గించడం పరిష్కారం కాదు. మిల్లర్లు, వ్యాపారులు తమ పెట్టుబడికి తగిన న్యాయమైన లాభం పొందాలి. అదే సమయంలో రైతు కూడా తన సాగు ఖర్చులు తిరిగి పొందడంతో పాటు తగిన ఆదాయం పొందాలి. ఈ మూడు వర్గాల ప్రయోజనాల మధ్య సమతుల్యత సాధించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ధాన్యం కొనుగోలు చేసిన పరిమాణం, మిల్లింగ్ అనంతరం వచ్చిన బియ్యం, ఉప ఉత్పత్తుల పరిమాణం, వాటి విక్రయ ధరలు, మిల్లింగ్ ఖర్చులపై ప్రభుత్వం సమగ్ర పరిశీలన చేయాలి. ధాన్యం నుంచి బియ్యం వినియోగదారుడి చేతికి చేరే వరకు ప్రతి దశలో పారదర్శకత తీసుకురావాలి. కనీస మద్దతు ధర కంటే తక్కువకు కొనుగోళ్లు జరగకుండా ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. రైతు విక్రయించిన ధాన్యానికి నిర్ణీత సమయంలోనే నగదు చెల్లించేలా చర్యలు తీసుకోవాలి..
రైతు బతికితేనే ఆహార భద్రత!
రైతు పండించిన ధాన్యం లేకుండా బియ్యం మార్కెట్లోకి రాదు. రైతు వ్యవసాయం నుంచి దూరమైతే భవిష్యత్తులో ఆహార ఉత్పత్తిపైనే ప్రభావం పడుతుంది. ఇప్పటికే పెరుగుతున్న పెట్టుబడులు, తగ్గుతున్న గిట్టుబాటు ధరలు, అప్పుల భారం రైతాంగాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెడుతున్నాయి. ఇలాంటి సమయంలో ప్రభుత్వం రైతు ఆదాయానికి భరోసా కల్పించాలి. బియ్యం ధరల నియంత్రణ చర్యలతో పాటు ధాన్యం ధరల విషయంలోనూ సమానమైన శ్రద్ధ చూపాలి. రైతుకు న్యాయమైన ధర లభిస్తేనే వ్యవసాయం లాభసాటిగా మారుతుంది.
పాలకులు ఆలోచించాల్సిన ప్రశ్న ఒక్కటే.. బియ్యం కిలో రూ.70కు విక్రయించే పరిస్థితిలో వినియోగదారుడి ప్రయోజనాల కోసం ధరలను నియంత్రిస్తున్న ప్రభుత్వం, అదే బియ్యానికి మూల మైన ధాన్యం పండించిన రైతుకు న్యాయమైన ధర కల్పించడానికి ఎందుకు సమానమైన చొరవ చూపడం లేదు? రైతు కష్టానికి విలువ లేకుండా వ్యాపార వ్యవస్థలో ధరల నియంత్రణకు అర్థమేమిటి? రైతు నష్టపోతే దేశ ఆర్థిక వ్యవస్థకే నష్టం. వ్యాపా రులకు న్యాయమైన లాభం, వినియోగదారుడికి అందుబాటు ధర, రైతుకు గిట్టుబాటు ధర.. ఈ మూడింటినీ సమన్వయం చేసినప్పుడే నిజమైన సంక్షేమం సాధ్యమవుతుంది. బియ్యం ధరలకు కళ్లెం వేయడం మాత్రమే పాలన కాదు.. ధాన్యం పండించిన రైతు కన్నీళ్లకు అడ్డుకట్ట వేయడమే నిజమైన రైతు సంక్షేమం!
వ్యాసకర్త : సీనియర్ జర్నలిస్ట్, 9848559863