రూ. కోటి వరకు రుణాలు మరో ఐదేండ్లు పొడిగింపు

12-11-2026 | 05:20am

మహిళలు, ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కేంద్రం గుడ్‌న్యూస్

  1. రైతులకు ఎరువులపై సబ్సిడీ 64 శాతానికి పెంపు
  2. ‘యుగే యుగీన్ భారత్ నేషనల్ మ్యూజియం’ ఏర్పాటు
  3. రూ.2,390 కోట్లతో నోయిడాలో మెట్రో రవాణా విస్తరణ
  4. కేంద్ర క్యాబినెట్‌లో కీలక నిర్ణయాలు

న్యూఢిల్లీ, నవంబర్ 11: కేంద్ర ప్రభుత్వం(Central Government) మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు చెందిన ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు(Industrialists) శుభవార్త అందించింది. స్టాండ్ అప్ ఇండియా పథకాన్ని(Stand Up India Scheme) మరో ఐదేళ్ల పాటు పొడిగించేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. బుధవారం ప్రధాని మోదీ(Prime Minister Modi) అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. దీని కోసం క్రెడిట్ గ్యారెంటీ కార్పస్ కింద రూ.4,111 కోట్లు కేటాయించింది.

ఈ పథకం ద్వారా అర్హులైన వారు రూ.10 లక్షల నుంచి రూ.1 కోటి వరకు బ్యాంకు రుణాలు పొందవచ్చు. ఈ పథకం కింద వచ్చే ఐదేళ్లలో మరో 2.5 లక్షల మంది లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. చిన్న, సూక్ష్మ పరిశ్రమలకు రుణ సదుపాయాలను మెరుగుపరిచే లక్ష్యంతో క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ కోసం రూ.5,000 కోట్లు కేటాయించేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. చిన్న వ్యాపారవేత్తలకు బ్యాంకుల నుంచి రుణాలు పొందే అవకాశాలు పెంచడం, పారిశ్రామిక కార్యకలాపాలను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. 

ఎరువుల సబ్సిడీకి రూ.62,370 కోట్లు

ఎల్ నినో, పశ్చిమాసియా సంక్షోభంతో ఇబ్బంది పడుతున్న రైతులకు కూడా కేంద్ర క్యాబినెట్ ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది రబీ సీజన్‌కు సంబంధించి ఫాస్పేట్, పొటాష్ ఆధారిత ఎరువులపై సబ్సిడీని 64.3 శాతానికి పెంచింది. గత సీజన్‌లో రూ.37,952 కోట్లుగా ఉన్న సబ్సిడీ బడ్జెట్‌ను ఈసారి రూ.62,370 కోట్లకు పెంచింది. అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుతున్న ఎరువుల ధరల భారం మన రైతులపై పడకుండా చూడటమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కొత్త సబ్సిడీ రేట్లు ఈ ఏడాది అక్టోబర్ ఒకటో తేదీ నుంచి వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు అమల్లో ఉంటాయి. 

మ్యూజియం ఏర్పాటుకు 3,230 కోట్లు

భారత దేశ చరిత్ర, నాగరికత, సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పే లక్ష్యంతో న్యూఢిల్లీలోని చారిత్రక నార్త్, సౌత్ బ్లాక్ భవనాల్లో ‘యుగే యుగీన్ భారత్ నేషనల్ మ్యూజియం’ ఏర్పాటు చేయనున్నారు. 1,78,509 చదరపు మీటర్ల ప్రదర్శనా స్థలంలో ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియంగా తీర్చిదిద్దే ఈ భారీ ప్రాజెక్టుకు రూ.3,230 కోట్లు కేటాయించారు. తొలి గ్యాలరీని 2027 ద్వితీయార్థంలో సందర్శకులకు అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మ్యూజియాన్ని ఏటా కొటి మంది సందర్శిస్తారని అంచనా వేస్తున్నారు.

నోయిడా, గ్రేటర్ నోయిడా ప్రాంతాల్లో మెట్రో రవాణాను విస్తరించేందుకు కూడా కేంద్రం ఆమోదం తెలిపింది. నోయిడా సెక్టార్-51 నుంచి గ్రేటర్ నోయిడా సెక్టార్-04 వరకు 8.449 కిలోమీటర్ల మేర కొత్త మెట్రో కారిడార్ నిర్మాణంతో పాటు ఐదు ఎలివేటెడ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం రూ.2,390 కోట్లు కేటాయించారు. ఈ ప్రాజెక్టుతో నోయిడా ప్రాంతంలో రద్దీ తగ్గడంతో పాటు ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యం కలుగుతుంది. ఈ పథకాలన్నింటికీ కలిపి రూ.77,101 కోట్లు విడుదల చేసేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 

మరిన్ని వార్తలు