ఇది యాంటీ భారత్ సమ్మిట్!

12-11-2026 | 05:35am

రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా రీలాంచ్ చేసేందుకే ఈ సదస్సు

6 గ్యారెంటీలు అమలు చేయకుండా రాహుల్, ప్రియాంక తెలంగాణలో అడుగుపెడితే అడ్డుకుంటాం

ప్రభుత్వ భూములను తెగనమ్మి రాష్ట్రంలో పాలన సాగిస్తున్న రేవంత్ సర్కార్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు

నవంబర్ 11 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో కాంగ్రెస్ పార్టీ(Congress Party) తలపెట్టిన ‘భారత్ సమ్మిట్(Bharat Summit)’ అసలు భారత్ సమ్మిట్టే కాదని, అది ముమ్మాటికీ దేశద్రోహ శక్తులు కూడబలుక్కుని ప్రోగ్రెసివ్ అలయెన్స్ నడుపుతున్న ‘యాంటీ భారత్ సమ్మిట్(Anti-Bharat Summit)’ అని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అంతర్జాతీయ కుట్ర శక్తుల అండతో రాహుల్ గాంధీని(Rahul Gandhi) ప్రధాని అభ్యర్థిగా రీలాంచ్ చేసేందుకే ఈ సదస్సును నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

జార్జ్ సోరోస్, ప్రోగ్రెసివ్ అలయెన్స్ కనుసన్నల్లో దేశంలో అలజడి, అరాచకాలు సృష్టించే ‘రెజీమ్ చేంజ్’ కుట్ర చేస్తున్నట్లు ఆరోపించారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ...తొలుత ఇది తెలంగాణకు పెట్టుబడులు ఆకర్షించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న సదస్సు అనుకున్నారని, కానీ గత రెండు రోజులుగా సల్మాన్ ఖుర్షీద్, చికాగో నుంచి శామ్ పిట్రోడా చేసిన ట్వీట్లను గమనిస్తే ఇది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విదేశీ శక్తులతో కలిసి చేస్తున్న కుట్రపూరిత సమావేశమని బట్టబయలైందని తెలిపారు.

100 దేశాల నుంచి వచ్చే ప్రతినిధుల ముందు రాహుల్ గాంధీ ఆలోచనా విధానాన్ని ఉంచి, ఆయనను కాబోయే ప్రధానిగా, ప్రధానమంత్రి మెటీరియల్‌గా షోకేస్ చేయడానికే ఈ వేదికను వాడుకుంటున్నారని కాంగ్రెస్ నేతలే బహిరంగంగా చెబుతున్నారన్నారు. భారతదేశంలో 140 కోట్ల ప్రజల చేతిలో పదేపదే తిరస్కారానికి గురై విఫలమైన రాహుల్ గాంధీని.. 100 దేశాల నుంచి వచ్చే విదేశీ ప్రతినిధులను అడ్డుపెట్టుకొని లాంచ్ చేయాలని చూడటం హాస్యాస్పదమన్నారు. 

ప్రమాదకర శక్తులు..

ఈ ‘ప్రోగ్రెసివ్ అలయెన్స్’ వెనుక ఉన్నది అంతర్జాతీయంగా ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కూలదోసే ప్రమా దకర శక్తులని ఆయన ఆరోపించారు. ఫాక్స్ న్యూస్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ద్వారా అస్రా నొమాని వెలికితీసిన నిజాలను ప్రస్తావిస్తూ.. 9 దేశాల్లో విద్యార్థులను పావులుగా వాడుకుంటూ ఇస్లామిక్, కమ్యూనిస్ట్ ప్రొటెస్ట్ ఎకోసిస్టమ్‌ను నడుపుతున్న 101 సంస్థలు ఈ కూటమి వెనుక ఉన్నాయని తెలిపారు. ఇంతటి ప్రమాదకర వ్యవస్థలో రాహుల్ గాంధీ ప్రెసిడియం ఈక్వలెంట్ సభ్యుడి గా ఉన్నారని, మొన్నటికి మొన్న ఫ్రాన్స్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోయడానికి ‘రెజీమ్ చేంజ్’ పేరిట జరిగిన హింసాత్మక అల్లర్ల వెనుక వీరి పాత్ర ఉందని తేలిందన్నారు.

జార్జ్ సోరోస్ లాంటి భారత వ్యతిరేక శక్తుల నిధులతో నడిచే ప్రోగ్రెసివ్ ఇంటర్నేషనల్ డెలిగేషన్‌తో సోనియా గాంధీ 10 జనపథ్‌లో, మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ కార్యాలయంలో సమావేశమయ్యారని గుర్తు చేశారు. ఈ కూటమిలో ప్రజాస్వామ్యం లేని 42 ఇస్లామిక్ దేశాలు, లెఫ్టిస్ట్ దేశాలు, నియంతృత్వ రాచరిక వ్యవస్థల ప్రతినిధులే ఉన్నారని, అలాంటి శక్తులకు హైదరాబాద్‌ను అడ్డాగా మార్చి దేశంలో అలజడి సృష్టించా లని చూస్తున్నారని హెచ్చరించారు.

విదేశీ శక్తుల అండతో 2029 సార్వత్రిక ఎన్నికల వరకు దేశంలో నిరంతరం అరాచకాలు, హింసను సృష్టించి ప్రభుత్వ మార్పు తేవాలన్నదే కాంగ్రెస్ దుష్ట పన్నాగమని ఆరోపించారు. గతంలో కూడా ఇదే ప్రోగ్రెసివ్ అలయెన్స్, తెలంగాణ ప్రభుత్వం కలిసి నిర్వహించిన సమ్మిట్ కోసం సుమారు రూ. 29 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టారని, ఇప్పుడు మళ్లీ అదే రీతిలో నిధులు వాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బహుశా ఇక్కడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా ఈ అంతర్జాతీయ కుట్రల గురించి తెలియకపోవచ్చన్నారు.

ఆరు గ్యారెంటీల అమలేది..?

అసెంబ్లీ ఎన్నికల ముందు ఊరూరా తిరిగి ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు, వర్గాల వారీ డిక్లరేషన్లను  అమలు చేశాకే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు తెలంగాణలో అడుగుపెట్టాలని, వారు వస్తే బీజేపీ కార్యకర్తలు అడుగడుగునా నిరసన వ్యక్తం చేస్తూ అడ్డుకుంటారని తేల్చిచెప్పారు. అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు గడుస్తున్నా రైతులకు రైతుభరోసా ఇవ్వలేదని, ఎల్ నినో ప్రభావంతో పంట నష్టపోయిన రైతులకు పరిహారమూ చెల్లించలేదని విమర్శించారు.

గత 34 నెలలుగా ప్రభుత్వ భూముల అమ్మకాలు, మార్ట్‌గేజ్‌ల ద్వారా సుమారు రూ. 30 వేల కోట్లు సమకూ ర్చుకున్న ఈ ప్రభుత్వం.. ఆ నిధులను వేటి కోసం ఖర్చు చేసిందో ప్రజలకు శ్వేతపత్రం ద్వారా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు మళ్లీ మియాపూర్‌లోని 5 వేల ఎకరాల హెచ్‌ఎండీఏ, టీజీఐఐసీ విలువైన భూములను కారుచౌకగా ప్రైవేటు వ్యక్తులకు తెగనమ్మేందుకు, తాకట్టు పెట్టేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. 

17న రాష్ట్రానికి గడ్కరీ..

ఈనెల 17న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలంగాణలో నూతన జాతీయ రహదారుల ప్రారంభోత్సవానికి వస్తున్నారని తెలిపారు. రేషన్ బియ్యం మొదలుకొని ధాన్యం సేకరణ, ఎంఎస్పీ పెంపు, ఫసల్ బీమా వంటి ప్రతి సంక్షేమ పథకానికి కేంద్రమే వెన్నెముకగా నిలుస్తోందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ వైఫల్యాలను, దేశద్రోహ శక్తులతో ఆ పార్టీ కుమ్మక్కైన తీరును బీజేపీ క్షేత్రస్థాయిలో ఎండగడుతుందని, ఈ సమ్మిట్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ మీడియా సమావేశంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కళ్యాణ్ నాయక్, ఎస్టీ మోర్చా అధ్యక్షులు రవి నాయక్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు సోలంకి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు