కొండగట్టులో చందనోత్సవం
60 ఏళ్ళ తర్వాత హనుమాన్‌కి మహోత్సవం
15 నుంచి 20 వరకు మహా సంప్రోక్షణ
మూల విరాట్టు పై గంధం తొలగింపు
40 రోజుల పాటు స్వామి వారి నిజరూప దర్శనం
జగిత్యాల / మల్యాల, నవంబర్ 11 (విజయక్రాంతి) : ఉత్తర తెలంగాణ కొంగు బంగారమైన ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న సన్నిధిలో ఒక అరుదైన, ఆధ్యాత్మిక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. సుమారు 60 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ స్వామివారి మూలవిరాట్‌కు మహా వైభవంగా ‘చందనోత్సవం’ నిర్వహించేందుకు ఆలయ యంత్రాంగం రంగం సిద్ధం చేసింది. నవంబరు 15 నుంచి 20 వరకు ఐదు రోజుల పాటు నిర్వహించే ఈ మహా క్రతువుకు రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులను సాదరంగా ఆహ్వానించనున్నారు.
అలిశెట్టి కుంచెతో వెలుగులోకి వచ్చిన నిజరూపం!
ఆలయంలో పూర్వం నుంచి స్వామివారి మూలవిరాట్‌కు అర్చకులు ప్రతి శనివారం భక్తిశ్రద్ధలతో(devotional) చందన లేపనం చేసేవారు. కాలక్రమేణా ఆ గంధం పొరలు దాదాపు రెండడుగుల మేర దట్టంగా పేరుకుపోయాయి. ఎలుకల బొరియల కారణంగా ఆ లేపనం దెబ్బతినడంతో, సరిగ్గా 60 ఏళ్ల క్రితం అర్చకులు, ధర్మపురి వైదిక పండితులు తొలిసారి చందనాన్ని శాస్త్రోక్తంగా తొలగించారు. అప్పటివరకు భక్తులకు స్వామివారి అసలు రూపురేఖలు ఎలా ఉంటాయో తెలిసేది కాదు.
ఆ సమయంలో గంధం తొలగించగా సాక్షాత్కరించిన స్వామివారి నిజరూపాన్ని ప్రముఖ చిత్రకారుడు అలిశెట్టి మహరాజ్ తన అద్భుత కుంచెతో కాన్వాస్పు చిత్రించారు. అదే రూపం నేడు కోట్లాది మంది భక్తుల ఇళ్లలో పూజలందుకుంటూ విశేష ప్రాచుర్యం పొందింది. మరమ్మతులు.. సుదర్శన చక్రాలు, కలశాల ప్రతిష్ఠఆరు దశాబ్దాల తర్వాత తిరిగి మూలమూర్తిపై చందనం తొలగించడంతో పాటు, ఆలయ జీర్ణోద్ధరణ పనులను సమాంతరంగా చేపట్టనున్నారు.ప్రధాన గోపురంపై పవిత్ర కళశాల స్థాపన, దెబ్బతిన్న సుదర్శన చక్రాల మార్పిడి, శిథిలావస్థకు చేరిన దేవతామూర్తుల విగ్రహాలకు శిల్పులతో మరమ్మతులు చేయించేందుకు దేవాదాయశాఖ రూ.20 లక్షల నిధులతో విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.
దర్శనాలపై ఆంక్షలు.. భక్తులకు కొయ్య విగ్రహ దర్శనం
ఈ ఐదు రోజుల మహోత్సవంలో మూలవిర్పా చందనం తొలగించే సున్నితమైన ప్రక్రియ కొనసాగుతున్నందున, గర్భాలయ దర్శనాలతో పాటు అన్ని రకాల ఆర్జిత సేవలను తాత్కాలికంగా నిలిపివేయనున్నారు. వాహన పూజలకు మాత్రమే అనుమతి ఉంటుంది. అయితే, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని, ఆలయ మండపంలో చెక్కతో ప్రత్యేకంగా రూపొందించిన స్వామివారి ఉత్సవమూర్తిని ప్రతిష్ఠించి నిరంతర దర్శన సౌకర్యం కల్పిస్తామని అధికారులు స్పష్టం చేశారు.
నిధుల నిర్వహణలో పారదర్శకతే ముఖ్యం
గతంలో బేతాళస్వామి ఆలయ చందనోత్సవంలో దాతల నిధుల వినియోగంపై వివాదాలు, ఆరోపణలు వచ్చిన చేదు అనుభవాలను భక్తులు గుర్తుచేస్తున్నారు. ఈసారి అంజన్న చందనోత్సవంలో ఎటువంటి విమర్శలకు తావులేకుండా, నిధుల లెక్కల్లో సంపూర్ణ పారదర్శకత పాటించి కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని భక్తజనం కోరుతున్నారు.
తరలివస్తున్న భక్తులు
60 ఏళ్లలో ఆంజనేయ స్వామి మూల విరాట్ పైన పేరుకుపోయిన చందనాన్ని తొలగించేందుకు యాగశాల నిత్య హోమం నిర్వహిస్తారు. ప్రత్యేకంగా రూపొందించిన పరికరాలతో చందనాన్ని తొలగిస్తూ స్వామివారి నిజరూప దర్శనం 40 రోజులపాటు కల్పించనున్నారు. నిత్యం సుమారు 50 వేల మంది భక్తులు వస్తారని అంచనా మేరకు ఆలయంలో ఏర్పాట్లు చేస్తున్నారు. చందనోత్సవం ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయనున్న కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు..
కార్తీక మాసం సందర్భంగా సాధారణ రోజుల కంటే ఉత్సవాల సమయంలో భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది. సాధారణ రోజుల్లో సుమారు 10 వేల మంది, మంగళ, శని, ఆదివారాలు, సెలవు దినాల్లో సుమారు 20 వేల మంది, పర్వదినాల్లో 25 వేల నుంచి 30 వేల మంది వరకు భక్తులు వచ్చే అవకాశం ఉంది.
ముఖ్యంగా నవంబర్ 20 నుంచి డిసెంబర్ 29 వరకు నిర్వహించే నిజరూప దర్శనానికి రోజుకు సుమారు 50 వేల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్, పోలీసు బందోబస్తు, ప్రత్యేక బస్సులు, తాగునీటి సరఫరా, వైద్య సేవలు, విద్యుత్ సరఫరా, పారిశుద్ధ్యం తదితర అంశాలపై సంబంధిత శాఖలు ప్రత్యేక దృష్టి సాధించాలని కలెక్టర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఆలయ ప్రాంగణం, క్యూలైన్లు, పార్కింగ్ ప్రాంతాల్లో భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలని, నిరంతరం తాగునీరు అందుబాటులో ఉంచాలని సూచించారు.
పారిశుద్ధ్య నిర్వహణకు తగిన సంఖ్యలో సిబ్బందిని నియమించి, చెత్తను ఎప్పటికప్పుడు తొలగిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.వైద్య సేవలు, విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండకూడదుభక్తుల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ఆలయ పరిసరాల్లో మూడు ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు.
ఆర్టీసీ అధికారులు భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులు నడపడంతో పాటు, వేములవాడ నుంచి జగిత్యాలకు వెళ్లే బస్సుల్లో ఎనిమిది బస్సులను కొండగట్టు మీదుగా నడిపేలా ప్రణాళిక సిద్ధం చేశారు.జిల్లా పౌర సంబంధాల శాఖ చందనోత్సవ మహోత్సవం, నిజరూప దర్శనాల విశిష్టతను ప్రజలకు తెలియజేసేలా విస్తృత ప్రచారం చేపట్టనున్నారు. ఉత్సవాల తేదీలు, దర్శన సమయాలు, రవాణా, పార్కింగ్, భక్తులకు కల్పించనున్న సౌకర్యాల వివరాలను ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయనున్నారు.