పింఛన్ల పంపిణీలో సర్పంచులకు గౌరవం లేదా..?
గ్రామస్థాయిలో కష్టపడేది సర్పంచులు.. ప్రచారంలో మాత్రం ఇతరులా?
మల్దకల్ నవంబర్19: గద్వాల నియోజకవర్గం(Gadwal Constituency) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో గ్రామ సర్పంచులకు తగిన గుర్తింపు, గౌరవం కల్పించాలని గద్వాల నియోజకవర్గంలోని పలువురు సర్పంచులు ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు.
ప్రజల ఓట్లతో ఎన్నికైన ఎమ్మెల్యేకు ఎంతటి గౌరవం, బాధ్యతలు ఉంటాయో.. ప్రజలచే ఎన్నుకోబడిన గ్రామ సర్పంచులకు కూడా అంతే గౌరవం, బాధ్యతలు ఉంటాయని వారు పేర్కొన్నారు. గ్రామస్థాయిలో ప్రజలతో నిత్యం మమేకమవుతూ, అర్హులైన లబ్ధిదారులను గుర్తించడం, పింఛన్ల దరఖాస్తులు నింపించడం, అవసరమైన ధ్రువపత్రాల సేకరణలో స్థానిక సర్పంచులు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు.
అయితే క్షేత్రస్థాయిలో కష్టపడేది సర్పంచులైతే, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో మాత్రం కొందరు ఇతరులే ప్రధానంగా ప్రచారం చేసుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. గ్రామాల్లో ఎవరు కష్టపడ్డారు? లబ్ధిదారులకు ఎవరు అండగా నిలిచారు? అనే విషయాలు ప్రజలకు బాగా తెలుసని అన్నారు. పదవుల మధ్య తేడాలు ఉండవచ్చేమో కానీ, ప్రజాప్రతినిధుల గౌరవం విషయంలో వివక్ష ఉండకూడదని స్పష్టం చేశారు.
గ్రామాల్లో నిర్వహించే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో స్థానిక సర్పంచులను భాగస్వాములుగా గుర్తించి, వారికి తగిన ప్రాధాన్యత కల్పించాలని కోరారు. తమ విజ్ఞప్తి ఎవరి గొప్పతనాన్ని తగ్గించడానికి కాదని, గ్రామస్థాయిలో కష్టపడుతున్న ప్రజాప్రతినిధులకు తగిన గుర్తింపు లభించాలన్నదే తమ ఉద్దేశమని తెలిపారు. సర్పంచ్ పదవి అలంకారప్రాయం కాదు.. అది గ్రామ ప్రజలు అప్పగించిన బాధ్యత, నమ్మకం, గౌరవం. కాబట్టి చేయూత పింఛన్ల పంపిణీతో పాటు అన్ని ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో సర్పంచులకు సముచిత స్థానం కల్పించాలని గద్వాల నియోజకవర్గ సర్పంచులు ఎమ్మెల్యేను కోరారు.