జుక్కల్ రేంజ్ పరిధిలో చిరుత పాదముద్రలు
జుక్కల్, నవంబర్ 15 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్(Jukkal) మండలంలోని జుక్కల్ బీట్ పరిధిలోని సిద్ధాపూర్, గుండూర్ రెవెన్యూ భూముల్లో చిరుత పాదముద్రలు(Leopard Footprints) గుర్తించినట్లు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రాములు తెలిపారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చిరుతను వల ఉపయోగించి పట్టుకోవడం, విద్యుత్ షాక్కు గురిచేయడం చేయరాదు.
అలాగే చిరుతకు ఎలాంటి విషపదార్థాలు ఇవ్వడం పూర్తిగా నిషేధం. చిరుతకు సంబంధించిన భయాందోళనలు కలిగించే విధంగా గూగుల్ లేదా ఏఐ ద్వారా రూపొందించిన నకిలీ ఫొటోలను సోషల్ మీడియాలో ప్రచారం చేయరాదు. ఇలాంటి తప్పుడు ప్రచారాల ద్వారా ప్రజల్లో భయం లేదా ఆందోళన కలిగించకూడదు. పై నిబంధనలను ఉల్లంఘించినట్లయితే అటవీ శాఖ చట్టాల ప్రకారం సంబంధిత వ్యక్తులపై శిక్షార్హమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.