వృద్ధులు, దివ్యాంగులకు ఉచిత సహాయ ఉపకరణాల పంపిణీ
- అలింకో ఆధ్వర్యంలో 7 మండలాలు, హుస్నాబాద్ మున్సిపాలిటీలో ప్రత్యేక శిబిరాలు
- అర్హులైన ప్రతి ఒక్కరికీ సహాయ ఉపకరణాలు అందించడమే లక్ష్యం: మంత్రి పొన్నం ప్రభాకర్
కరీంనగర్, నవంబరు 16 (విజయక్రాంతి): హుస్నాబాద్ నియోజకవర్గంలోని దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉచితంగా సహాయ ఉపకరణాలు అందించేందుకు ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) తెలిపారు.
ఈనెల 16 నుంచి 27 వరకు నియోజకవర్గంలోని 7 మండలాలు, ఒక మున్సిపాలిటీ ఈ శిబిరాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఒక మనిషి నడవడానికి మరొకరి సాయం కోసం ఎదురుచూడకూడదని, వినడానికి, చూడడానికి, తన పనులు తాను చేసుకోవడానికి ఎవరిపైనా ఆధారపడకుండా ప్రతి దివ్యాంగుడు ఆత్మవిశ్వాసంతో, ఆత్మగౌరవంతో జీవించాలన్నదే తమ ఆశయమని మంత్రి పేర్కొన్నారు.
హుస్నాబాద్ నియోజకవర్గంలో ఏ ఒక్క దివ్యాంగుడు, వృద్ధుడు కూడా సహాయం అందక ఇబ్బంది పడకూడదని, ఏ ఒక్క అర్హుడికీ ప్రభుత్వ సహాయం అందకుండా పోకూడదనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఆలింకో ఆధ్వర్యంలో మోటరైజ్డ్ ట్రైసైకిళ్లు, వీల్చైర్లు, వినికిడి యంత్రాలు, కృత్రిమ అవయవాలు, వాకింగ్ స్టిక్స్, కళ్లద్దాలు, నడక సహాయక పరికరాలు, ఎలక్ట్రిక్ ట్రై సైకిళ్ళు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ శిబిరాలను ఉపయోగించుకోవాలని మంత్రి సూచించారు.