అర్హత లేని అధ్యాపకులు..?
- నెట్, సెట్ ఉండదు..
- పీహెచ్డీ జాడే లేదు!
- శాతవాహన యూనివర్సిటీలో వింత పోకడలు
- బోధనా ప్రమాణాలపై విద్యార్థుల్లో ఆందోళన
కరీంనగర్ క్రైం, నవంబర్19 (విజయక్రాంతి): ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా వున్న కరీంనగర్ జిల్లాలో ఏర్పాటు చేసిన శాతవాహన విశ్వ విద్యాలయం(Satavahana University) వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. అది నుంచి ఆరోపణలు , నిధుల దుర్వినియోగం,నియామకాల్లో అర్హత లేని అధ్యాపకులు ,అభివృద్ధి పేరిట అటవీ వనరుల విధ్వంసం లాంటి విషయాలతో నిత్యం పతాక శీర్షికల్లో వుండటం సాధారణంగా మారింది. అటవీ ఆనుమతులు లేకుండా వృక్ష సంపద నాశనం చేసిన సంగతి మరిచిపోకముందే పాత విచారణను ముందుకు తెచ్చారు.
తాజాగా అధ్యాపకుల అనర్హత లు తెర మీదికి వచ్చాయి.కొత్తగా వచ్చిన కళాశాలలు,సిబ్బంది నియామకం విషయంలో ఆరోపణలు రావడం మరోసారి చర్చకు తెరలేపింది. విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాల్సిన విశ్వవిద్యాలయంలోనే బోధనా ప్రమాణాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీలో కొంతమంది అధ్యాపకుల విద్యార్హతలపై తీవ్ర ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.
కనీస బోధనా అర్హతలైన నెట్ (నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్), సెట్ (స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్) లేకపోవడం, పీహెచ్డీ పట్టాలు కూడా లేని వారు విద్యాబోధన చేస్తున్నారనే ప్రచారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఉన్నత విద్యను అభ్యసించేందుకు యూనివర్సిటీకి వచ్చే విద్యార్థులకు నాణ్యమైన బోధన అందడం అవసరం. అయితే బోధించే అధ్యాపకుల అర్హతలపైనే ప్రశ్నలు తలెత్తడం ఆందోళన కలిగిస్తోంది.
అధ్యాపకుల నియామకాలు ఏ నిబంధనల ప్రకారం జరిగాయి? వారి విద్యార్హతలను ఎవరు పరిశీలించారు? యూజీసీ మార్గదర్శకాలను అనుసరించారా? అర్హతలు లేని వారికి బోధనా బాధ్యతలు ఎలా అప్పగించారు? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. యూనివర్సిటీకి కీలకంగా ఉండే పరీక్షల విభాగం,మినిస్టీరియల్ సిబ్బంది నియామకాల్లో కూడా అర్హత లేని వారికి అవకాశం ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు అధ్యాపకుల నియామకాలు, వారి అర్హతలకు సంబంధించిన వివరాలను బహిరంగంగా వెల్లడించాల్సిన బాధ్యత యూనివర్సిటీ అధికారులపై ఉందనీ, కేవలం తరగతులు నిర్వహించడం, పరీక్షలు పెట్టడంతోనే విశ్వవిద్యాలయం బాధ్యత పూర్తికాదని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.
ఈ నేపథ్యంలో సంబంధిత అధ్యాపకుల విద్యార్హతలు, నియామక ప్రక్రియపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతున్నారు. ఆరోపణల్లో వాస్తవమెంత? నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు జరిగాయా? లేక నిబంధనల ప్రకారమే బోధనా బాధ్యతలు అప్పగించారా? అనే అంశాలపై యూనివర్సిటీ అధికారులు స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.