పత్తిని దున్నేస్తున్నారు.!

12-11-2026 | 05:15am

మక్కజొన్న సాగుకు రైతుల శ్రీకారం

ఎల్నినో ప్రభావంతో దిగుబడిపై దెబ్బ.. ఆశించిన ఆదాయం రాక ముందస్తుగానే పంట తొలగింపు

యాసంగిలో ఆరుతడి పంటల వైపు రైతుల మొగ్గు

ఈసారి పెరగనున్న మొక్కజొన్న సాగు విస్తీర్ణం

మహబూబాబాద్, నవంబర్ 11 (విజయక్రాంతి): ఆరుగాలం శ్రమించి పంటను కంటికి రెప్పలా కాపాడుకున్న రైతన్నకు(Farmer) ఈసారి పత్తి సాగు(Cotton Cultivation) చేదు అనుభవాన్నే మిగిల్చింది. పంట కాలం(Crop Season) పూర్తికాకముందే తెల్లబంగారాన్ని పొలంలోనే దున్నేస్తున్న పరిస్థితులు జిల్లావ్యాప్తంగా కనిపిస్తున్నాయి. సాధారణంగా పత్తి పంట రెండు నుంచి మూడు, నాలుగు విడతల్లో దిగుబడి పొందాల్సి ఉండగా.. ఈసారి పరిస్థితులు తారుమారయ్యాయి. ఎల్నినో ప్రభావంతో(El Niño effect) వాతావరణ పరిస్థితులు అనుకూలించక దిగుబడి గణనీయంగా తగ్గడంతో చాలా మంది రైతులు ఒక్క విడతలోనే చేతికందిన కొద్దిపాటి పత్తితో సరిపెట్టుకుంటున్నారు.

మిగిలిన పంట నుంచి ఆశించిన దిగుబడి వచ్చే అవకాశం లేదని భావించి పత్తి మొక్కలను తొలగిస్తూ పొలాలను తదుపరి పంట సాగుకు సిద్ధం చేస్తున్నారు.పత్తి పంటను తొలగించిన అనంతరం రైతులు దుక్కులు దున్నుతూ మక్కజొన్న సాగుకు శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటికే పలుచోట్ల పత్తి చేన్లు ఖాళీ చేసి భూములను చదును చేసే మక్కజొన్న పంట సాగు పనులు వేగం పుంజుకున్నాయి. పెట్టుబడులు పెరిగి, దిగుబడులు తగ్గి, ఆశించిన గిట్టుబాటు లభించని పరిస్థితుల్లో రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారిస్తున్నారు.

మారుతున్న సాగు సరళి..

గతంలో పత్తి పంటను చివరి విడత వరకు కొనసాగిస్తూ దిగుబడి పొందేందుకు రైతులు ప్రయత్నించేవారు. కానీ ఈసారి పంట ఎదుగుదల, కాయల అభివృద్ధి, దిగుబడిపై ప్రతికూల వాతావరణ పరిస్థితుల ప్రభావం పడినట్లు రైతులు చెబుతున్నారు. ఒక్క విడతలోనే దూది పూలు చేతికందడంతో తదుపరి విడతలపై ఆశలు వదులుకుంటున్నారు. పంటను కొనసాగించడం కంటే తొలగించి మరో పంట సాగు చేయడమే మేలని భావిస్తున్నారు. దీంతో జిల్లాలో సాగు సరళి క్రమంగా మారుతోంది.

వరి వైపు వద్దు.. మక్కజొన్న ముద్దు!

యాసంగిలో వరి సాగు విస్తీర్ణాన్ని తగ్గించి, నీటి వినియోగం తక్కువగా ఉండే ఆరుతడి పంటలను సాగు చేయాలని ప్రభుత్వం సూచిస్తుండటంతో రైతులు ప్రత్యామ్నాయ పంటలపై సమాలోచనలు చేస్తున్నారు. ముఖ్యంగా మక్కజొన్న సాగుపై ఆసక్తి చూపుతున్నారు. పత్తి తొలగించిన భూముల్లోనే మొక్కజొన్న విత్తనాలు వేసేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో గత యాసంగితో పోలిస్తే ఈసారి జిల్లాలో మక్కజొన్న సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మార్పు వెనుక రైతు ఆవేదన..

ఒకవైపు పత్తి సాగుకు చేసిన పెట్టుబడులు, మరోవైపు ఆశించిన స్థాయిలో దిగుబడి రాకపోవడం రైతులను ఆర్థికంగా కుంగదీస్తున్నాయి. పంటను చివరి వరకు కాపాడినా ప్రయోజనం ఉండదనే నిరాశతో ముందుగానే దున్నేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇది కేవలం పంట మార్పిడి మా త్రమే కాదు.. ప్రకృతి ప్రతికూలతలు, సాగు వ్యయాలు, ఆదాయ అనిశ్చితి మధ్య రైతులు తీసుకుంటున్న అనివార్య నిర్ణయానికి నిదర్శనం.

అయితే మొక్కజొన్న సాగు విస్తీర్ణం పెరిగే అవకాశాల నేపథ్యంలో విత్తనాల లభ్యత, నాణ్యత, సాగు సలహాలు, కొనుగోలు ఏర్పాట్లపై వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలు ముందస్తు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. పంట సాగు చేయించడమే కాకుండా.. పండించిన పంటకు గిట్టుబాటు ధర, సకాలంలో కొనుగోలు భరోసా కల్పించినప్పుడే రైతుకు నిజమైన ప్రయోజనం చేకూరుతుంది. లేదంటే పత్తి నష్టాల నుంచి బయటపడేందుకు మక్కజొన్న వైపు మళ్లిన రైతుకు మరో పంటలోనూ నిరాశే ఎదురయ్యే ప్రమాదం ఉంది.

మరిన్ని వార్తలు