వసతి గృహాల్లో మెరుగైన వసతులు కల్పించాలి

20-11-2026 | 12:17am

బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్

నస్పూర్,(విజయక్రాంతి): ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, మెరుగైన వసతులు కల్పించాలని మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ పీ. చంద్రయ్యకి గురు వారం బహుజన్ సమాజ్ పార్టీ (BSP) నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీఎస్పీ పెద్దపల్లి పార్లమెంటు ఇంచార్జ్ కాదాసి రవీందర్, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ… రాష్ట్రంలోని ప్రభుత్వ గురుకులాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ వసతి గృహాలు, మోడల్ స్కూళ్లలో విద్యనభ్యసిస్తున్న పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం, మెరుగైన వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో చదువుకుంటున్న వేలాది మంది విద్యార్థులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా నాణ్యతలేని ఆహారం, అపరిశుభ్రమైన వంటశాలలు, సరైన తాగునీటి సౌకర్యాలు లేకపోవడం, మౌలిక వసతుల కొరత వంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని వసతి గృహాల్లో పురుగులు ఉన్న అన్నం, కుళ్లిన కూరగాయలు, నాణ్యతలేని ఆహార పదార్థాలతో భోజనం తయారు చేసి విద్యార్థులకు అందిస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలకు మంచిర్యాల నుంచి సరఫరా చేస్తున్న హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలోని బ్రేక్‌ఫాస్ట్ నాణ్యత లోపించడంతో విద్యార్థులు తినలేక పడేస్తున్నారని వారు వాపోయారు. దీనిపై జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ స్పందించి, సంబంధిత కేంద్రాలను తనిఖీ చేసి నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతి ప్రభుత్వ గురుకులం, సంక్షేమ వసతి గృహంలో సంబంధిత అధికారులు తరచూ ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, విద్యార్థులకు ప్రభుత్వం నిర్ణయించిన మెనూ ప్రకారం నాణ్యమైన, పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

వంటశాలలు, భోజనశాలలు, ఆహార నిల్వ గదుల్లో పరిశుభ్రత పాటించేలా చూడటంతో పాటు సురక్షితమైన తాగునీరు, శుభ్రమైన వంట పాత్రలు, నాణ్యమైన వంట సరుకులు అందుబాటులో ఉంచాలన్నారు. ఆహార పదార్థాల నాణ్యతను ఫుడ్ సేఫ్టీ అధికారులతో ఎప్పటికప్పుడు తనిఖీ చేయించి, నిబంధనలు ఉల్లంఘించే కాంట్రాక్టర్లు, సంబంధిత వార్డెన్లు, అధికారులపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రతి వసతి గృహంలో విద్యార్థులతో కూడిన ఫుడ్ కమిటీలను ఏర్పాటు చేసి, వారికి అందిస్తున్న ఆహార నాణ్యతపై వారి అభిప్రాయాలను, ఫిర్యాదులను స్వీకరించే విధానం అమలు చేయాలని సూచించారు.

విద్యార్థులు అనారోగ్యానికి గురైనప్పుడు వెంటనే మెరుగైన వైద్య చికిత్స అందించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, వసతి గృహాల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని వసతి గృహాల పరిధిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు ఆహార భద్రత, పరిశుభ్రత, వసతులపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు.

మోడల్ స్కూళ్లలో చదువుకుంటున్న విద్యార్థులు పాఠశాలలకు వెళ్లేందుకు, తిరిగి తమ ఇళ్లకు చేరుకునేందుకు సరైన రవాణా సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారని, విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా ఆర్టీసీ బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ (BSP) జిల్లా ఈసీ మెంబర్ MD మాతిన్ ఖాన్, చెన్నూర్ నియోజకవర్గ అధ్యక్షులు గాజుల శంకర్, బెల్లంపల్లి నియోజకవర్గం అధ్యక్షులు దాగం శ్రీనివాస్, మందమర్రి మండల అధ్యక్షులు MD రహీం బాబా నాయకులు చింతల సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు