కిడ్నాపర్ చెర నుంచి రెండున్నరేళ్ల పాపకు విముక్తి
పటాన్ చెరు: అమీన్‌పూర్‌లో రెండున్నరేళ్ల చిన్నారి అపహరణ కలకలం రేపింది. తల్లి పనికి వెళ్లిన సమయంలో ఇంటి నుంచి అపహరణకు గురైన అక్షితను సైబరాబాద్ పోలీసులు కేవలం 12 గంటల్లోనే క్షేమంగా రక్షించి, నిందితురాలు గంగామణి (44)ని అరెస్ట్ చేశారు. ఈ నెల 18న మధ్యాహ్నం 12.30 గంటలకు చిన్నారి తల్లి ఎరుకల సరిత సమీపంలోని టిఫిన్ సెంటర్‌కు పనికి వెళ్లగా, అదే సమయంలో చిన్నారి అదృశ్యమైంది. తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన అమీన్‌పూర్ పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి 25 మంది సిబ్బందితో గాలింపు చేపట్టారు.
సీసీ కెమెరాలు, ఇతర ఆధారాలను పరిశీలించగా ఓ మహిళ చిన్నారిని అపహరించినట్లు గుర్తించారు. మెదక్‌కు చెందిన గంగామణిగా నిందితురాలిని గుర్తించి, మెదక్ టౌన్ పోలీసుల సహకారంతో నర్సఖేడ్ గ్రామంలో అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిని సురక్షితంగా రక్షించి అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఈ కేసును వేగంగా ఛేదించిన అమీన్‌పూర్, చందానగర్, పటాన్‌చెరు పోలీసులతో పాటు ఎస్‌ఓటీ బృందాలను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్ అభినందించారు.