రైస్‌మిల్ పొట్టు దుమ్ముతో ప్రజలకు ఇబ్బందులు
కాలుష్యాన్ని నియంత్రించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని కాలనీవాసుల డిమాండ్
శివంపేట,(విజయక్రాంతి): శివంపేట మండల కేంద్రంలోని గోదాం ప్రాంతంలో ఉన్న రైస్‌మిల్ నుంచి వెలువడుతున్న పొట్టు, దుమ్ము కారణంగా పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైస్‌మిల్ ఎప్పటినుంచో కొనసాగుతున్నప్పటికీ, మిల్లులో నుంచి వెలువడే పొట్టు దుమ్ము గాలిలో వ్యాపించి ఇళ్లలోకి చేరుతుండటంతో స్థానిక ప్రజలు అవస్థలు పడుతున్నారు.
ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు దుమ్ము కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిల్లులో నుంచి వెలువడే పొట్టును, దుమ్మును నియంత్రించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ సమస్యపై సంబంధిత అధికారులకు పలుమార్లు విన్నవించినప్పటికీ సమస్య పరిష్కారం కావడం లేదని వాపోతున్నారు.
కాంగ్రెస్ సీనియర్ నాయకులు కోడకంచి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో కాలనీవాసులు స్పందిస్తూ, రైస్‌మిల్ నిర్వహణకు తాము వ్యతిరేకం కాదని, అయితే మిల్లు నుంచి వెలువడే పొట్టు, దుమ్ముతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా యాజమాన్యం తగిన కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.