రసం పుట్టేది ప్రేక్షకుడి హృదయంలోనే!
నటన అంటే కేవలం భావాలను ప్రదర్శించడం మాత్రమే కాదు.. ఆ భావాలను ప్రేక్షకుడి హృదయానికి చేరవేయడం కూడా! ఈ విషయాన్ని మరోసారి గుర్తుచేస్తూ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టింది కథానాయిక సంయుక్త మీనన్(Samyuktha Menon). ప్రముఖ కూదియాట్టం గురువు గురు వేణు జీ వద్ద నవరస సాధనలో పాల్గొన్న ఆమె.. కేరళలోని నటనకైరళిలో తనకు ఎదురైన అనుభవాలను అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా సంయుక్త మీనన్ స్పందిస్తూ.. “గురు వేణు జీ ఆధ్వర్యంలో నిర్వహించిన నవరస సాధనకు సంబంధించిన కొన్ని క్షణాలివి.
నటనకైరళిలో ఈ సాధనలో పాల్గొనడం ఎంతో ప్రత్యేకమైన అనుభవం. భారతీయ సంప్రదాయ ప్రదర్శన కళల్లో భావవ్యక్తీకరణకు ఉన్న ప్రాధాన్యతను, నవరసాల లోతును మరింతగా అర్థం చేసుకునే అవకాశం నాకు లభించింది. అభినవగుప్తుడు చెప్పినట్లుగా.. రసం అనేది నటుడిలోనో, పాత్రలోనో ఉండదు. అది సహృదయుడైన ప్రేక్షకుడి హృదయంలో వికసిస్తుంది. అంటే కళాకారుడు ప్రదర్శించే భావం కంటే, దాన్ని ఆస్వాదించే ప్రేక్షకుడి మనసులో కలిగే అనుభూతే అసలైన రసం. ఆ అనుభూతి ప్రేక్షకుడిలో కలిగినప్పుడు మనలో ఏదో ఒక అద్భుతమైన స్పందన పుడుతుంది.
ఆ క్షణంలో కలిగే ఆశ్చర్యం, ఆనందం, అనుభూతినే ‘చమత్కారం’ అంటారు. అది ఒక రకంగా మనలోని సంపూర్ణతను మనమే ఆస్వాదించుకునే అనుభూతి. కళకు, కళాకారుడికి, ప్రేక్షకుడికి మధ్య ఉండే అనుబంధం ఎంత లోతైనదో ఈ సాధన నాకు మరోసారి తెలియజేసింది” అంటూ తన అనుభవాన్ని పంచుకుంది సంయుక్త. సినిమాల్లో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న సంయుక్త మీనన్.. నటనలోని అంతర్లీనమైన భావాలను అర్థం చేసుకునేందుకు చేస్తున్న ఈ ప్రయత్నం ఆసక్తిని కలిగిస్తోంది.
కేవలం తెరపై కనిపించడం మాత్రమే కాకుండా, నటనలోని శాస్త్రీయతను తెలుసుకుంటూ తన కళకు మరింత పదును పెట్టాలనే ఆమె ఆలోచన ఈ పోస్టులో స్పష్టంగా కనిపిస్తోంది. ఇక సంయుక్త సినిమాల విషయానికి వస్తే.. నిఖిల్ సిద్ధార్థ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘స్వయంభు’లో భూమి పాత్రలో కనిపించనుంది. ఈ పాత్ర కోసం గుర్రపు స్వారీ, విలువిద్య వంటి అంశాల్లోనూ ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంది సంయుక్త. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో రూపొందిన ‘హైందవ’లోనూ ఆమె కథానాయికగా నటించింది.
ఈ చిత్రం నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, టబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్’లోనూ సంయుక్త భాగమైంది. ఈ సినిమా డిసెంబర్ 4న విడుదలకు సిద్ధమవుతోంది. రామ్ పోతినేని హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ‘రాపో 23’లోనూ సంయుక్త కథానాయికగా కనిపించనుంది. యోగి కేఎంసీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహిళా ప్రాధాన్య చిత్రమైన ‘ది బ్లాక్ గోల్డ్’లో పవర్ఫుల్ పోలీస్ అధికారిణిగా కనిపించనుంది. వీటితో పాటు ‘మహారాగ్ని’, ‘బెంజ్’, మలయాళ చిత్రం ‘రామ్’, ‘గువ్వల చెరువు ఘాట్’ వంటి ప్రాజెక్టులు కూడా సంయుక్త ఖాతాలో ఉన్నాయి.