మంగపేట పుష్కరఘాట్‌ను పరిశీలించిన ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో
మంగపేట పుష్కర ఘాట్ అభివృద్ధి పనులు నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత గడువులో పూర్తి చేయాలి
గోదావరి పుష్కర ఘాట్‌ను సందర్శించి ప్రతిపాదిత అభివృద్ధి, భద్రతా ఏర్పాట్ల పరిశీలన
ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో
కన్నాయిగూడెం,(విజయక్రాంతి): మంగపేట గోదావరి పుష్కర ఘాట్ వద్ద చేపట్టనున్న అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్దేశిత ప్రభుత్వ షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలని ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం మంగపేట పుష్కర ఘాట్‌ను సందర్శించిన ఆయన, అక్కడ చేపట్టాల్సిన పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా పుష్కర ఘాట్ వద్ద పాత ట్యాపులు, పంపులు, 25 హెచ్‌పీ మోటార్లు, విద్యుత్ పరికరాలు, పైప్లైన్ల తొలగింపు, అవసరమైన కొత్త ఏర్పాట్లు, ఇన్ఫిల్ట్రేషన్ బావుల నిర్మాణం, ఇసుక తొలగింపు, బోట్లకు ఆన్లైన్ క్లోరినేషన్, ఘాట్ పరిసరాల్లో క్లోరినేషన్ వంటి పనుల వివరాలను పరిశీలించారు. అలాగే మహిళల కోసం తాత్కాలిక దుస్తులు మార్చుకునే గదుల ఏర్పాటు, నది ఎగువ, దిగువ ప్రాంతాల్లో చెక్క బారికేడ్లు, ఐరన్ మెష్ బారికేడ్ల ఏర్పాటు, గోదావరి నదిపై క్రాస్ బండ్ నిర్మాణం వంటి పనులను పరిశీలించి, వాటి అమలు ప్రణాళికపై సంబంధిత అధికారులతో చర్చించారు.
పుష్కర ఘాట్‌కు వచ్చే భక్తులు, సందర్శకుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని పీఓ సూచించారు. తాగునీరు, పరిశుభ్రత, క్లోరినేషన్, బారికేడ్లు, మహిళలకు అవసరమైన సౌకర్యాల ఏర్పాట్లలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు. ప్రతి పనిలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, ప్రభుత్వ షెడ్యూల్ ప్రకారం నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని, పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు ఆదేశించారు. పుష్కర ఘాట్ అభివృద్ధి పనులు ప్రజలకు, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని పీఓ లెనిన్ వత్సల్ టోప్పో సూచించారు.