ఇక గాలి పీల్చడమూ కష్టమేనా?
న్యూఢిల్లీ: దేశంలోని పలు నగరాలను వాయు కాలుష్యం(Air Pollution) ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రాజస్థాన్‌లోని బికనీర్‌లో గాలి నాణ్యత సూచీ (AQI) 366కు చేరి అత్యంత పేలవమైన స్థాయికి పడిపోయింది. హర్యానాలోని హిసార్ 338, బల్లభ్‌గఢ్ 337 ఏక్యూఐతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) సోమవారం సాయంత్రం 4 గంటలకు విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. దేశవ్యాప్తంగా 274 నగరాల గాలి నాణ్యతను పరిశీలించారు. వీటిలో 84 నగరాల్లో మాత్రమే గాలి నాణ్యత మంచి లేదా సంతృప్తికరమైన స్థాయిలో నమోదైంది. మరోవైపు నాలుగు నగరాల్లో గాలి నాణ్యత 'వెరీ పూర్'(Very Poor Air Quality) కేటగిరీలోకి చేరింది.
దేశ రాజధాని ఢిల్లీలో ఏక్యూఐ 275గా నమోదైంది. దీంతో నగరం 'పూర్' కేటగిరీలో కొనసాగుతోంది. గాలి నాణ్యత క్షీణించడం ప్రజారోగ్యంపై ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా కాలుష్య ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. పలు నగరాల్లో గాలి నాణ్యత ఆందోళనకరంగా మారుతున్న నేపథ్యంలో కాలుష్య నియంత్రణ చర్యలపై దృష్టి సారించాల్సిన అవసరం కనిపిస్తోంది.