పింఛన్ పత్రాల పంపిణీ వేళ మహిళల ఆవేదన

16-11-2026 | 06:33pm

భిక్కనూర్, నవంబర్ 16 (విజయ క్రాంతి): భిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి గ్రామంలో(Peddamallareddy Village) నిర్వహించిన పీఏసీఎస్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పింఛన్ల అంశంపై కొద్దిసేపు గందరగోళం నెలకొంది. ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ నూతనంగా పింఛన్లు మంజూరైన లబ్ధిదారులకు పత్రాలు పంపిణీ చేస్తున్న సమయంలో పలువురు మహిళలు తమకు పింఛన్లు రావడం లేదని, అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదే గ్రామానికి చెందిన జంగం నరసింహులు భార్య శ్యామల మాట్లాడుతూ.. తన భర్త ఐదేళ్ల క్రితం ఉపాధి హామీ పనులు చేస్తున్న సమయంలో ఆకస్మాత్తుగా గుండెపోటుతో మరణించాడని తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటివరకు తనకు పింఛన్ మంజూరు కాలేదని, ఈ సమస్యపై పలుమార్లు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా పరిష్కారం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ విషయంపై వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించగా, సమయం కేటాయించకపోవడంతో ఆగ్రహించిన ఆమె కుమారుడు సభలోనే దరఖాస్తును చింపివేశాడు. దీనిపై కుమారుడిని స్థానికులు ప్రశ్నించగా, ఐదేళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కారం కాకపోవడంతో విసిగిపోయామని, సభకు వచ్చినా తమ సమస్యను చెప్పుకునేందుకు అవకాశం దొరకడం లేదని శ్యామల పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారుల వివరణ తెలియాల్సి ఉంది.

గ్రామంలో పింఛన్లకు సంబంధించి ఇంకా అనేక సమస్యలు ఉన్నాయని స్థానికులు పేర్కొన్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి గ్రామంలో పింఛన్లపై ప్రత్యేక విచారణ చేపట్టి, అర్హులైన వారందరికీ పింఛన్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు