తల్లి దండ్రులను పోషించని కారుణ్య ఉద్యోగి
జగిత్యాల నవంబర్ 16 (విజయక్రాంతి): జగిత్యాల పట్టణానికి చెందిన సయ్యద్ సమి అనే వృద్ధ తండ్రి అనారోగ్య కారణాలతో తాను పని చేస్తున్న ఆఫీస్ సభార్దినేట్ ఉద్యోగం నుంచి తప్పుకొని తన పెద్ద కొడుకు సయ్యద్ సోహెల్ కు అనారోగ్య కారుణ్య నియమాక పథకం కింద 7 ఏళ్ల కింద ఉద్యోగం ఇప్పించగా అప్పటి నుంచి తల్లి దండ్రులకు వైద్య, పోషణ ఖర్చులు ఇవ్వక పోవడంతో పలు ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నామని మాకు ప్రభుత్వ ఉద్యోగుల తల్లి దండ్రుల పోషణ చట్టం కింద, కారుణ్య నియమక రూల్స్ మేరకు ప్రతినెలా రూ. 10 వేలు తన పెద్ద కొడుకు నుంచి ఇప్పించాలని సీనియర్ సిటిజెన్స్ జిల్లా అధ్యక్షులు, న్యాయ వాది హరి అశోక్ కుమార్ ను ఆశ్రయించి, ఆయన సాయంతో సోమవారం కలెక్టరేట్ ప్రజావాణిలో కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.
అనంతరం జిల్లా సీనియర్ సిటిజెన్స్ కార్యాలయం(District Senior Citizens Office)లో ఆ తండ్రి సయ్యద్ సమి విలేకరులకు తన గోడు వినిపించారు. జగిత్యాల మున్సిపాలిటీలో ఆఫీస్ సభార్దినేట్ గా పని చేస్తున్న తాను అనారోగ్యంతో ఉద్యోగం నుంచి తొలగి తన పెద్ద కొడుకు సయ్యద్ సోహెల్ కు 7 ఏళ్ల కిందట ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించగా జగిత్యాల మున్సిపాలిటీలో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం చేస్తున్నాడని 7 ఏళ్ల నుంచి నుంచి ఇప్పటి వరకు తల్లిదండ్రులమైన మాకు వైద్య పోషణ ఖర్చులు ఇవ్వక పోవడముతో పలు ఆర్ధిక, శారీరక ఇబ్బందులు పడుతున్నందున తమకు ప్రతినెలా ప్రభుత్వ ఉద్యోగుల తల్లి దండ్రుల పోషణ చట్టం - 2026, కారుణ్య నియామకం రూల్స్ మేరకు ప్రతి నెలా రూ. 10 వేలు తన పెద్ద కొడుకు సయ్యద్ సోహెల్ నుంచి ఇప్పించాలని కలెక్టర్ ను ప్రజావాణిలో కోరగా తగు సత్వర చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు.
ఈ సందర్బంగా సీనియర్ సిటిజెన్స్ జిల్లా అధ్యక్షులు, మాజీ టీ ఉద్యోగ జేఏసీ జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ మాట్లాడుతూ అనారోగ్య, మెడికల్ ఇన్ వాలిడేషన్ పథకం రూల్స్ మేరకు తల్లి దండ్రులను పోషించని కొడుకు ఉద్యోగం నుంచి జిల్లా కలెక్టర్ సస్పెండ్ లేదా డిస్మిస్ చేసే వీలుందని, అంతే కాకుండా ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రుల పోషణ చట్టం - 2026 కింద ఆ ఉద్యోగికి ప్రతి నెలా వచ్చే వేతనం నుంచి రూ.10 వేలు నేరుగా కట్ చేసి ఆ తండ్రి బ్యాంకు ఖాతాలో జమ చేయుటకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేస్తారని, గతంలో ఇద్దరు కారుణ్య ఉద్యోగుల పైన జిల్లా ఉన్నతాదిధికారులు తీసుకున్న చర్యలను వివరించారు. వృద్ధ తండ్రి సయ్యద్ సమి వెంట సీనియర్ సిటీజన్స్ జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్, జగిత్యాల డివిజన్ కాన్సిలియేషన్ అధికారి పి. సి. హన్మంత్ రెడ్డి తదితరులు ఉన్నారు.