మళ్లీ భగ్గుమన్న బంగ్లాదేశ్

20-11-2026 | 05:10am
  1. యూనస్ పూర్వీకుల ఇంటికి నిప్పు
  2. గ్రామీణ బ్యాంక్ ఆఫీసులు ధ్వంసం
  3. అవామీ లీగ్ పార్టీ దేశవ్యాప్త బంద్ 
  4. హింసాకాండలో నలుగురి మృతి

ఢాకా, నవంబర్ 19: పొరుగు దేశం బంగ్లాదేశ్(Bangladesh Violence) మళ్లీ భగ్గుమన్నది. డిసెంబర్‌లో స్వదేశానికి తిరిగి వస్తానని మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రకటించడం, ఆమె నేతృత్వంలోని నిషేధిత అవామీ లీగ్ పార్టీ దేశవ్యాప్త లాక్‌డౌన్‌కు పిలుపునివ్వడంతో దేశంలో హింసాకాండ చెలరేగింది. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, తాత్కాలిక ప్రభుత్వ మాజీ అధినేత మహమ్మద్ యూనస్ కుటుంబానికి చెందిన పూర్వీకుల ఇంటికి దుండగులు నిప్పంటించడంతో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి.

గత కొన్ని రోజులుగా 28 జిల్లాల్లో బాంబు పేలుళ్లు, వాహనాల దహనం, రాజకీయ నాయకుల ఇళ్లపై దాడులు, పోలీసులతో ఘర్షణలతో దేశం అట్టుడుకుతోంది. అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి ర్యాలీలు, నిరసనలు, రోడ్ల దిగ్బంధనాలతో అరాచకం సృష్టిస్తున్నారు. ౫ రోజులుగా నిరసన తెలుపుతున్న పార్టీ గురువారం దేశవ్యాప్త బంద్ నిర్వహించింది. పార్టీపై నిషేధాన్ని ఎత్తివేయడం, హసీనాకు విధించిన మరణ శిక్షను రద్దు చేయడం, ఖైదీలను విడుదల చేయడం సహా ఎనిమిది డిమాండ్లను ప్రభుత్వం ముందుంచింది. 

షేక్ హసీనా వస్తాననడంతో హింసాకాండ

షేక్ హసీనాకు అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ మరణ శిక్ష విధించడంతో అవామీలీగ్ పార్టీ తమ బలాన్ని నిరూపించుకునే ప్రయత్నాల్లో భాగంగానే హింసాకాండకు దిగినట్లు తెలుస్తోంది. ఈ హింసాత్మక ఘటనల్లో కనీసం నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నాయకులు కూడా ఉన్నట్లు సమాచారం. చట్టోగ్రామ్‌లో మహమ్మద్ యూనస్ పూర్వీకుల ఇంటికి నిప్పంటించారు. యూనస్ స్థాపించిన గ్రామీణ బ్యాంక్ 37 శాఖల భవనాలకు నిప్పంటించడం, విధ్వం సం సృష్టించడం వంటి ఘటనలు జరిగాయి.

ఇది కొందరి కుట్ర: బంగ్లాదేశ్ ప్రధాని

బంగ్లాదేశ్ నుంచి పారిపోయిన కొందరు వ్యక్తులు విదేశాల నుంచి దేశానికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహ్మాన్ పరోక్షంగా షేక్ హసీనాను ఉద్దేశించి ఆరోపించారు. తమకు ఆశ్రయం కల్పించిన వారిని సంతోష పెట్టేందుకు బంగ్లాదేశ్‌లో హింసాకాండ, హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. వారికి స్పష్టమైన సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. 

మరిన్ని వార్తలు