రంవైపు తుపాను దూకుడు.. ఏపీకి సైక్లోన్ అలర్ట్
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా బలపడుతోంది. ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఈ వాతావరణ వ్యవస్థ ఉత్తర-వాయవ్య దిశగా కదులుతోంది. దీంతో ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ (IMD) ముందస్తు తుపాను హెచ్చరిక జారీ చేసింది. నవంబర్ 15 ఉదయం 8.30 గంటల సమయానికి వాయుగుండం చెన్నైకి తూర్పు-ఆగ్నేయంగా 840 కిలోమీటర్లు, విశాఖపట్నానికి దక్షిణ-ఆగ్నేయంగా 1,010 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గత మూడు గంటల్లో గంటకు 10 కిలోమీటర్ల వేగంతో ఉత్తరం వైపు కదిలినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం నవంబర్ 16న దక్షిణ, మధ్య పశ్చిమ బంగాళాఖాతంలో తుపానుగా (Cyclonic Storm) బలపడే అవకాశం ఉంది. నవంబర్ 17 నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారవచ్చని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాతి రెండు రోజుల్లో మరింత బలపడి వాయవ్య దిశగా ఆంధ్రప్రదేశ్ తీరంవైపు కదిలే అవకాశం ఉంది. వాయుగుండం ప్రభావంతో నవంబర్ 18, 19 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలు, ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు (Heavy Rainfall Alert) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. సముద్రంలో అలజడి, బలమైన గాలులు వీచే పరిస్థితులు ఉండటంతో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
తుపాను గమనం, తీవ్రత, తీరాన్ని దాటే ప్రాంతంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు విడుదల చేసే తాజా బులెటిన్లను (Weather Bulletin) గమనించాలని, అధికారులు సూచించే ముందస్తు జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సూచిస్తున్నారు. బంగాళాఖాతంలో పెరుగుతున్న తుపాను తీవ్రతతో ఏపీ తీరంపై వాతావరణ శాఖ నిఘా పెంచింది. రాబోయే రెండు మూడు రోజులు తీర ప్రాంతాలకు కీలకం కానున్నాయి.