హెచ్-1బీ వీసాలకు ఐబీఎం బ్రేక్

12-11-2026 | 05:05am
  1. గ్రీన్‌కార్డు స్పాన్సర్‌షిప్‌లూ నిలిపివేత
  2. భారత్ సహా విదేశీయులకు కష్టాలు
  3. అమెరికాలో ఉద్యోగం కలలు ఆవిరి!

న్యూయార్క్, నవంబర్ 11: అమెరికాలో(America) ఉద్యోగం చేయాలని కలలు కంటున్న విదేశీ సాంకేతిక నిపుణులకు మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది. ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం ఐంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్(International Business Machines) (ఐబీఎం) తమ ఉద్యోగులకు హెచ్-1బీ వీసా, గ్రీన్‌కార్డ్ స్పాన్సర్‌షిప్‌లను నిలిపివేసింది. దీంతో అమెరికా కన్సల్టింగ్ విభాగంలోని మెజారిటీ విదేశీ ఉద్యోగులు ఇబ్బందుల్లో పడ్డారు. విదేశీ ఉద్యోగుల నియామకాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం నిబంధనలు కఠినతరం చేసిన నేపథ్యంలో ఐబీఎం నిర్ణయం అంతర్జాతీయ ఐటీ రంగంలో చర్చనీయాంశమైంది.

ముఖ్యంగా హెచ్-1బీ వీసాలపై అమెరికాలో పనిచేస్తున్న భారతీయ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, కన్సల్టెంట్లు, ఇతర విదేశీ నిపుణుల్లో ఆందోళన పెరిగింది. వీరంతా ఈ ఏడాది చివరి నాటికి ఇతర దేశాలకు బదిలీ కావాలి లేదా తమ ఉద్యోగానికి రాజీనామా చేసి స్వదేశానికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఐబీఎం కన్సల్టింగ్ విభాగంలో ప్రపంచ వ్యాప్తంగా 1.5 లక్షల మందికి పైగా ఉద్యోగం చేస్తున్నారు. 

ట్రంప్ సర్కారు కఠిన నిర్ణయాల ఎఫెక్ట్..

విదేశీ ఉద్యోగుల నియామకాలపై ట్రంప్ సర్కారు నిబంధనలు కఠినతరం చేశాయి. దీంతో టెక్ కంపెనీలు విదేశీ ఉద్యోగులను కొనసాగించాలంటే కొత్త వీసా దరఖాస్తుకు ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంది. ప్రభుత్వ తనిఖీలు, గ్రీన్‌కార్డు ప్రక్రియలోనూ కఠిన నిబంధనలు కంపెనీలకు అదనపు భారంగా మారనుంది. అయితే.. తమ నిర్ణయానికి ట్రంప్ సర్కారు విధానాలు కారణమని ఐబీఎం కంపెనీ చెప్పలేదు.

మార్కెట్‌లో నైపుణ్యాల లభ్యత పెరగడం, క్లయింట్ల అవసరాల్లో మార్పులు రావడం, వీసా కార్యక్రమాలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడమే తమ నిర్ణయానికి కారణాలని ఐబీఎం ప్రతినిధి తెలిపారు. ఐబీఎం నిర్ణయంతో గ్రీన్‌కార్డ్ కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులకు ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఐబీఎం కంపెనీ 2025లో 2,045.. ఈ ఏడాది 1,611 హెచ్‌న వీసాలకు స్పాన్సర్‌షిప్ ఇచ్చింది. తాజా నిర్ణయంతో వేలాది మంది విదేశీ ఉద్యోగులకు మొండిచేయి చూపనుంది.

మరిన్ని వార్తలు