22-11-2025 08:00:26 PM
హైదరాబాద్: హైదరాబాద్ లోని రవీంద్ర భారతీలో నిర్వహించిన కవి దివంగత అందెశ్రీ స్మారక సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని, ఆయన చిత్రపటానికి నివాళర్పించారు. తెలంగాణ సామాజం చైతన్యవంతమైన సమాజమని, తెలంగాణ ప్రజలు ఎంత అమాయకంగా కనిపిస్తారో.. అంత చైతన్యవంతులు అని సీఎం పేర్కొన్నారు. ఈ గడ్డ మీద ప్రజలు అహంకారాన్ని, ఆధిపత్యాన్ని సహించలేరని, నిరంకుశ పాలనను వ్యతిరేకిస్తూ ఎంతో మంది కళాకారులు తమ పాటలతో చైతన్యం కలిగించారు. మలిదశ ఉద్యమంలో కవులు, కళాకారులు కీలకపాత్ర పోషించారని, ఉద్యమానికి కవులు, కళాకారులు ఇచ్చిన ఊపులోనే తెలంగాణ సాకారమైందని ముఖ్యమంత్రి తెలిపారు.
ఎన్నడూ బడికి వెళ్లని అందెశ్రీ అద్భుతమైన జయజయహే తెలంగాణ పాట రాశారని, ఆయన లేకుండా తెలంగాణ ఉద్యమంలో ఒక్క సభ కూడా జరగలేదని రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. కానీ, తెలంగాణ సాకారమైన తర్వాత జయజయహే తెలంగాణ పాట మూగబోయిందని, తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన వారిని కనుమరుగు చేసే ప్రయత్నం జరిగిందన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక జయజయహే తెలంగాణ పాటను రాష్ట్ర గీతంగా ప్రకటించామని సీఎం స్పష్టం చేశారు. ఇవాళ ప్రతి పుస్తకంలో మొదటి పేజీలో జయజయహే తెలంగాణ పాట కనిపిస్తోందని, ఉద్యమంలో అందరం పాడిన పాట, ప్రజలు మెచ్చిన పాటనే రాష్ట్ర గీతంగా ప్రకటించామన్నారు.
అందెశ్రీ, గద్దర్ కుటుంబాలను ఈ ప్రభుత్వం ఆదుకుంటోందని, తెలంగాణకు చెందిన 9 మంది కవులు, కళాకారులను గౌరవించి, 300 గజాల ఇంటిస్థలం ఇచ్చామని సీఎం వివరించారు. ఎస్సీ వర్గీకరణను అమలు చేసిన తొలిరాష్ట్రం తెలంగాణ అని, చదవుల్లోనే కాదు.. విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లోనూ ఎస్సీల పాతినిధ్యం పెరగాలని ఆయన కొనియాడారు. మంత్రివర్గంలోనూ ఎస్సీలకు సముచిత ప్రాధాన్యం ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. అనంతరం మాయమై పోయేనమ్మ మా అందెశ్రీ లోక కవి అందెశ్రీ సంస్మరణ గీతాన్ని ఆవిష్కరించారు.