22-11-2025 07:55:39 PM
నిర్వాసితులను గుర్తించకుండానే రోడ్డును ఆక్రమిస్తారా...?
గతంలోనూ ప్రధాన రహదారి విస్తరణలో నిర్వాసితులకు అన్యాయమే..
మళ్లీ ఇదే తరహాలో పాత ఆంధ్ర బ్యాంక్ రహదారి నిర్వాసితులకు అన్యాయం చేస్తే ఊరుకోం...
బిఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గం ఇంచార్జ్ చల్మెడ లక్ష్మీ నరసింహా రావు..
రాజన్న సిరిసిల్ల (విజయక్రాంతి): వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోందని వేములవాడ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు అన్నారు. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధిని ఎవరు అడ్డుకోవడం లేదని స్వాగతిస్తున్నప్పటికీ ప్రభుత్వ పనితీరుపైనే ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. రాజన్న ఆలయంలో చేస్తున్న అభివృద్ధి ఇప్పటికీ రహస్యంగా ఉంచడమే కాకుండా కనీసం స్థానిక పట్టణ వాసులకు కూడా వెల్లడించకపోవడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి..? ఎప్పటిలోగా పూర్తి చేస్తామని చెప్పకుండానే రాజన్న ఆలయాన్ని మూసివేశారు.
దీంతో ఇప్పటికే వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి వ్యాపారం నడుస్తుందో నడవదు తెలియని పరిస్థితులలో అనేక చిరు వ్యాపారులు భయాందోళన మధ్య బ్రతుకుతున్నారు. అభివృద్ధి జరిగితే వ్యాపారం వృద్ధి చెందుతుంది అన్న ఆశ కూడా లేకుండా ఉంది ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరు. అభివృద్ధి పేరుతో ఎవరిపై విరుచుకుపడతారు అని నిత్యం భయాందోళన మధ్య రాజన్న ఆలయ పరిసరాల్లో ఉన్న కుటుంబాలు బిక్కుబిక్కుమంటున్నాయి. ప్రధాన రహదారిని విస్తరిస్తామని గొప్పలు చెప్పి. చివరికి వారికి కనీస పరిహార విషయంలోనూ న్యాయం చేయకుండానే బలవంతంగా కూల్చివేశారు. కన్నతల్లికి అన్నం పెట్టనోడు పినతల్లికి బంగారు గాజులు చేయించినట్టు. ఇచ్చిన పరిహారం మీద కోర్టుకు వెళ్ళమని మాత్రం ఉచిత సలహా ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ పాత ఆంధ్ర బ్యాంక్ రహదారిని ఆలయ విస్తరణ కోసం ఆక్రమిస్తున్నారు.
ఈ దక్షిణ ప్రధాన రహదారిలో ఉన్న ఇండ్లు, దుకాణాల యజమానులు ఇప్పటికే గుండె పట్టుకొని కాలం వెళ్లదీస్తున్నారు.పరిహారం నిర్ణయించకుండా, ఎక్కడి దాకా తీసుకుంటారు నోటీసులు ఇవ్వకుండా ప్రభుత్వం ఇస్తానుసారంగా వివరిస్తున్న తీరు ప్రజాస్వామ్యానికే తీవ్ర విరుద్ధం... ఎంతవరకు తీసుకుంటారు... పరిహారం ఎంత ఇస్తారో ప్రజలను మెప్పించాకే పనులు చేపట్టకపోతే ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదు.ప్రధాన రహదారి లాగా అధికారంలో ఉన్నామని లాక్కుంటామని ప్రభుత్వం చూస్తే ఈ తప్పనిసరిగా బిఆర్ఎస్ పార్టీ వారికి అండగా ఉండి ప్రతిఘటిస్తాం. ఇప్పటికైనా ప్రజలకు చేసే పనులు... చేపట్టబోయే అభివృద్ధి పనులను వివరించి మెప్పించి ఒప్పించి పనులు చేసుకోవాలి. ప్రజలు హర్షించే స్థాయిలో అభివృద్ధి పనులు జరగాలి. బెదిరింపుతో చేస్తే ప్రజా మూల్యం చెల్లించుకుంటారు. గతంలో మా ప్రభుత్వం సేకరించిన భూముల విషయంలో ఎక్కడా కూడా ప్రజలను ఇబ్బంది పెట్టలేదు. మేము సేకరించిన 35 ఎకరాల్లోనే మీరు అభివృద్ధి పనులు చేస్తున్నారు. ప్రజలకు జవాబుదారీగా ఉండి అభివృద్ధి పనులను వివరించి మీ చిత్తశుద్ధి ప్రకటించుకోండి.