calender_icon.png 21 July, 2025 | 9:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూగబోయిన సాయంత్రాలు!

23-12-2024 12:00:00 AM

మౌనంగా జోగుతున్న వేదిక ఉలిక్కి పడుతుంది 

జాకీర్ వేళ్ల దరువు అతని చేతి కొనల ఇంద్రజాలం 

తబలా నాదం తకధిమీ తకధీమి చిందులేస్తుంది 

పాతకొత్త మేలుకలయిక రాగాల అలల చిందులు 

సంగీత ప్రవాహా స్వరగంగ పరుగుల నడక 

సంగీత హృదయాలమీద ఏ కావ్యమై నిలిచారో 

మీరు ప్రతి గుండె చప్పుడై నిరంతరం 

ఆ నాథతరంగ లయలా సమ్మోహన పరుస్తారు.

ఆ తబల ఊపు, దాని నడక ఉత్సాహ తరంగమై 

సరికొత్త లోకాలను స్పృశిస్తుంది, సృజిస్తుంది. 

భారతీయత సంస్కృతికి ప్రతిబింబంగా 

అల్లారాఖా ఆశీస్సులతో మీ సంగీత సాధన 

వారణాసి నుంచి మొదలైన మీ పాట 

హిమశిఖరమంత ఎత్తుగా మీ సంతకం.

అతని నవ్వు వహ్‌తాజ్ అంత మధురంగా 

ప్రతి ఉదయం సంగీత స్వరమై పలకరింపు 

తబలా స్వర తరంగం సరికొత్త ఉత్సాహాన్ని 

ఉత్తేజగీతంలా ప్రతి గుండెను మీటుతుంది.

ఈ సాయంత్రాలు, కచేరి వేదికలు నిశ్శబ్దం పాటిస్తున్నాయి 

బరువైన హృదయాలతో అంజలి ఘటిస్తున్నాయి 

ఇక ఆ చేతివేళ్లు మీటని అపస్వర గీతంలా మిగిలిపోయి 

ఆ తబల గుండెచప్పుడు మూగపోయింది 

ఒక సెలయేటి ప్రవాహ సవ్వడి ఆగిపోయింది.

 -బొల్లిముంత వెంకట రమణారావు