calender_icon.png 21 July, 2025 | 5:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భొనమెత్తిన భగ్యనగరం

21-07-2025 01:05:33 AM

లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొన్నం, కోమటిరెడ్డి 

హైదరాబాద్ అంతటా బోనాలు

హాజరైన కేంద్రమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు నేతలు

హైదరాబాద్, సిటీ బ్యూరో జులై 20 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర పండుగగా వైభవంగా జరుగుతున్న ఆషాఢ బోనాల ఉత్సవాల్లో భాగంగా ఆదివారం భాగ్యనగరం ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లింది. అమ్మవార్ల ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, డప్పు చప్పుళ్ల మధ్య మహిళలు బోనాలను ఊరేగింపుగా తీసుకెళ్లి ఆయా ఆల యాల్లో అమ్మవార్లకు సమర్పించారు.

పాతబస్తీలోని లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి ఆలయం భక్తజన సంద్రంగా మారింది. ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమా ర్క, హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్‌యాదవ్ పట్టువస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారిని వేడుకున్నారు. పాతబస్తీలోని అక్కన్న మాదన్న ఆలయం, చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం, అంబర్‌పేట, ఖైరతాబాద్, బోరబండ మహంకాళి ఆలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతిలో అనాదిగా వస్తున్న గొప్ప సంప్రదా యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కొనియాడారు.

గోల్కొండలో ప్రారంభమైన ఉత్సవాలు సోమవారం సింహవాహిని అమ్మవారి బోనాలతో విజయవంతంగా కొనసాగుతున్నాయని తెలిపా రు. రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, దేవాదాయ శాఖకు దాదాపు రూ.1,290 కోట్లు కేటాయించామని వెల్లడించారు.

ప్రత్యేకంగా హైదరాబాద్ బోనాల కోసం రూ.20 కోట్లు విడుదల చేశామని, మహంకాళి అమ్మవారి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ, పోలీస్, దేవాదాయ శాఖలు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకున్నాయని ప్రశంసించారు.

ఉత్సవాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు

హైదరాబాద్ నగరంలో నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, రాం చంద్రనాయక్, రాకేశ్‌రెడ్డి, రాజాసింగ్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, కాంగ్రెస్ నేత ఫిరోజ్‌ఖాన్, బీజేపీ నేతలు లక్ష్మణ్, మాధవిలత, ఎమ్మెల్సీలు విజయశాంతి, కల్వకుంట్ల కవిత, నగర మేయర్ విజయలక్ష్మి, జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన, జోగిని నిషా క్రాంతి, గాయని మధు ప్రియ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకు న్నారు. కాగా తాను లాల్ దర్వాజ బోనాల్లో పాల్గొనడం ఇదే ప్రథమమని మంత్రి వాకాటి శ్రీహరి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వానికి అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.

అమ్మవారి ఆశీర్వాదం అందరిపై ఉండాలి: మంత్రి కొండా సురేఖ

గోల్కొండలో తొలి బోనం సమర్పించడంతో జంట నగరాల్లో మొదలైన బోనాల ఉత్సవాలు ఉత్సవాలు విజయవంతం కావడం పట్ల దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హర్షం వ్యక్తం చేశారు. ప్రకృతితో మమేకమై జీవించే వ్యవసాయ ఆధా రిత, సాంప్రదాయ, సామూహిక తాత్వికత బోనాల పండుగ సందర్భంగా తెలంగాణ గడ్డ మీద నుంచి ప్రపంచానికి ప్రదర్శితం అవుతుందన్నారు.

బోనాలు విజయవంతం కావడం పట్ల కృషి చేసిన దేవాదాయ శాఖ సిబ్బంది, మున్సిపల్ కార్మికులు, ఎలక్ట్రిసిటీ సిబ్బంది, ఇతర శాఖల అధికారులకు, సిబ్బందికి మంత్రి సురేఖ ధన్యవాదాలు తెలిపారు. గత సంవత్సరం కంటే ఈసారి బోనాలకు అధిక నిధులు కేటాయించిన సీఎం రేవంత్‌రెడ్డి, హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌కు మంత్రి సురేఖ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కాగా సోమవారం హంపి నుంచి తీసుకువచ్చిన లక్ష్మీ ఏనుగుపై అమ్మవారి ఘటం ఊరేగింపు డప్పు నృత్యాలు, పోతరాజు ప్రదర్శ నలతో వైభవంగా జరుగనున్నది. ఇందు కోసం రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారులు సకల ఏర్పాట్లు చేశారు.

ఉత్సవాలు విజయవంతం: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 

గోల్కొండలో వెలసిన జగదాంబిక ఎల్లమ్మ తల్లికి ఆషాఢ మాసం తొలి బోనం సమర్పించడంతో జంట నగరాల్లో మొదలైన బోనాల ఉత్సవాలు లాల్ దర్వాజ సింహావాహిని అమ్మవారికి బోనం సమర్పించడంతో ముగిశాయని, దేవాదాయ శాఖ, ఇతర శాఖల కృషి, పర్యవేక్షణతో నెలరోజుల పాటు జరిగిన బోనాల ఉత్సవాలు విజయవంతం అయ్యాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల ఆధ్యాత్మిక సంస్కృతికి ప్రతీక బోనాల పండుగ అన్నారు. బోనాలు విజయవంతం అయ్యేందుకు కృషి చేసిన అన్ని శాఖల అధికారులకు, సిబ్బందికి సీఎం అభినందనలు తెలిపారు.