21-07-2025 12:19:32 AM
ఇప్పటికే ఖరారైన జడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాలు
రిజర్వేషన్లపై మొదలైన చర్చలు
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై 20(విజ యక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇప్ప టికే జడ్పీటీసీ, ఎంపీటీసీ, జడ్పీపీపీ ఎంపీపీ స్థానాలను ప్రకటించడంతో రిజర్వేషన్లపై చర్చ మొదలైంది. ప్రభుత్వం 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు మంత్రివర్గం లో ఆర్డినెన్స్ తీసుకువచ్చి నివేదికను గవర్నర్ కు అందజేశారు.
42 శాతం రిజర్వేషన్లు అమలు అమలతో స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ ముఖచిత్రం మారనుంది.ఎంపీటీసీ, జడ్పిటిసి, సర్పంచ్, వార్డు సభ్యుల పదవీ కాలం ముగిసి దాదాపు సంవత్సరానికి పైగా గడిచిపోయింది. స్థానిక సంస్థల ఎన్నికల జాప్యం కావడంతో పలువురు ఎన్నికల నిర్వహించాలని హైకోర్టును ఆశ్రయిం చారు. సెప్టెంబర్ 30వ తేదీలోగా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియను వేగవతం చేసింది.
ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన పూర్తిస్థాయి ఏర్పాట్లను సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పంచాయతీరాజ్ , గ్రామీణ అభివృద్ధి శాఖయంత్రాంగాన్ని సిద్ధం చేస్తుంది. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి తప్పులు , తప్పిదాలు చోటు చేసుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యతను జిల్లా పరిషత్ సీఈవో, జిల్లా పంచాయతీ అధికారులపై వేసింది.
తర్జనభర్జనలో ఆశావహులు...
జిల్లాలో 15 మండలాల లో నిర్వహించనున్న స్థానిక ఎన్నికల నిర్వహణపై అధికార యంత్రంగా ఇప్పటికే నిమగ్నం అయిం ది. ప్రభుత్వం42 శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పించేందుకు ఆర్డినెన్స్ తీసుకురావడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో బరిలో నిలిచి ఉండే అభ్యర్థుల్లో రిజర్వేషన్లపై తర్జనభజన మొదలైంది. 127 ఎంపీటీసీ స్థానాలు,15 జడ్పిటిసిలు,1 జడ్పీ చైర్మన్,15 ఎంపీపీ స్థానాలు ఖరారు అయ్యాయి.
335 గ్రామ పంచాయతీలలో దాదాపుగా 1800 వందలకు పైగా వార్డు సభ్యులు,335 సర్పంచ్ స్థానాలకుల ఎన్నికలు జరగనున్నాయి. రెండు మున్సిపాలిటీలలో 40 కౌన్సిలర్ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా రిజర్వేషన్ల అమలు తో ప్రస్తుతం ఉన్న స్థానాల లో మార్పులు జరగనుండడంతో పోటీలో నిలిచే అభ్యర్థుల్లో గందరగోళం మొదలైంది.
సామాజిక వర్గాల వారీగా లెక్కలు..
ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తే రిజర్వేషన్లఆధారంగా తమకు అనుకూలంగా ఉన్న చోటులో అవకాశం వస్తే గెలుపొందడం సులభంగా అవుతుందని ఆశావాహులు అంచనాలను వేసుకుంటున్నారు.స్థానికతను బట్టి ఇప్పటికే రిజర్వేషన్ల అమలుపై వార్డుల వారీగా రాజకీయ పార్టీల నాయకులు లెక్క లు వేసుకుంటున్నారు.
మరో కొంతమంది అయితే ఇప్పటికే ఎన్నికల్లో నిలిచినందుకు ప్రణాళికలు తయారు చేసుకొని అంతర్గతంగా ముందుకు సాగుతున్నారు. సామా జిక వర్గాల వారీగా లెక్కలు వేసుకొని రిజర్వేషన్లను తేల్చే పనిలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఉండడం చూస్తుంటే ఈసారి ఎన్నికలు ఉత్కంఠ భరితంగా ఉండే అవకాశం ఉంది.
రిజర్వేషన్ల మార్పుతో అయోమయం
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు జరిగితే సర్పంచ్ స్థానాలలోనూ మార్పులు జరిగే అవకాశం ఉండడంతో అందరిలోనూ అయోమయంగా ఉంది.గతంలో ప్రజాప్రతినిధిగా కొనసాగినచోట మరోసారి అవకాశం వస్తే అక్కడి వాతావరణం తెలిసి ఉంటుంది కాబట్టి ఎన్నికల్లో గెలిచేందుకు అవకాశాలు ఉంటాయి.ఒకవేళ మార్పు జరిగి తేముఖ పరిచయంతో పాటు తాము గతంలో చేపట్టిన అభివృద్ధిని ప్రజలకు వివరించడం కొంత ఇబ్బందిగా మారుతుంది.
బుసి బిమేష్, మాజీ సర్పంచ్, ఈదులవాడ