24-01-2026 01:00:54 AM
రాయ్‌పూర్, జనవరి 23: ఛత్తీస్‌గఢ్‌లోని ధంతరి జిల్లాలో శుక్రవారం తొమ్మిది మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరి లొంగుబాటుతో రాయ్‌పూర్ పోలీస్ రేంజ్ పరిధి పూర్తిగా మావోయిస్టు రహితంగా మారినట్లు ఐజీ అమరేష్ మిశ్రా అధికారికంగా ప్రకటించారు. లొంగిపోయిన వారిలో ఏడుగురు మహిళా మావోయిస్టులు ఉన్నారని, లొంగిపోయిన వారి తలలపై రూ.47 లక్షల రివార్డు ఉన్నట్లు ఆయన తెలిపారు.
లొంగిపోయిన వారిలో తెలంగాణకు చెందిన ఉష అలియాస్ బాలమ్మ కూడా ఉంది. ఆమె మావోయిస్టు పార్టీ డివిజనల్ కమిటీ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నది. లొంగిపోయిన వారంతా దండకారణ్యంలోని ధంతరి, గరియాబంద్ జిల్లాలతోపాటు అలాగే ఒడిశాలోని నువాపాడ జిల్లా సరిహద్దుల్లో క్రియాశీలకంగా వ్యవహరించేవారు. తాజా లొంగుబాటుతో ఈ ప్రాంతాల్లో మావోయిస్టుల ఉనికి దాదాపు కనుమరుగైందని రెండు రాష్ట్రాల పోలీస్‌శాఖ భావిస్తున్నది.
లొంగిపోయిన వారు రెండు ఇన్సాస్ రైఫిళ్లు, రెండు ఎల్‌ఎస్‌ఆర్ తుపాకులు, ఒక కార్బైన్, ఒక మజిల్ లోడింగ్ గన్‌ను పోలీసులకు అప్పగించారు. మరోవైపు ఒక్క జనవరిలోనే దేశవ్యాప్తంగా 189 మంది మావోయిస్టులు ఆయుధాలు వీడి బయటకు వచ్చారు.
గతేడాది 2025లో రాష్ట్రవ్యాప్తంగా 1,500 మందికి పైగా లొంగిపోగా, సుమారు 317 మంది ఎన్‌కౌంటర్లలో మరణించారు. కేంద్ర ప్రభుత్వం 2026 మార్చి 31 నాటికి దేశం నుంచి వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగానే భద్రతా బలగాలు ‘ఆపరేషన్ కగార్’ను ఉధృతంగా చేపడుతున్నది. బలగాలు కూంబింగ్ కొనసాగిస్తున్నాయి.