మోదీతో పినరయి రహస్య ఒప్పందం

19-04-2024 02:01:35 AM

l అందుకే కేసులున్నా సీఎంపై చర్యలు సున్నా

l ప్రధాని కాబోయేది రాహుల్ గాంధీయే

l వయనాడ్‌లో రైతులతో సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, ఏప్రిల్ 18 (విజయక్రాంతి): కేరళ ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులపై ఈడీ, ఆదాయ పన్ను కేసులున్నా వారిపై ప్రధాని మోదీ చర్యలు తీసుకోవడం లేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాని మోదీతో పినరయ్ రహస్య ఒప్పందం వల్లే ఇది సాధ్యమైందని ఆరోపించారు. బంగారం స్మగ్లింగ్‌లో విజయన్ కుటుంబ సభ్యుల పాత్ర ఉన్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చూస్తే ఇది నిజమనిపిస్తున్నదని ఆయన అన్నారు. కేరళలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి గురువారం వయనాడ్‌కు చెందిన రైతులతో సమావేశమయ్యారు.

తెలంగాణ, కర్ణాటక, జార్ఖండ్, ఢిల్లీ వంటి రాష్ట్రాలు కేంద్రంతో నిధుల కోసం పోరాడుతున్నాయని అన్నారు. కేరళ సీఎం మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. విజయన్ పైకి సీపీఎం ముఖ్యమంత్రిగా, కమ్యూనిస్టు నాయకునిగా కనిపిస్తున్నా ఆయన కమ్యూనలిస్టు అని, మతతత్వ బీజేపీతో కలిసి పనిచేస్తున్నారని ఆరోపించారు. వయనాడ్‌లో బీజేపీ అభ్యర్థి సురేంద్రన్‌కి కేరళ సీఎం మద్దతునిస్తున్నాడని అన్నారు. సొంత పార్టీ సీపీఎంతో పాటు కేరళ ప్రజలను విజయన్ మోసం చేస్తున్నాడని, ఈడీ, ఆదాయపన్ను కేసులున్నన్ని రోజులు సీపీఎం పార్టీ కోసం విజయన్ పనిచేయబోరన్నారు. మణిపూర్‌లో వందలాది క్రైస్తవులు బీజేపీ గూండాల చేతిలో చనిపోతే... ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా కనీసం అక్కడ పర్యటించలేదన్నారు. కానీ రాహుల్ గాంధీ అక్కడి బాధితులను కలిసి వారి బాధలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారని రేవంత్ అన్నారు. 

రాసిపెట్టుకోండి... 

జూన్ 9న రాహుల్ గాంధీ ఈ దేశ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేస్తారని రేవంత్ జోస్యం చెప్పారు. దేశంలో రెండు పరివార్‌ల మధ్య పోరాటం జరుగుతోందని.. మోదీ పరివార్‌లో ఈడీ, ఈవీఎంలు, సీబీఐ, ఐటీ, అదానీ, అంబానీ ఉన్నారని, ఇండియా పరివార్‌లో ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, వయనాడ్ కుటుంబ సభ్యులున్నారని తెలిపారు. ఇందిరా, రాజీవ్ దేశం కోసం ప్రాణత్యాగం చేశారని.. సోనియా, రాహుల్ పదవులను త్యాగం చేశారని అన్నారు. వయనాడ్ ప్రజలు రాహుల్ గాంధీ వైపున్నారని, ప్రత్యక్షంగా తమ ప్రచారమే అవసరం లేదన్నారు. రాహుల్ గాంధీపై ప్రజల అభిమానాన్ని ప్రత్యక్షంగా చూద్దామనే తాను తెలంగాణ నుంచి కేరళ వచ్చనట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.

తెలంగాణ నుంచి పోటీ చేయాలని తాము రాహుల్ గాంధీని కోరామని కానీ ఆయన వయనాడ్ వైపే మొగ్గు చూపారని తెలిపారు. గత ఎన్నికల్లో వాయనాడ్‌లో ఆయనకు 65 శాతం ఓట్లు వచ్చాయని, ఈ ఎన్నికల్లో 75 శాతం ఓట్లు రావాలని కోరారు. మోదీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని, వయనాడ్ వర్సెస్ వారణాసి మధ్యన ఇప్పుడు పోరాటం సాగుతోందన్నారు. వయనాడ్ ప్రజలు ఈ దేశానికి కాబోయే ప్రధానికి ఓటేస్తున్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. కేరళ ప్రజలు ఎంతో కష్టపడే స్వభావం కలవారని, వారి శ్రమ వల్లే దుబాయ్ లాంటి దేశాలు ఎంతో అభివృద్ధి చెందాయన్నారు.  కానీ కేరళ మాత్రం ఇంకా అభివృద్ధి చెందలేదని తెలిపారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితే కేరళతోపాటు దేశమంతా అభివృద్ధి చెందుతుందని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.