పార్టీ మారిన నేతలే దిక్కా!

19-04-2024 02:09:34 AM

l జంపింగ్ జపాంగ్‌లకే గుర్తింపు

l లోక్‌సభ ఎన్నికల్లో వారికే టికెట్లు

l పార్టీ సిద్ధాంతాలకు తిలోదకాలు  

హైదరాబాద్, ఏప్రిల్ 1౮ (విజయక్రాంతి): ఒక పార్టీ.. ఒక సిద్ధాంతం.. అంటూ ఉండట్లేదు. ప్రజలకు మేలు కలిగేలా పరిపాలనను పక్కనపెట్టి, తమకు లాభదాయకంగా ఉండే పదవులే లక్ష్యంగా నేతలు పార్టీలు మారుతున్నారు. దుంకుడు కప్పలను తలదన్నేలా వీరు పార్టీలు మారుతున్నారు. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలు ప్రకటించిన అభ్యర్థులను పరిశీలిస్తే ఇదే మనకు అవగతం అవుతుంది.  

ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల నుంచి 17 స్థానాలకు ప్రకటించిన అభ్యర్థుల రాజకీయ ప్రస్థానం పరిశీలిస్తే.. ఒకింత వెగటు కలుగకమానదు. ఈ పార్టీ ఆ పార్టీ అన్న తేడా లేకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే టికెట్లు ఇచ్చారు. ఐదేండ్ల పాటు ప్రజలను పరిపాలించే నేతలుగా.. ఒక పార్టీ.. ఒక సిద్ధాంతం అంటూ లేకుండా కేవలం పార్టీ మారడం.. టికెట్లు తెచ్చుకోవడం.. లేదా ముందే టికెట్టుపై హామీ తీసుకుని పార్టీ మారడం.. ఆఖరికి రాత్రిపూట పార్టీ మారి.. తెల్లవారిసరికల్లా టికెట్టు సంపాదించుకుంటున్న నేతలు ఉండటం గమనార్హం.

ఆదిలా బాద్ మొదలుకుని.. నాగర్‌కర్నూల్ వరకు.. ఖమ్మం నుంచి మెదక్ వరకు పరిశీలిస్తే ఇదే అర్థమవుతుంది. ఆదిలాబాద్‌లో బీజేపీ అభ్యర్థి గోడం నగేష్ మొదట్లో టీడీపీ, తరువాత బీఆర్‌ఎస్‌లో చేరారు. అక్కడ కూడా పదవులు అనుభవించి.. తాజాగా బీజేపీలో చేరి టికెట్టు పట్టారు. ఇక బీఆర్‌ఎస్ నుంచి బరిలో ఉన్న ఆత్రం సక్కు మొదట్లో కాంగ్రెస్‌లో ఎమ్మెల్యేగా ఉంటూ.. బీఆర్‌ఎస్‌లో చేరారు. ఇప్పుడు బీఆర్‌ఎస్ ఎంపీగా పోటీలో ఉన్నారు. 

వరంగల్ రసవత్తరం.. 

మొన్నటి వరకు రసవత్తరంగా కొనసాగిన వరంగల్ అభ్యర్థుల ఎంపికను చూసినా ఇదే అవగతం అవుతోంది.  మొన్నటి వరకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగిన అరూరి రమేశ్ చివరి క్షణంలో బీజేపీలో చేరి టికెట్టును తెచ్చుకున్నారు. అలాగే సీనియర్ నాయకుడు కడియం శ్రీహరి టీడీపీ నుంచి రాజకీయ ప్రస్తానం మొదలుపెట్టి.. బీఆర్‌ఎస్‌లో చేరారు. డిప్యూటీ సీఎంగా పదవులను అనుభవించారు. తన కూతురు కావ్యకు ఎంపీ టిక్కెట్టు కావాలని పట్టుబట్టి సాధించుకున్నారు. చివరకు అధికార కాంగ్రెస్ పార్టీలో చేసి అక్కడ కావ్యకు ఎంపీ టిక్కెట్ దక్కించుకున్నారు. జహీరాబాద్‌లో ఎంపీగా కొనసాగుతున్న బీఆర్‌ఎస్ నేత బీబీ పాటిల్.. ఒక రోజు ముందు బీజేపీలో చేరి తెల్లవారేసరికల్లా టికెట్టు దక్కించుకున్నారు.

నల్లగొండలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ ఓడిపోయిన సైదిరెడ్డి.. పార్టీ మారిన వెంటనే బీజేపీ నుంచి లోక్‌సభ అభ్యర్థిగా బరిలో నిలిచారు. గతంలో టీడీపీలో ఉంటూ బీఆర్‌ఎస్‌లోకి మారిన కృష్ణారెడ్డికి బీఆర్‌ఎస్ టిక్కెట్టు ఇచ్చింది. నాగర్‌కర్నూల్‌లో చూసుకుంటే మొన్నటి వరకు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ బీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకుని ఎంపీగా బరిలో దిగారు. బీఆర్‌ఎస్ జడ్పీటీసీగా ఉన్న భరత్.. ఆయన తండ్రి ప్రస్తుత ఎంపీ రాములుతో కలిసి బీజేపీలో చేరి ఎంపీ టిక్కెట్టును చేజిక్కించుకున్నారు. ఇలా ఎక్కడ చూసినా.. పార్టీ మారిన వారికే టిక్కెట్లు ఇస్తున్నారు. ఇలా రాష్ట్రంలోని అత్యధిక నియోజకవర్గాల్లో పార్టీలు మారిన నేతలకే టిక్కెట్లు రావడం గమనార్హం.  

కొంతలో కొంత..

పార్టీలు మారడం అనే అంశాన్నే పరిగణలోకి తీసుకుంటే.. గంజాయి వనంలో తులసి మొక్కల్లా చెప్పుకోదగిన రాజకీయ నేతలు కూడా ఉండటం కొంతలో కొంత నయం అనే భావాన్ని కల్గిస్తున్నది. ఒకే పార్టీలో ఉంటూ సిద్ధాంతాలకు కట్టుబడి ఓడినా.. గెలిచినా అదే పార్టీలో కొందరు నేతలు కొనసాగుతుండటాన్ని మాత్రం ప్రజలు గమనిస్తున్నారు. ఇలాంటి వారు ఒకసారి ఓడిపోవచ్చు.. కానీ ఆ నేతల విలువలకు మాత్రం ఎప్పటికైనా గుర్తింపు ఉంటుందని రాజకీయ విశ్లేషకులు సైతం కితాబిస్తున్నారు.

అలాంటి వారిలో బీజేపీ నుంచి కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ లాంటినేతలను చెప్పవచ్చు. కాంగ్రెస్ విషయానికి వస్తే సురేశ్ షెట్కార్, వంశీచంద్, మల్లురవి, బలరాం నాయక్, టీ జీవన్‌రెడ్డి మొదటి నుంచి అదే పార్టీ తరఫున బరిలో నిలుస్తున్నారు. బీఆర్‌ఎస్‌లో కొప్పుల ఈశ్వర్ (పార్టీ పెట్టినప్పటి నుంచి), బీ వినోద్‌కుమార్, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, పద్మారావుగౌడ్ గులాబీ సిద్ధాంతానికే కట్టుబడి ఉంటూ వస్తున్నారు. ఏదేమైనా ఎన్నికలు వస్తున్నాయంటేనే.. కప్పలతో పోటీ పడుతూ పార్టీలు మారుతున్న నేటి కాలంలో ఒకే పార్టీలో కొనసాగడం గొప్ప విషయమనే చెప్పాలి.