తెలంగాణ ఆకాంక్షల వారధి విజయక్రాంతి

19-04-2024 02:32:49 AM

పత్రిక ప్రారంభోత్సవంలో చైర్మన్ సీఎల్ రాజం

హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఏప్రిల్ 18 (విజయక్రాంతి) : తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల వారధి ‘విజయక్రాంతి’ తెలుగు దిన పత్రిక అని పత్రిక చైర్మన్ సీఎల్ రాజం అన్నారు. గురువారం జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు సమీపంలోని ఇంటర్ కాంటినెంటల్ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రధాన కార్యాలయంలో పత్రికా మేనేజింగ్ డైరెక్టర్, డైరెక్టర్లతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇంటర్ కాంటినెంటల్ పబ్లికేషన్స్ సంస్థ ఉద్యోగులు, జర్నలిస్టులతో కలిసి ఆయన ‘విజయక్రాంతి’ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా  విజయక్రాంతి ఉంటుందన్నారు. సుదీర్ఘ పోరాటాల ద్వారా తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.


విజయక్రాంతి తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే పరమావధిగా బాధ్యతాయుతమైన కర్తవ్యదీక్షను నిర్వర్తించాలని సూచించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు పూర్తిస్థాయిలో నెరవేరలేదన్నారు. అయితే ప్రభుత్వం చేస్తున్న మంచి చెడులతో పాటు ప్రజల కష్ట సుఖాలకు కూడా విజయక్రాంతిలో ప్రాధాన్యత ఉంటుందన్నారు. విజయక్రాంతి జర్నలిస్టులు, ఉద్యోగులు ఒక కుటుంబంగా సమిష్టిగా పనిచేసి విజయక్రాంతి పత్రికను తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ వన్ పత్రికగా నిలబెట్టాలన్నారు. ఈ సందర్భంగా ఇంటర్ కాంటినెంటల్ ఉద్యోగులకు చైర్మన్  సీఎల్ రాజం ప్రత్యేక శుభాకాంక్షలు చెప్పారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఇంటర్ కాంటినెంటల్ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ చిలప్పగారి విజయారాజం, డైరెక్టర్లు చిలప్పగారి శ్రీకాంత్, చిలప్పగారి  సౌమ్య,  ఎడిటర్ కె.కృష్ణమూర్తి, సీఈవో దేవళ్ల రాహుల్, స్టేట్ బ్యూరో చీఫ్ ఎక్కల్‌దేవి శ్రీనివాస్, హైదరాబాద్ సిటీబ్యూరో చీఫ్ బూడిద సుధాకర్, సెంట్రల్ డెస్క్ సీనియర్ జర్నలిస్టులు కె.రాంప్రసాద్, బెక్కం వేణు, ఎం.రాంచందర్, దోర్బల బాలశేఖరశర్మ, కె.రామకృష్ణ, సత్యప్రసాద్, ఇంతియాజ్, సర్క్యులేషన్ జీఎం శ్రీకాంత్, అడ్వర్టుజింగ్ జీఎం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.