144 మంది నామినేషన్లు.. 169 సెట్లు

23-04-2024 02:09:59 AM

l బీజేపీ, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నుంచి పలువురు అభ్యర్థులు 

l భారీగా నామినేషన్లు వేసిన స్వతంత్రులు 

హైదరాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానా లకు సోమవారం ఒక్కరోజే 144 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు.  కొందరు అభ్యర్థులు రెండు సెట్లు వేయడంతో నామినేషన్ల సంఖ్య 169కి చేరింది. వీరిలో చాలా మంది స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. ఆదిలాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణ నామినేషన్ వేయగా మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగారు. పెద్దపల్లిలో 14 మంది అభ్యర్థు లు నామినేషన్ వేయగా ఒకరు ధర్మసమాజ్ పార్టీ నుంచి మిగతా 13 మంది  స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేశారు.

కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్‌రావు నాలుగు సెట్ల నామినేషన్ వేశారు. 13 మం ది స్వతంత్రులుగా నామినేషన్ వేశారు. నిజామాబాద్ పార్లమెంట్‌కు 12 మంది నామి నేషన్లు వేయగా బీఆర్‌ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్, బీజేపీ నుంచి ధర్మపురి అర్వింద్‌తో పాటు మరో 10 మంది స్వతంత్రులుగా నామినేషన్లు వేశారు. జహీరాబాద్‌లో బీజేపీ నుంచి బీబీపాటిల్, కాంగ్రెస్ నుంచి సురేష్ షెట్కార్‌తోపాటు మరో ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. మెదక్ లోక్‌సభకు 7 గురు అభ్యర్థులు స్వతంత్రులు గా నామినేషన్లు వేశారు. మల్కాజిగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా పట్నం సునీతా మహేందర్‌రెడ్డి, బీజేపీ నుంచి ఈటల రాజేందర్‌తో పాటు 8 మంది స్వతంత్రులుగా నామినేషన్లు దాఖలు చేశారు.

సికింద్రాబాద్ నుంచి ధర్మసమాజ్ పార్టీ నుంచి రాసాల వినోద్‌కుమార్‌తోపాటు మరో ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ పత్రాలు సమర్పించారు. చేవెళ్లలో 11 మంది నామినేషన్లు దాఖలు చేయగా, వీరిలో బీజేపీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, 10 మంది స్వతంత్రులు ఉన్నారు. మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ నంచి చల్లా వంశీచంద్‌రెడ్డి, మరో ముగ్గురు ఇండిపెండెంట్‌గా నామినేషన్లు దాఖలు చేశారు. నాగర్‌కర్నూల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి తరఫున ఆయన భార్య నామినేషన్ పత్రాలు సమర్పించారు. బీఆర్‌ఎస్ నుంచి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, బీజేపీ నుంచి పోతుగంటి భరత్, సిట్టింగ్ ఎంపీ పోతుగంటి రాములుతోపాటు మరో ముగ్గురు నామినేషన్లు వేశారు.

నల్లగొండలో బీజేపీ నుంచి శానంపుడి సైది రెడ్డితోపాటు మరో 9 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఇక భువనగిరిలో బీఆర్‌ఎస్ నుంచి క్యామ మల్లేశ్, మరో 10 మంది స్వతంత్రులుగా నామినేషన్లు వేశారు. వరంగల్‌లో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా మారేపల్లి సుధీర్‌కుమార్,  కాంగ్రెస్ నుంచి కడియం కావ్యతోపాటు 8 మంది ఇండిపెండెంట్‌గా నామినేషన్లు వేశారు. ఇక మహబూబాబాద్‌లో బీజేపీ నుంచి సీతారామ్‌నాయక్, ఆల్‌ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి అరుణ్‌కుమార్‌తో పాటు ఒకరు స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ వేశారు.  ఖమ్మం పార్లమెంట్‌కు ఏడుగురు అభ్యర్థులు స్వతంత్రులుగానే నామినేషన్ వేశారు.