కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత

23-04-2024 01:50:04 AM

l లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు 8 నుంచి 10 సీట్లు గ్యారెంటీ

l పార్టీని వీడిన వారి గురించి చింతించొద్దు.. పార్టీలో ఉన్న వారికి అండగా ఉంటాం

l బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలతోనే నిత్యావసరాల ధరల పెరుగుదల

l బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు

హైదరాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి)/రాజన్న సిరిసిల్ల: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ప్రజావ్యతిరేకతను మూటగట్టుకుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. జిల్లాకేంద్రంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో  సోమవారం పార్టీ సిరిసిల్ల పట్టణ, క్లస్టర్‌స్థాయి కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అబద్ధపు హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నో స్థానాల్లో కాంగ్రెస్ స్వల్ప మెజార్టీతో గెలిచిందన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ 8 నుంచి 10 స్థానాలు దక్కించుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బూటకపు మాటలను ప్రజలకు వివరించి లోక్‌సభ ఎన్నికల్లో మట్టికరిపించాలన్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేయకపోతే ఉచిత ప్రయాణ పథకాన్ని తీసేస్తామని కాంగ్రెస్ నేతలు కొన్నిచోట్ల బెదిరిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను కార్యకర్తలు ప్రజలకు వివరించాల న్నారు. బీజేపీ నేత బండి సంజయ్ ఎంపీగా కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ ప్రజలకు ఏం మేలు చేశారో చెప్పాలన్నారు. ‘బండి’ ఒక్క బడి  నిర్మించలేదని, ఒక్క గుడి కట్టించలేదని, ఒక్క పరిశ్రమ తీసుకురాలేదని ధ్వజమెత్తారు.

ఆయనకు ప్రజలకు ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలతో నిత్యావసర ధరలు అమాంతం పెరిగాయన్నారు. స్వార్థ రాజకీయాల కోసం బీఆర్‌ఎస్‌ను వీడిన వారి గురించి చింతించవద్దని కార్యకర్తలకు సూచించారు. కష్టకాలంలో పార్టీ వెంట ఉన్నవారికే అండదండలు ఉంటాయని స్పష్టం చేశారు. ప్రజల సమస్యలే ఎజెండాగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీజేపీ మోసాలను ప్రజల్లోకి వెళ్లి ఎండగడదామన్నారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి వినోద్‌కుమార్ గెలుపుతో జిల్లాను మరింత అభివృద్ధి చేసుకోవచ్చన్నారు.  పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా మే 10న పార్టీ అధినేత కేసీఆర్  సిరిసిల్లలో రోడ్ షో నిర్వహిస్తారన్నారు. ప్రతి కార్యకర్త రోడ్ షోకు తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు.