అభ్యర్థుల తొలిపోరు

23-04-2024 02:21:33 AM

ప్రత్యక్ష రాజకీయ బరిలో పలువురు 

l గెలుపు కోసం శ్రమిస్తున్న అభ్యర్థులు 

l తొలి ప్రయత్నంలోనే జాక్ పాట్‌పై కన్ను 

హైదరాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల పోరు ఊపందుకున్నది. ఇప్పటికే బరిలో నిలిచిన అభ్యర్థుల్లో చాలా మంది ఒక విడుత నియోజకవర్గాన్ని చుట్టేశారు. బీజేపీ, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థులుగా ప్రకటించినవారిలో చాలామంది తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి జాక్ పాట్ కొట్టేందుకు చెమటోడ్చుతున్నారు. గతంలో వీరు పలుమార్లు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలుగా పోటీ చేసేందుకు ప్రయత్నించినా అవకాశం దక్కలేదు. వారికి ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించిన ఆయా పార్టీల అధిష్ఠానాలు విజయం సాధించాలని సూచించాయి.

కొంపెల్ల మాధవీలత

హైదరాబాద్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొంపెల్ల మాధవీలత మొదటిసారి ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీపడుతున్నారు. ప్రైవేటు హాస్పిటల్ నడుపుతున్న మాధవీలత.. స్వచ్ఛంద సేవ చేయడమే కాకుండా హిందూ సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తుంటారు. హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఆమె పేరు ఖరారు అయిన తర్వాతే మాధవీలత బీజేపీలో చేరారు.

పోతుగంటి భరత్

పోతుగంటి భరత్ నాగర్‌కర్నూల్ ప్రస్తుత ఎంపీ పోతుగంటి రాములు కుమారుడు. భరత్ ప్రస్తుతం బీఆర్‌ఎస్ పార్టీ కల్వకుర్తి జెడ్పీటీసీ సభ్యుడిగా ఉన్నారు. జెడ్పీచైర్మన్ అయ్యే అవకాశం ఉన్నా పార్టీలోని కొందరు నాయకులు అడ్డుకున్నారనే ఆవేదనతో 2024లో తండ్రి రాములుతో కలిసి బీజేపీలో చేరారు. పార్టీలో చేరిన మూడు రోజులకే భరత్‌కు బీజేపీ నాగర్‌కర్నూల్ ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇచ్చింది.

తాండ్ర వినోద్‌రావు

రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన వినోద్‌రావు సామాజిక సేవ ద్వారా ప్రజల్లోకి వెళ్లారు. వినోద్‌రావు తొలిసారిగా ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు పార్టీ అధిష్ఠానం అవకాశం ఇచ్చింది. 

మారేపల్లి సుధీర్‌కుమార్ 

హనుమకొండ జిల్లాకు చెందిన మారేపల్లి సుధీర్‌కుమార్ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ అభ్యర్థి. 2001 నుంచి తెలంగాణ ఉద్యమ కారుడిగా, పార్టీకి విధేయుడిగా, అధినేతతో కలిసి పనిచేశారు. 2019లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీగా విజయం సాధించి జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. కడియం కావ్య బీఆర్‌ఎస్ టికెట్ నిరాకరించి కాంగ్రెస్‌లోకి వెళ్లడంతో సుదీర్ కుమార్‌కు గులాబీ పార్టీ అధిష్ఠానం ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చింది. 

గాలి అనిల్‌కుమార్

సుధీర్ఘంకాలం కాంగ్రెస్‌లో ఉండి పార్టీలో పలు బాధ్యతలు చేపట్టిన గాలి అనిల్‌కుమార్ అక్కడ రాజకీయంగా అవకాశాలు ఇవ్వకపోవడంతో 2018 ఎన్నికల తరువాత టీఆర్‌ఎస్‌లో చేరారు. 2023లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ప్రయత్నించినా అవకాశం దక్కలేదు. ప్రస్తుతం జహీరాబాద్ బీఆర్‌ఎస్ అభ్యర్థిగా అవకాశం ఇవ్వడంతో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

గడ్డం శ్రీనివాస్‌యాదవ్

హైదరాబాద్ పాతబస్తీలో పేరున్న నాయకుడు గడ్డం శ్రీనివాస్‌యాదవ్. పలు విద్యాసంస్థలు నిర్వహిస్తూ పేద విద్యార్థులకు ఉచిత విద్యనందిస్తున్నారు. శ్రీనివాస్‌యాదవ్ సేవలు చూసి ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి సీఎం వైఎస్‌ఆర్ రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి కట్టబెట్టారు. తదనంతరం టీఆర్‌ఎస్‌లో చేరి పారీ ్టకోసం పనిచేశారు. అధిష్ఠానం ప్రస్తుత ఎన్నికల్లో హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించింది. 

కంచర్ల కృష్ణారెడ్డి

కంచర్ల కృష్ణారెడ్డి న్యాయవాదిగా నల్లగొండలో మంచిపేరు తెచ్చుకున్నారు. వీరు టీడీపీలో పదేండ్లు పనిచే శారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కృష్ణారెడ్డి సోదరుడు భూపాల్‌రెడ్డి నల్లగొండ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత సోదరులిద్దరూ టీఆర్‌ఎస్‌లో చేరారు. 2018లో భూపాల్‌రెడ్డి నల్లగొండ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రస్తుతం కృష్ణారెడ్డి బీఆర్‌ఎస్ నల్లగొండ అభ్యర్థిగా ప్రత్యక్ష పోటీలో నిలిచారు.

కాంగ్రెస్ నుంచి ఐదుగురు

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్లో ప్రస్తుతం ఐదుగురు తొలిసారి పార్లమెంట్‌కు పోటీపడుతున్నారు. భువనగిరి నుంచి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, నల్లగొండ బరిలో కుందూరు రఘవీర్‌రెడ్డి, ఆదిలాబాద్ అభ్యర్థిగా అత్రం సుగుణ, వరంగల్ బరిలో కడియం కావ్య, పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ తొలిజాచి పోటీ చేస్తున్నారు.

రాగిడి లక్ష్మారెడ్డి

కాంగ్రెస్‌లో రాజకీయం జీవితం ప్రారంభించిన రాగిడి లక్ష్మారెడ్డి పలుమార్లు ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించినా పోటీచేసే అవకాశం లభించలేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఉప్పల్ నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డారు. చివరికి బీఆర్‌ఎస్‌లో చేరారు. ప్రస్తుతం మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పార్టీ అవకాశం కల్పించింది. దీంతో లక్ష్మారెడ్డి తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల ద్వారా చట్టసభకు పోటీపడుతున్నారు.