భక్తజన సంద్రం.. అంజన్న క్షేత్రం

24-04-2024 01:54:24 AM

l కొండగట్టులో భక్తిశ్రద్ధలతో హనుజ్జయంతి వేడుకలు

l అర్చకుల ప్రత్యేక పూజలు.. మాలధారుల దీక్షా విరమణ

జగిత్యాల, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): ఎటుచూసినా ఆధ్యాత్మిక వాతావరణం.. పుష్కరిణిలో పుణ్య స్నానమాచణం.. మాలధారుల ప్రదక్షిణం.. స్వామివారిని దర్శననానికి బారులు తీరిన భక్తజనం.. ఇలా జగిత్యాల జిల్లాలోని మల్యాల మండలంలోని కొండగట్టు ఆలయం మంగళవారం హనుమాన్ జయంతి సందర్భంగా ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నది. ‘జై శ్రీరామ్.. జై హనుమాన్’ అనే నినాదంతో మార్మోగింది.. భక్తులతో కిటకిటలాడింది. కార్యక్రమాల్లో భాగంగా ‘అంజన్న మాలధారులు’ తొలుత కల్యాణ కట్ట భవనంలో దీక్షను విరమించారు. స్నానమాచరించి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచి సుమారు లక్ష మంది భక్తులు తరలివచ్చారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు, సిబ్బంది ఏర్పాట్లు చేశారు. సోమవారం ఉత్సవాలు ప్రారంభం కాగా బుధవారంతో ముగియనున్నాయని వారు తెలిపారు. స్వామివారిని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు దర్శించుకున్నారు. అనంతరం ఆలయ పరిసరాల్లో కలియదిరిగి భక్తులకు అందుతున్న సేవలను పరిశీలించారు. సిబ్బందికి పలు అంశాలపై సలహాలు, సూచనలిచ్చారు. పర్యటనలో ఆర్డీవో మధుసూదన్, ఆలయ ఈవో చంద్రశేఖర్, దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ కృష్ణప్రసాద్ ఉన్నారు. కలెక్టర్ యాస్మిన్ బాషా ఎప్పటిప్పుడు ఏర్పాట్లపై అధికారులను అప్రమత్తం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటలనకు తావు లేకుండా ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్ ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.