కాళ్లకు గజ్జె కడితే ఇంట్లో ఉండొద్దన్నారు!

24-04-2024 02:25:53 AM

ఇంటర్వ్యూ

ప్రేక్షకుడిని కట్టి పడేసే కళ ఒగ్గు కథ. ఇది కేవలం కథ మాత్రమే కాదు. గానం, నృత్యం, నాటక మిశ్రమం. గొల్ల, కురుమల ఇంటి దైవం మల్లన్న, కుల గురువు బీరప్ప, ఎల్లమ్మ కథలు చెప్పేందుకు ఎంచుకున్న రూపమే ఒగ్గుకథ. డోలు, తాళం, కంజీర వాయిద్యాలతో తెలంగాణ భాషలో గంటలకొద్ది ఎన్నయినా కథలు చెబుతారు. అచ్చమైన తెలంగాణ జానపద కళారూపం ఇది. రాగభావయుక్తంగా ఒక కథను అల్లడం, చెప్పడం ఈ కథాగానం ప్రత్యేకత. ఈ ఒగ్గు కథ కళారూపాన్ని ఈ తరానికి అర్థమయ్యేలా చెప్పడంలో అందేవేసిన చెయ్యి చౌదరపల్లి రవికుమార్‌ది. కాళ్లకు గజ్జె కట్టి కథ చెబుతా అంటే ఇంట్లో ఉండొద్దన్నారు తండ్రి... ఒగ్గునే ప్రాణంగా భావించిన రవి ఒంటరిగా బయటకు వచ్చి వారసత్వంగా వస్తున్న ఒగ్గు కథకు జీవం పోశారు. ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శనలు ఇవ్వడమే కాదు, జాతీయ స్థాయిలో పురస్కారం అందున్నారు. ప్రస్తుతం ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ రీజినల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఒగ్గు రవిగా సుపరిచితమైన రవితో ఈ వారం ముచ్చట ఆయన మాటల్లోనే..!

నాకు ఈ విద్య నేర్పిన మా తాత చుక్క సత్తయ్యకు ఋణపడి ఉంటాను. ఆయన 80 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నేను 20 ఏళ్ల వయసులో ఉన్నాను. ఆయనతో నేను ప్రతిరోజు చర్చకార్యక్రమాలు జరుపుతూ ఉండేవాడిని. చుక్క సత్తయ్య గారు ఒక్కటే విషయాన్ని చేప్పేవారు. “మనం ఎక్కువ జ్ఞానాన్ని అర్జించాలి అంటే గురువును అనుసరించాలి లేదంటే చెప్పింది నేర్చుకోవడం అన్న చేయాలి”. అని చెప్పారు.

మాది ఉమ్మడి వరంగల్ జిల్లాలోని (ప్రస్తుతం జనగాం జిల్లా) లింగాల ఘణపురం మండలం మాణిక్యపురం అనే చిన్న గ్రామం. మా తాత డాక్టర్ చుక్కా సత్తయ్య ద్వారా వారసత్వంగా ఈ ఒగ్గు నా చేతిలోకి వచ్చిందని చెప్పాలి. ఆయన 2005లో అప్పటి ఉమ్మడి ఎ.పి. గవర్నర్ సుశీల్ కుమార్ షిండే చేతుల మీదుగా కాకతీయ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ పొందారు. మా తాత చదివింది పెద్ద బాలశిక్ష అయిన ప్పటికి  అపారమైన  మేధస్సును మస్తిష్కంలో దాచుకున్న మహానుభావుడు. తనకు తానుగా తెలుగులో చదవటం, రాయటం నేర్చుకొని తనకున్న కళపై పట్టు తెచ్చుకున్నాడు. ఇలా ఒగ్గు కథా రంగంలోకి ప్రవేశించి అంచెలంచలుగా ఎదిగారు.

నేను ఆ కమ్యూనిటీ కుటుంబంలో జన్మించినందుకు సహజంగానే మా తాత లక్షణాలు వచ్చాయి. చాలామంది అనేవారు కథలు చెప్పుకుంటే ఏమోస్తది రా.. అది కూటికి వచ్చేదా..? కాటికి పంపేదా..? అని. డాక్టర్ చదువు.. లాయర్ చదువు.. అవి చదవలేకపోతే ఏదన్న బిజినెస్ చెయ్యి. ఏదైనా కానీ డబ్బులు వచ్చే పని చెయ్యి అని చెప్పేవారు. డబ్బు సంపాదించడం అనేది నా దృష్టిలో సర్వసాధారణ పని. డబ్బు సంపాదించడానికి చాలా పనులు ఉన్నాయి.

మా కుటుంబ నేపథ్యం వేరు. నా డిగ్రీ తర్వాత  ఓసారి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి వెళ్లాను. అక్కడికి వెళ్లి చూసే సరికి నేను ఒక స్పష్టమైన అభిప్రాయానికి రావడం జరిగింది. నా కళా రూపం  గురించి చదువుకోవడానికి ఆస్కారం ఉన్నప్పుడు, వేరే చదువులు ఎందుకు చదవాలి అని ఒక ఆలోచన వచ్చింది. ఆ ఒక్క ఆలోచనతో నేను ఇంట్లో నుంచి బయటకు రావడం జరిగింది. అప్పటికే మా నాన్న కాంట్రాక్టర్‌గా పనిచేసేవారు. మా నాన్న ఎప్పుడు చెప్పేవాళ్లు.. నువ్వు చదివితే కచ్చితంగా ఇంజనీరింగ్ చదవాలి.  కాళ్లకు గజ్జెలు కట్టి కథ చెప్త అంటే నువ్వు ఇంట్లో ఉండొద్దని అన్నారు.  ఆ విధంగా నేను మా నాన్నను కొంచెం ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం. కానీ అల్టిమేట్‌గా నచ్చిన రంగంలో పని చేయడం అనేది నాకు సంతోషాన్ని కలిగించిన విషయం. అందరికి చెప్పేది ఒక్కటే నచ్చిన రంగంలో పని చేయండి. అప్పుడే హ్యాపిగా ఉంటారు. అది ఆత్మకు సంతృప్తిని ఇస్తుంది.  ఇవాళ నా గుర్తింపుకు కారణం ఒగ్గు మాత్రమే. ఒగ్గు నా పక్కన లేకపోతే నాకంటూ గుర్తింపు, పేరు ఉండకపోయేది.

జానపద కథలకు పుట్టిల్లు తెలంగాణ

వాయిద్య పరికరాలతో కథలుగా చెప్పొచ్చు. అది బైండ్ల కథ కావొచ్చు, శారద కాండ్రు(శారద కథ) కావొచ్చు. గొల్ల కురుమల కులపురాణ కథలను ఒగ్గు కథలు అంటారు. ఒగ్గు అనగా ఢమరుకం అని అర్థం. ఢమరుకాన్ని వాయిద్య పరికరంగా ఉపయోగించుకొని కథలు చెప్పడం జరుగుతుంది. ఇది మన తెలంగాణ ప్రాంతంలో పుట్టింది. జానపద కళారూపాల్లో భాగమే ఒగ్గు కథ. సహజంగా ఒగ్గుకథను ప్రారంభించే ముందు గంగాదేవి గొప్పతనాన్ని కీర్తిస్తూ ప్రార్థన గీతం ఉంటది. ఆ తర్వాత కథ చెప్పడం ప్రారంభిస్తాం. మేం చెప్పిన ప్రధాన ఒగ్గు కథల్లో మల్లన్న కథ, బీరప్ప కథ, ఎల్లమ్మ కథలు ప్రధానమైనవిగా చెప్పొచ్చు. పాత్రకు తగిన విధంగా వేషధారణ, సంగీతం, గానం చేయాలి. ఒగ్గు కథ చెప్పే సమయంలో ఢమరుకం, డోలు, తాళం, అందెలు, కాళ్లకు గజ్జెలు ఉపయోగించాలి.

ఒగ్గు కథను ఆధునిక నాటక రంగానికి అనువర్తనం చేసిన ప్రయోగాల్లో రజాకార్, ధర్మా గ్రహం, బలి, ఇంకెన్నాళ్లు, పంతులు పద్మము ఓ భగవంతుడు వంటివి ప్రశంసలను అందుకున్నాయి. హరిశ్చంద్ర కథ, నల్లపోచమ్మ కథ, అల్లిరాణి కథ, అక్క మహాంకాళి కథ, రంభ రంపాల కథ, బస్మాసుర వధ, సత్యవతి కథ, బాలనాగమ్మ లాంటి అనేక కథలను ఒగ్గు కథారూపంలోకి చెప్పడం జరిగింది. ఒగ్గు కథ కళారూపం కేవలం యాదవ కథలకు మాత్రమే పరిమితం కాదు. మిగతా వృత్తి పురాణాల వాళ్లు కూడా చెప్పుకోవొచ్చు. భారత దేశంలోని ప్రతి రాష్ట్రాన్ని తిరిగి, తెలంగాణ భాష, యాస, సంస్కృతి సంప్రదాయాలను ఒగ్గు కథా రూపంలో చూపించాం. మాలేషియా లాంటి వివిధ దేశాల్లో ఒగ్గు కథను ప్రదర్శించాం. విదేశాల్లో ఒగ్గు కథకు ఆదరణ ఎక్కువగా ఉంటుంది. అందులో ముఖ్యంగా మల్లన్న కథ చాలా ప్రాముఖ్యం అయినది.  ఒగ్గులో మూడు ముఖ్యమైన భాగాలు ఉంటాయి. ఒకటి పట్నాల ప్రక్రియ, రెండు కథగాన ప్రక్రియ, నృత్య ప్రక్రియ.

కేరళ చండా వాయిద్యం, ఒగ్గు ఒక్కటేనా!

వీరశైవ సంప్రదాయ పద్ధతిలో చాలా రకాలు ఉన్నాయి. సౌత్‌లో ముఖ్యంగా వీరశైవ సంస్కృతి అనగానే రౌద్రం, శైవ రౌద్రం గుర్తుకు వస్తుంది. గ్రామీణ దేవతల నేపథ్యంలో ముఖ్యంగా ఉత్పత్తి కులాల నుంచి వాయిద్యాలు ఎక్కువ ఉద్భవించాయి. సహజంగా కళా రూపాలన్ని కూడా ఉత్పత్తి కులాల నుంచి వచ్చినవే. సో ఇవన్నీ కూడా ఎక్కడో ఒక దగ్గర శివుడికి, శివుడి అంశాలకు ముడిపడి ఉన్నా కళా రూపాలు. మన దగ్గర మల్లన్న సంప్రదాయం అంతా కూడా వీరశైవ సంస్కృతే. కానీ అన్నీ శివుడి అంశలే కదా.   

ఇన్‌స్టిట్యూట్  గురించి!  

ప్రస్తుతం మా ఇన్‌స్టిట్యూట్‌లో 5,187మంది విద్యార్థులు శిక్షణ తీసుకుంటున్నారు. ఈ రోజు ఒగ్గు డోలు, ఒగ్గు కథ అంటే ప్రజలందరికీ ఒక హాట్  కేక్ అనే చెప్పాలి. నేను వచ్చిన పరిస్థితులు ఎట్లాంటివి అంటే.. ఒగ్గుడోలు.. ఒగ్గుకు సంబంధించిన రంగంలో అడుగు పెడ్తే.. వానికి పిల్లను కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి రావటానికి ముప్పయి ఏళ్లు పట్టింది. 

ఏడు గవ్వల దర్శనం

ఒగ్గు కళా రూపాలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి మా కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్లు మాత్రమే చేయగలరు. ఎందుకంటే దీనికి కొన్ని పరిమితులు, పరిధులకు మేం కట్టుబడి ఉంటాం. ఇందులో ముఖ్యమైనది ఏడు గవ్వల దర్శనం. ఏడు గవ్వల దర్శనం వేసేటప్పుడు కచ్చితంగా గొర్రె ఉన్నికి ఏడు గవ్వలు అల్లిన దండను మా మెడకు కట్టుకొని పట్నాం వేయాలి. దీన్ని వేసేటప్పుడు చాలా పవిత్రంగా ఉండాలి. మద్యం, మగువ, మాంసము ఈ మూడు ముట్టుకోవొద్దు. ఏడు గవ్వల దండ మెడకు కట్టుకుంటే కాళ్ళకు చెప్పులు కూడా ఉండొద్దు. ఇది ధరించినప్పుడు కచ్చితంగా ఈ నియమాలు పాటించాలి.

దేవుడు ఉన్నాడా? లేడా? అనే విషయాన్ని కొంచెం పక్కకు పెడితే.. మనల్ని ఏదో ఒక శక్తి గమనిస్తుందనే భయం మనలో కలుగుతుంది. ఈ ప్రక్రియను ఎవరు పడితే వాళ్ళు చేయడానికి వీలులేదు. మేం చేస్తం అని వచ్చిన వాళ్లు కూడా చేసుకోవచ్చు. కానీ వచ్చిన ప్రతిఫలం ప్రతికూలంగా లేదా సానుకూలంగా ఉంటది. అది చేయించిన వాళ్ల మీద ఆధారపడి ఉంటది. ఇందులో గొల్ల, కురుమ రెండు ఉంటాయి. ఇందులో పట్నాలు వేయించుకునే వాళ్లు యాదవులు, కురుమలు ఉంటారు. కురుమలలో రెండు రకాలు ఉంటారు. ఒకరు ఒత్తెందారి కులం, మరొకరు ఆశ్రిత కులం. ఒత్తెందారి కులం వారు మాత్రమే ఏడు గవ్వల దర్శనం వేయాలి. ఇది వారికి వారసత్వంగా వస్తోంది. మిగతా వారు ఒగ్గు కథ చెప్పుకొవొచ్చు.  ఇలా ప్రతి కులానికి సంబంధించి ఆశ్రిత కులాలు కచ్చితంగా ఉంటాయి. 

తల్లిదండ్రుల కాళ్లకు దండం పెట్టాలి!

నా ఎదుగుదలకు చాలామంది సపోర్టు చేశారు. ముఖ్యంగా మా అమ్మ, అయ్య కాళ్లకు దండం పెట్టాలి. ఎన్ని జన్మలెత్తిన వాళ్ల ఋణం తీర్చుకోలేను. నాకు ఈ విద్య నేర్పిన మా తాత చుక్క సత్తయ్యకు ఋణపడి ఉంటాను. ఆయన 80 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నేను 20 ఏళ్ల వయసులో ఉన్నాను. ఆయనతో నేను ప్రతిరోజు చర్చకార్యక్రమాలు జరుపుతూ ఉండేవాడిని. పొద్దుగాల ఇంత బువ్వ తిని బయటకు వస్తే మళ్ళీ సాయంత్రం మా అమ్మ బువ్వ తిందురా అని పిలిచే వరకు చర్చలు జరుగుతూనే ఉండేవి. చుక్క సత్తయ్య గారు ఒక్కటే విషయాన్ని చేప్పేవారు. “మనం ఎక్కువ జ్ఞానాన్ని అర్జించాలి అంటే గురువును అనుసరించాలి లేదంటే చెప్పింది నేర్చుకోవడం అన్న చేయాలి”. అని చెప్పారు.

పట్నాల ప్రక్రియ రెండు రకాలు!

కొమురవెల్లి మల్లన్న, ఐనవోలు పేరు వినగానే ఠక్కున గుర్తుకొచ్చేవి పట్నాలు. మల్లన్న జాతర ఉత్సవాల్లో అధికారిక కార్యక్రమాల్లో పెద్ద పట్నాలు వేయడం సంప్రదాయమైతే సామాన్య భక్తులు వారి కోర్కెలు నెరవేరితే పట్నాలు వేసి మొక్కులు సమర్పించుకోవడం ఆనవాయితీగా జరుగుతుంది. మరే ఇతర ఆలయాల్లో లేనివిధంగా కొమురవెల్లిలో పట్నాల మొక్కు చెల్లింపునకు ఎంతో ప్రత్యేకత ఉంది. పెద్ద పట్నాలు అంటే పంచరంగుల పట్నాలతోటి దేవున్ని నాగవేల్లి పట్నం పిలిచి ఆ పట్నం మీద దేవున్ని కూర్చొబెట్టి దేవుని కళ్యాణం అంగరంగ వైభవంగా చేస్తాం.

దేవునికి లగ్గం చేస్తున్న క్రమంలో మల్లన్న స్వామి మొత్తం చరిత్రను సంప్రదాయబద్ధంగా చెప్తం. కథ చెప్పే సమయంలో బృందంలో ఐదుగురు లేదా ఆరుగురం ఉంటాం. పెద్ద పట్నాలప్పుడు మాత్రం సుమారు ఒక 60/70 మంది కావాలి. ఇళ్లల్లో వేసుకునే పట్నాల ప్రక్రియను మొక్కుబడి కథ అంటారు. ఇంటి పెద్దకు ఎక్కువ ఇష్టం ఉన్న కథను మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఒగ్గుడోలు విన్యాసంలో కథ చెప్పేటప్పుడు దాదాపు 20 నుంచి 200 మంది యువ కిశోరాలై ఉంటారు. ఎందుకంటే అదొక వీర శైవత్వంతో కూడిన ప్రక్రియ పూర్తిగా రౌద్రం ప్రదర్శించే  కళారూపం.

 రూప