రేవంత్‌వి అసత్య ఆరోపణలు

24-04-2024 01:00:04 AM

l రైతులను పట్టించుకున్నదే బీఆర్‌ఎస్ ప్రభుత్వం

l ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి

హైదరాబాద్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): తెలంగాణ రైతాంగాన్ని గత ప్రభుత్వం పట్టించుకోలేదని సీఎం రేవంత్‌రెడ్డి అబద్ధాలు మాట్లాడుతున్నారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. బకాయిలు రావాలని ఎర్రజొన్న రైతులు ఆందోళ న చేస్తే కాల్పులు జరిపి, కేసులు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో రూ.11 కోట్ల బకాయిలు రైతులకు చెల్లించి, బేషరతుగా కేసులు ఎత్తివేసిందన్నారు. రైతులపై ప్రేమ ఉందో అప్పుడే తెలిసిందన్నారు. పసుపు బోర్డు తెస్తామని మళ్లీ మోసపూరిత వాగ్దానాలు చేస్తూ రైతులను మరోసారి దగా చేసేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. 50 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు పసుపు బోర్డు ఇవ్వడానికి రాలేదా? అని ప్రశ్నించారు.

ఎన్నికల కోసం ఇష్టారీతిన మాట్లాడటం సిగ్గుచేటన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి పసుపు బోర్డు సాధ్యంకాదని చెప్పిన బీజేపీ కూడా ఎన్నికల లబ్ధి కోసం బోర్డు ఇచ్చామని ప్రధాని మోదీ తో అబద్ధపు ప్రకటన చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. షుగర్ ప్యాకర్టీని తెరుస్తామని మాయమాటలు చెబుతున్నారని ఆరోపించారు. ఆ ప్యాకర్టీని మూసేసిందే కాంగ్రెస్ అని గుర్తుచేశారు. సకాలంలో ఎరువులు, విత్తనాలు ఇచ్చి ధాన్యం కొనుగోలు చేసిన ఘనత కేసీఆర్ సర్కార్‌దేనని, నేటికీ రైతులు ఆయనను గుండెల్లో పెట్టుకున్నారని తెలిపారు. కేవలం పార్లమెంటు ఎన్నికల కోసం దేవుళ్ల మీద ప్రమాణం చేస్తూ రైతులను మభ్యపెడుతున్నారని విమర్శించారు.