ప్రశాంతంగా రెండో విడత పోలింగ్

27-04-2024 12:43:10 AM

* మొత్తం 88 స్థానాలకు జరిగిన ఎన్నిక

* 60.96 శాతం పోలైన ఓట్లు

* అదృష్టాన్ని పరీక్షించుకున్న ప్రముఖులు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: లోక్‌సభ ఎన్నికల రెండో విడత పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 88 లోక్‌సభ స్థానాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధికారికంగా ఓటింగ్ సమయం సాయంత్రం 5 గంటలకే ముగిసినప్పటికీ లైన్‌లో నిలుచున్నవారికి ఓటు వేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. దేశవ్యాప్తంగా జరిగిన ఓటింగ్‌లో 7 గంటల వరకు 60.96 శాతం ఓట్లు పోలైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. రాష్ట్రాలవారీగా చూస్తే మహారాష్ట్ర 53.5 శాతం, మణిపుర్ 76 శాతం, రాజస్థాన్ 59 శాతం, త్రిపుర 76 శాతం, యూపీ 53 శాతం, పశ్చిమ్ బంగాల్ 7౨ శాతం, జమ్ముకశ్మీర్ 67 శాతం, కర్ణాటక 64 శాతం, కేరళ 64 శాతం, మధ్యప్రదేశ్ 55, అస్సాం 71 శాతం, బీహార్ 53 శాతం, ఛత్తీస్‌గఢ్ 72 శాతం నమోదయ్యాయి. 

పోటీలో ప్రముఖులు.. 

మొత్తం 89 స్థానాలకు ఎన్నిక జరగాల్సి ఉండగా మధ్యప్రదేశ్‌లోని బైతూల్‌లో బీఎస్‌పీ అభ్యర్థి మరణించడం వల్ల అక్కడ ఓటింగ్‌ను మూడో దశకు మార్చారు. రెండో దశలో కేరళలోని మొత్తం 20 స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. కర్ణాటకలో 28 స్థానాలకు గాను 14 స్థానాల్లో పోలింగ్ జరిగింది. రాజస్థాన్‌లో 13 స్థానాలు, ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్రలో 8 చొప్పున, అసోం, బీహార్ 5 చొప్పున, మధ్యప్రదేశ్‌లో 6, బెంగాల్, ఛత్తీస్‌గఢ్‌లో మూడేసి, త్రిపుర, మణిపుర్, జమ్ముకశ్మీర్‌లో ఒక్కో స్థానానికి పోలింగ్ జరిగింది. రెండో విడత ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్, లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్, ఎంపీ హేమమాలినితోపాటు పలువురు ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.