ప్రతిపక్షాలకు చెంపపెట్టు

27-04-2024 12:40:41 AM

వీవీప్యాట్ కేసులో సుప్రీం తీర్పుపై ప్రధాని మోదీ

ప్రతిపక్షాలు దేశానికి క్షమాపణ చెపాలని డిమాండ్

సొంత లాభం కోసం ఎన్నికల్ని అవమానిస్తారా?

న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: వీవీప్యాట్ లెక్కింపుపై దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు కొట్టేయడం ప్రతిపక్షాలకు చెంపపెట్టులాంటిందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శిం చారు. ఎన్నికల విధానాన్ని అనుమానించిన ప్రతిపక్ష పార్టీలు దేశానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. శుక్రవారం బీహార్‌లోని అరారియాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ‘ప్రజాస్వామ్యానికి ఇవాళ చాలా మంచి రోజు. ఈవీఎంలపై మొసలి కన్నీరు పెడుతున్న ప్రతిపక్షాలకు చెంపపెట్టులా సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది’ అని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ భారీ కుట్ర 

ఎస్సీలు, ఎస్టీలు, వెనుకబడిన తరగతుల హక్కులను కాలరాసేందుకు కాంగ్రెస్ భారీ కుట్ర పన్నిందని పేర్కొన్నారు. మతపరమైన రిజర్వేషన్లు ఉండొద్దని అంబేద్కర్ స్పష్టంగా చెప్పారని ప్రధాని గుర్తుచేశారు. కాంగ్రెస్ మతపరమైన రిజర్వేషన్లు ఇచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసిందని దుయ్యబట్టారు. ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి నేతలు రాజ్యాంగాన్ని లెక్క చేయరని మోదీ దుయ్యబట్టారు. ‘దశాబ్దాలుగా ప్రజలు వారి ఓటు హక్కును వినియోగించుకోకుండా చేశారు. కనీసం ఓటు వేసేందుకు వారిని బయటకు కూడా రానివ్వలేదు’ అంటూ మండిపడ్డారు.