అంతకుమించి

27-04-2024 12:52:37 AM

ఏమని వర్ణించను.. ఎంతని శ్లాఘించను.. ఒకరా ఇద్దరా.. ఒకరి తర్వాత ఒకరు.. ఒకరిని మించి మరొకరు.. స్లోవర్ బాల్‌ను స్కూబ్ షాట్‌తో సిక్సర్‌గా మలిచిన తీరును ఆస్వాదించే లోపే.. లెంగ్త్‌బాల్‌ను అంతే వైనంగా పుల్ షాట్ ద్వారా గీత దాటిస్తే.. దేన్ని చూడాలో అర్థంకాక ప్రేక్షకులే తలలు పట్టుకుంటుంటే.. ఏ షాట్ గొప్పదో అని అభిమానులే చర్చించుకుంటుంటే! 

ఆహా ఏమా మ్యాచ్.. ఏమా బాదుడు.. ఏమా విజృంభణ.. ఏమా విధ్వంసం.. ఏమా విశ్వరూపం.. ఏమా అరాచకం!

ఒకటా రెండా.. అక్షరాల 42 సిక్సర్లు.. సాధారణంగా ఒక జట్టు సీజన్ మొత్తంలో కొట్టే సిక్స్‌లు ఈ ఒక్క మ్యాచ్‌లోనే నమోదైతే.. ఐపీఎల్ అనే కాదు పురుషుల టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యధిక ఛేదనకు ఈడెన్ గార్డెన్స్ వేదికైంది. 

తొలుత సాల్ట్, నరైన్ బాదుడుతో కోల్‌కతా కొండంత స్కోరు చేస్తే.. ఆ తర్వాత పంజాబ్ టాపార్డర్ టాప్‌గేర్‌లో రెచ్చిపోయి.. మరో 8 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. జానీ బెయిర్‌స్టో అజేయ శతకంతో దుమ్మురేపితే.. ప్రభ్‌సిమ్రన్, శశాంక్ సింగ్ అంతకుమించి అనేలా రెచ్చిపోయి పంజాబ్‌ను గెలిపించారు. 

n కింగ్స్ రికార్డు ఛేదన 

n కోల్‌కతాపై పంజా

n బెయిర్‌స్టో అజేయ శతకం

n శశాంక్, ప్రభ్‌సిమ్రన్ మెరుపులు

n కేకేఆర్‌కు తప్పని నిరాశ

* ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక (262) టార్గెట్‌ను ఛేదించిన తొలి జట్టుగా పంజాబ్  రికార్డు నెలకొల్పింది. పురుషుల టీ20 క్రికెట్‌లో ఇదే అత్యధికం.

* ఐపీఎల్ చరిత్రలో అత్యధిక (42) సిక్సర్లు నమోదైన మ్యాచ్ ఇదే. గతంలో హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్‌లో నమోదైన 38 సిక్సర్ల రికార్డు బద్దలైంది.

కోల్‌కతా: పరుగుల వరద పారిన పోరులో పంజాబ్ కింగ్స్ పంజా విసిరింది. శుక్రవారం జరిగిన పోరులో పంజాబ్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను చిత్తుచేసింది. 262 పరుగుల కొండంత లక్ష్యాన్ని మరో 8 బంతులు మిగిలుండగానే ఛేదించిన పంజాబ్ టీ20ల చరిత్రలోనే అత్యధిక స్కోరును చేజ్ చేసిన జట్టుగా రికార్డుల్లోకెక్కింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 261 పరుగులు చేసింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (37 బంతుల్లో 75; 6 ఫోర్లు, 6 సిక్సర్లు), సునీల్ నరైన్ (32 బంతుల్లో 71; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగి అర్ధశతకాలు నమోదు చేసుకోగా.. మిగిలినవాళ్లు కూడా తలో చేయి వేశారు.

వెంకటేశ్ అయ్యర్ (23 బంతుల్లో 39; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), రస్సెల్ (12 బంతుల్లో 24; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (10 బంతుల్లో 28; ఒక ఫోర్, 3 సిక్సర్లు) ధాటిగా ఆడారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో పంజాబ్ 18.4 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 262 పరుగులు చేసింది. యువ ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (20 బంతుల్లో 54; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) జట్టుకు మెరుపు ఆరంభాన్నివ్వగా.. మరో ఓపెనర్ జానీ బెయిర్ స్టో (48 బంతుల్లో 108 నాటౌట్; 8 ఫోర్లు, 9 సిక్సర్లు) అజేయ శతకంతో అదరగొట్టాడు. ఆఖర్లో శశాంక్ సింగ్ (28 బంతుల్లో 68 నాటౌట్; 2 ఫోర్లు, 8 సిక్సర్లు) అరాచకాన్ని నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లాడు. కోల్‌కతా బౌలర్లలో నరైన్ ఒక వికెట్ పడగొట్టాడు. లీగ్‌లో భాగంగా శనివారం డబుల్ హెడర్ జరగనుండగా.. తొలి పోరులో ఢిల్లీతో ముంబై, రెండో మ్యాచ్‌లో లక్నోతో రాజస్థాన్ తలపడనున్నాయి. 

బాదుడే బాదుడు.. 

ఈ సీజన్‌లో స్పెషలిస్ట్ బ్యాటర్ కంటే ఎక్కువ రెచ్చిపోతున్న సునీల్ నరైన్ మరోసారి మోత మోగించాడు. పవర్‌ప్లేలోనే వీలైనన్ని ఎక్కువ పరుగులు పిండుకోవాలనే లక్ష్యంతో నరైన్ వరుస బౌండ్రీలతో రెచ్చిపోతే.. మరో ఎండ్ నుంచి ఫిల్ సాల్ట్ విధ్వంసానికి తెరలేపాడు. మంచి బంతికి బౌండ్రీ... చెడ్డ బంతికి సిక్సర్ అన్నట్లు సాగింది ఈ ఇద్దరి విధ్వంసం. రెండో ఓవర్లో నరైన్ 6,4 కొడితే.. ఆ మరుసటి ఓవర్లో సాల్ట్ 6,4,6 అరుసుకున్నాడు. నాలుగో ఓవర్‌లో మళ్లీ నరైన్ వంతు.. ఈ సారి రబడ బౌలింగ్‌లో 4,6,4 కొట్టిన నరైన్.. ఇదే జోష్‌లో 23 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్ నుంచి దంచుడు కొనసాగించిన సాల్ట్ 25 బంతుల్లో ఈ మార్క్ అందుకున్నాడు. తొలి వికెట్‌కు రికార్డు స్థాయిలో 138 పరుగులు జోడించిన అనంతరం నరైన్ ఔట్ కాగా.. కాసేపటికే సాల్ట్ కూడా అతడిని అనుసరించాడు. దీంతో స్కోరు వేగానికి కళ్లెం పడుతుందనుకుంటే.. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ప్రతి ఒక్కరూ బంతిని బాదడమే పనిగా పెట్టుకోవడంతో.. కోల్‌కతా భారీ స్కోరు చేసింది. రస్సెల్, శ్రేయస్ విలువైన పరుగులు జోడించారు. 

దంచుడే.. దంచుడే..

ప్లే ఆఫ్స్ ఆశలు అడుగంటిన వేళ.. పోరాడితే పోయేదేముంది అన్నట్లు పంజాబ్ చెలరేగింది. కొండంత లక్ష్యం కళ్ల ముందు కనిపిస్తున్న అదరక బెదరక ఎదురు నిలిచింది. యువ ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ సిక్సర్లే లక్ష్యంగా చెలరేగితే.. ఈ సీజన్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన బెయిర్‌స్టో తొలిసారి బ్యాట్ ఝళిపించాడు. రెండో ఓవర్‌లో రెండు సిక్సర్లు కొట్టిన ప్రభ్‌సిమ్రన్.. మూడో ఓవర్‌లో 6,4,6,4 బాదాడు. గేర్ మార్చిన బెయిర్‌స్టో ఆరో ఓవర్‌లో వరుసగా 4,6,4,4,6 దంచగా.. చివరి బంతికి ప్రభ్‌సిమ్రన్ రనౌట్‌గా వెనుదిరిగాడు. అయినా.. బెయిర్‌స్టో విధ్వంసం మాత్రం అలాగే కొనసాగింది. బౌలర్‌తో సంబంధం లేకుండా.. బంతి మంచిదా, చెడ్డదా అని చూడకుండా చెలరేగిపోయిన బెయిర్‌స్టో.. సిక్సర్ల మీద సిక్సర్లు బాదుతూ లక్ష్యాన్ని కరిగించాడు. ఈ క్రమంలో బెయిర్‌స్టో 45 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకోగా.. ఆఖర్లో శశాంక్ సింగ్ విశ్వరూపం కనబర్చాడు. క్రీజులో ఉన్న అరగంటలో ఈడెన్ గార్డెన్స్‌లో సునామీ సృష్టించాడు. కేవలం 28 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్సర్లతో 68 పరుగులు సాధించాడంటే శశాంక్ విధ్వంసం ఏ స్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు. పంజాబ్ ధాటికి ఒక్క నరైన్ తప్ప మిగిలిన అందరూ బౌలర్లూ ఓవర్‌కు 15 పరుగులకు పైన సమర్పించుకోవడం గమనార్హం. 

సంక్షిప్త స్కోర్లు

కోల్‌కతా: 20 ఓవర్లలో 261/6 (సాల్ట్ 75, నరైన్ 71; అర్ష్‌దీప్ 2/45), పంజాబ్: 18.4 ఓవర్లలో 262/2 (బెయిర్‌స్టో 108 నాటౌట్, శశాంక్ 68 నాటౌట్; నరైన్ 1/24).