18-07-2025 01:20:04 AM
ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల విడుదల కోసం నిజాం కళాశాల వద్ద ఏబీవీపీ నిరసన
హైదరాబాద్, సిటీ బ్యూరో జూలై 17 (విజయక్రాంతి): రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) కార్యకర్తలు గురువారం తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కాన్వాయ్‌ని నిజాం కళాశాల వద్ద అడ్డుకున్నారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ ల జాప్యం కారణంగా వేలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఆర్థిక భారం మోయలేక సతమతమవుతున్నారని ఏబీవీపీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని నెలలుగా ప్రభుత్వం ఈ సమస్యను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ, తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే ఈ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు.
నిజాం కళాశాల వద్ద ఉప ముఖ్యమంత్రి కాన్వాయ్ వస్తుండగా, ఏబీవీపీ కార్యకర్తలు ఒక్కసారిగా అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడి వాతావరణం కొంత ఉద్రిక్తంగా మారింది. పోలీసు లు వెంటనే అప్రమత్తమై ఆందోళనకారులను నిలువరించి, వారిని అదుపులోకి తీసు కున్నారు.