12-01-2026 02:55:03 AM
తెలుగు సాహిత్య వికాసానికి సంబంధించి వరంగల్ గడ్డకు ఒక విశిష్టమైన లక్షణం ఉన్నది. ఈ సీమలో వెలువడిన తరతరాల తెలుగు సాహితీ గరిమ అన్ని ప్రాంతాల కన్నా కూడా విభిన్నమైనది. కవిత్వ స్వరూప స్వభావాలలోనే కాదు.. కవుల అంతర్గతంగా ఉండే వలయాల్లోనూ ఈ భిన్నత్వం కనిపిస్తుంది. ఇక్కడ గ్రాంథిక, వ్యవహారిక అన్న వాదాలపై చర్చ తక్కువ అనే చెప్పవచ్చు. ఎందుకంటే.. ఇక్కడి కవిత్వ భాష, శైలి, పూర్తిగా ప్రజల జీవనాడుల్లోంచి ప్రవహించిన అచ్చమైన తెలుగు కావడమే. ఇక్కడ ఒక్కో రచయిత ఒక్కో సాహిత్య కుసుమమే. ౨ వేల ఏండ్లుగా నిరంతరం సాగుతున్న పోరాటవాదం, ప్రయోగవాదం అక్షరాల్లోకి వచ్చేసరికి వచనమై, పాటై, పద్యమై, కథ అయి అనేక రూపాలను సంతరించుకున్నది. తెలుగుకు మాగాణం ఈ నేల. ఈ సాహిత్య వారసత్వం ఈనాటిది కాదు. మెతుకు సీమలో గుణాఢ్యుడు రెండు వేల ఏండ్ల నాడు బృహత్కథను రచించినప్పటిది.
వృత్తులు, ప్రవత్తులతో సంబంధం లేకుండా అచ్చమైన తెలుగులో నిజమైన కావ్య సృజన చేయగల మహానుభావులు ఈ గడ్డపై ప్రతి అణువులోనూ కనిపిస్తారు. ఇక్కడ పుట్టింది ఒక పోతన కాదు. వేనవేల పోతన్నలు. వారు సష్టించింది అనంత భాగవత స్రవంతి. అలాంటి వారిలో ఒకరు రామా చంద్రమౌళి. ఆయన వృత్తి వేరు. ప్రవృత్తి వేరు. ముఖ్యంగా వచన కవిత్వ మార్గంలో శేషేంద్రశర్మ, తిలక్ మొదలైన వాళ్ల తరువాత కవిత్వ భాషను తన సృజన శక్తితో కొత్తగా ఆవిష్కరించారు. ఆయన కవిత్వమైనా, వచనమైనా భాష విలక్షణమైంది. ఆయన ఎన్నుకొనే శబ్దజాలం, వాక్య విన్యాసం, బింబాలు ప్రతీకలు సామాన్య తెలుగు కవితా పాఠకునికి చిరపరిచితమైనవి కావు. ఆయన భాషలో ఆధునిక ఎలక్ట్రానిక్ పదజాలం కనిపిస్తుంది. గణిత విజ్ఞాన శాస్త్రాంశాలు ఉంటాయి. ఆయన కవిత్వంలో ఒక విశిష్టమైన మనసును కదిలించే భాషా ధోరణి కలిగి ఉంటుంది. ఎందుకంటే నేను నా పదోతరగతి నుంచి ఆయన రచనలను చూస్తూ వచ్చాను. నాకు తెలిసినంతవరకు ఆయన 35కు పైగానే నవలలు రాశారు. కవిత్వ సంపుటాలు వెలువరించారు. ఇక నాటకాలు, విమర్శ వ్యాసాలకైతే లెక్కే లేదు.
రామా చంద్రమౌళి కవిత్వ పంక్తులు చదువుతుంటే ప్రయత్నం లేకుండానే నూతన పద ప్రయోగాలు పాఠకుడిని అలా నిలిపి ఉంచి ఆశ్చర్యం కలిగించేట్టు చేస్తాయి. ఆయన కవిత్వ పంక్తుల నిండా కుప్పలు పోసినట్టుగా కనిపించే పదాలు పాఠకుడిని నిరంతరం వెంటాడుతూనే ఉంటాయి. తన కవిత్వాన్ని, వచన కవులకు మార్గదర్శకంగా నిర్మించడమే కాకుండా ఒక సాంకేతికతను, ముఖ్యంగా క్రియా పదాలను నామ వాచకాలుగా మార్చటం, రూపకాలను ఆకర్షకంగా తీర్చిదిద్దటం, మరచిపోయిన తెలుగు జీవితంలోని అంశాలను అలంకారాలుగా భావుకులను అలరించే విధంగా నిర్మాణం చేశారు. ఆయన కవిత్వం అలతి అలతి పదాలను అలంకరించుకొని పాఠకుడిని తన వెంట రసగంగా ప్రవాహంలో విహారం చేయిస్తుంది. కొన్ని కవిత పంక్తులు మాత్రం వినిపిస్తాను. ‘అతడు సింహం లాంటి నదిని తలనిమిరి జూలు దువ్వి ప్రేమతో శాసిస్తాడు’, ‘సూర్య రతానికి ముందు ఏ రహదారీ ఉండదు, మేఘాల మందలను ఏడబాపుకుంట తొవ్వ చేసుకోవాలె..నీకు నువ్వే.. ఎప్పటికప్పుడు’, ‘ప్రళయ జలోద్ధిత శివతాండవ జగత్ నత్య మహార్ణవ ద్వారాలను తెరిచిందెవరు మనమే..
సంగమ సంలీన సమన్వయచ్ఛటలతో ఉదక విస్ఫోట వైభవం’, ‘పాదాలపై ప్రణమిల్లి తల్లిని ప్రార్థించగానే.. ఆశీర్వదించే చేతివలె ఒక ఏరు పారుతుంది జలోద్ధత ధారై’ అంటారు కవి. ఆయన కవిత్వం ఎంత అద్భుతంగా సాగుతుందో.. వచనం కూడా అంతే కవితాత్మకంగా సాగుతుంది. సహజంగా కవియైన రచయిత వచనం రాస్తే.. అది కూడా కవిత్వం లాగానే ధ్వనిస్తుంది. ఆయన వాక్యం అద్భుతంగా ఉంటుంది. ఎక్కడైనా విరుగుతుంది. ఎక్కడైనా ఆగుతుంది. నెమ్మదిగా సాగుతుంది.. వేగంగా పరుగెడుతుంది. అది ఒక అద్భుతమైన శైలీ విన్యాసంగా చెప్పవచ్చు. ఆయన భావ భూమికలు వేరు కావచ్చేమో కానీ, సజన భూమికలు ఒక్కటే. ఆయన కవిత్వంలో కథ కనిపిస్తుంది. ఆయన కథలో కవిత్వం కనిపిస్తుంది. అది ఆయనకు మాత్రమే చెందిన శైలి.
కవిత్వం గురించి ఆయన ఒక వ్యాసంలో అన్న మాటలు ఇవి. ‘అక్షరాలు కవిత్వ పరిమళాన్ని నింపుకుని ఉదాత్తమౌతున్నప్పుడు వాటికవే రాగాత్మకమూ, లయాత్మకమూ కూడా అవుతాయి. ఐతే ఈ కవిత్వ సుందరత, ప్రాణవాయుత్వము కేవలం కవిత్వాన్ని ఆస్వాదించగల రస పిపాసులకు మాత్రమే అనుభవమవుతాయి’. ఇంతకంటే కవిత్వానికి అద్భుతమైన నిర్వచనం మరొకటి ఏముంటుంది? ఆయన రచనలన్నింటిలోనూ ఈ అనుభూతి రాగాలు అందంగా వినిపిస్తాయి. రామాచంద్రమౌళి మొదట్లో ప్రచురించిన కవితా సంపుటాలు శిలలు వికసిస్తున్నాయి (1979) స్మతిధార (1984)ల్లో కవి ఇంత విస్తతంగా కవితా గంగా ప్రవాహాలను కుమ్మరించలేదు. వాటిలో పరిమిత బింబాల ప్రతీకల వాక్యవిన్యాసాల పునరావత్తి ఉన్నది. గొంతులో ఇతర కవుల ముద్రలు ఉండవచ్చేమో కానీ, ఆ తరువాతి కాలంలో ఆయన తనదైన విభిన్నమైన ముద్ర కవిత్వంపై బలంగా వేశారు.
అభివ్యక్తి విషయంలో చంద్రమౌళి కవితలో తీవ్రత చాలా ఎక్కువ. కవి నిరంకుశుడు అన్నట్టు.. చంద్రమౌళి తన సృజన విషయంలో సర్వ స్వతంత్రుడు. భాషలో అనూహ్య మైన వేగం కనిపిస్తుంది, అభివ్యక్తిలో విలక్షణమైన వినూత్న వైఖరి ఉంటుంది. వస్తు విన్యాసంలో ఆత్మీయత ఉంటుంది. ఎందుకంటే ఒక సృజనకారుడిగా వివిధ సామాజిక, తాత్త్విక, ఆత్మానుగత, మార్మిక అంశాలతో కూడుకున్న వస్తువును ఆయన రచనకు ఎంచుకుంటారు. నాకు తెలిసినంత వరకు ఆయన రచన చేసేముందు ఏ ప్రక్రియలో రాయాలని ముందుగా అనుకోరు. ఆయన ఎంచుకున్న వస్తువు రూపం, అందులోని గాఢత, అందులోని అనేక పార్శ్వాలకు అనుగుణంగా సహజంగా ప్రక్రియ ప్రారంభమవుతుంది. తన ఆలోచనలను, భావజాలాన్ని, ఉద్దేశాన్ని పంచుకోవడానికి తగిన మాధ్యమం దానంతట అదే ఏర్పడుతుంది.
రామా చంద్రమౌళి కవితల్లో వరంగల్లు మాండలిక భాషలోని జీవ లక్షణం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రాంతీయ మాండలిక ప్రయోగాల బిగవు ఉన్నది. ‘పెంకాసు’, ‘ఠక్కున, ‘ఇసిరె’ ‘సద్దుల’, ‘దబదబా’,‘పతంగీ’, ‘మాంజా’, ‘బొక్క’ మొదలైనవి మనం గమనించవచ్చు. వికృత రాజకీయాలకు బలైపోయిన ఆజంజాహి మిల్లును గూర్చి వియోగగీతం రాయటం అరుదైన అబ్బురమైన అంశం. ఒక వస్తువును, ఒక సందర్భాన్ని, ఘటనను, ప్రత్యేకించి మానవ జీవితాన్ని బహుముఖ కోణంలో, పార్శ్వాల్లో సమగ్రంగా, విపులంగా సమ్యక్ దష్టితో చూడటం విలక్షణమైన ప్రతిభ. అదే రామా చంద్రమౌళి విశిష్టత. ఎందుకంటే ఆయనకు రాజ్య ధిక్కారం తెలుసు. ప్రజలను చైతన్యం చేయడం తెలుసు. ఫిలాసఫీ లోతులు తెలుసు. అదే సమయంలో అత్యంత ఆహ్లాదకరంగా కథ చెప్పటమూ తెలుసు. ఇందుకు ఉదాహరణ ఆయన బృహన్నవల కాల నాళిక 80 ఏళ్ల తెలంగాణ చరిత్ర పోరాట వస్తువుగా చేసుకొని రాసింది. దీనికి ఇతిహాసంగా పేరు రావడం విశేషం.
‘ప్రత్యక్ష విదేశీ పెట్టుబడిదారుల్లారా.. బాజాప్తా చొరబాటుదారుల్లారా.. సుస్వాగతం! మా ఎదపై పరచిని ఎర్ర తివాచీపైకి.. రక్షణ రంగమైనా, ఔషధరంగమైనా, ఆహార రంగమైనా.. మా అత్యంత ఆంతరిక రహస్య రతిరంగమైనా.. మీ నిరభ్యంతర ప్రవేశానికి సాదర స్వాగతం ! రండి మీ సౌఖ్యాల కోసం.. మా సుఖాల కోసం! మీ క్షణిక లగ్జరీల కోసం ఈ దేశాన్ని.. మా అస్తిత్వాన్ని మా ఉనికిని, మా ఆత్మ గౌరవాన్నీ.. మీ పాదాల ముందు తాకట్టు పెట్టి రాజ్యాంగ సాక్షిగా బానిసత్వాన్ని స్వీకరిస్తాం’ అనే తీవ్రమైన ధిక్కార స్వరం రామా చంద్రమౌళిది. నిజంగా వర్తమాన కవి సమాజంలో ఒక విశిష్టత కలిగిన కవి రామా చంద్రమౌళి. ఆయనది ఒక యునీక్ స్టైల్.
విద్య మార్గంలో తాను సాంకేతిక విద్యను అభ్యసించి బోధించి ప్రతిష్ఠను సంపాదించినా, సాహిత్య రంగంలోనూ ప్రత్యేకమైన స్థానాన్ని, గౌరవాన్ని సంపాదించుకున్నారు. తాను రచించి ప్రచురించిన కవిత సంపుటాలు, తరువాతి తరం కవులు తమకు మార్గనిర్దేశకంగా ఉన్నట్టు భావిస్తారు. కవిత్వానికి, అందులో వచన కవిత్వానికి నూతన భాషా సృజన చేసి కొత్త రూపాన్ని కల్పించిన వారు రామా చంద్రమౌళి. సమాజ హితానికి సాహిత్యమే ఔషధమని చెప్పడానికి రామాచంద్రమౌళి కవిత్వాన్ని చదివితే చాలు. ‘బాధలతో, వేదనలతో, సంతోషావశేషాలతో స్మతుల తరగలతో తీరం దిక్కు పరిగెత్తుతూనే ఉంటుంది అదశ్యాశ్వమై. కానీ, నీకే తెలియదు నీ తీరమేమిటో ’ అన్న కవి ‘జ్ఞానారణ్యం’ అన్నఖండిక లోనిది. ఈ కవిత రామా చంద్రమౌళి శబ్ద చిత్రానికి ఇది ఒక మచ్చుతునక. ఆయన సృజన అంతా స్వీయ అనుభవంలో నుంచి ఉబికి వచ్చిందే. చివరగా ఒక మాట చెప్పి ముగిస్తాను. సహదయత, గాంభీర్యము, శిల్ప చాతుర్యం, కలగలిసిన కొత్త అనుభూతి ద్వారాలను తెరచిన అరుదైన కవితా ప్రయోగం చేసిన రచయిత రామా చంద్రమౌళి.
కోవెల సంతోష్‌కుమార్