calender_icon.png 12 January, 2026 | 7:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చలి పులి

12-01-2026 02:56:47 AM

ఉదయం ఏడు దాటినా 

తూరుపు తెరపై 

వెలుగు కళ్లు తెరవనే లేదు 

****

దినపత్రిక 

గుమ్మంలోకి విసిరి 

మంచులోకి దూసుకెళ్లాడు 

పేపర్ కుర్రాడు 

****

చలిగాలులు వణికిస్తున్నా

తులసి మొక్కకు 

కార్తీక దీపం పెట్టి 

సంస్కృతిని వెలిగిస్తుంది 

తెలుగింటి ఆడపడుచు 

****

మంచు తుంపర్ల దాడికి 

ఆకుల మాటున 

దాక్కున్నాయి 

పెరట్లో పూలు

****

వద్దని మొక్కలు వారిస్తున్నా 

మొక్కుబడిగా నీళ్లు పట్టి 

డ్యూటీ దిగి వెళ్లిపోయాడు 

నైట్ వాచ్‌మెన్ 

****

కూడలిలో కాఫీ కొట్లకు 

భలే గిరాకీ!

వేడివేడి కబుర్లతో 

పొగ మంచును తరిమేందుకు 

పోగయ్యారు జనం

****

ఇంటా.. బయటా...

ఉన్ని ముసుగులే 

అందరికీ రక్షక కవచాలయ్యాయి!

****

వీధుల్లో అనాథలకు 

దుప్పట్లు పంచుతూ 

ఒకడు దానగుణం చాటుతున్నాడు 

‘చెలియలేదోయ్...

చెలిమి లేదోయ్‘

అంటూ చెత్తకుండీ పక్కన 

చలిని లెక్కచేయకుండా 

మత్తులో మునిగి 

మంచులో తడుస్తున్నాడు 

భగ్న ప్రేమికుడు.

 ****

పాట బాగుందని

కుక్కతోపాటు 

తోకాడిస్తూ 

తాను అక్కడే తిష్ఠ వేసింది 

చలి పులి!

 ఎ.నాగాంజనేయులు