పాపన్న స్ఫూర్తితో బీసీల రాజ్యం
రిటైర్డ్ డీజీపీ పూర్ణచంద్రరావు
ఖైరతాబాద్, ఏప్రిల్ 2 (విజయాక్రాంతి): సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ స్ఫూర్తితో బీసీల రాజ్యాధికారం సాధించుకోవచ్చు అని, పోరాటలు చేయకుండా అది సాధ్యం కాదని రిటైర్డ్ డీజీపీ పూర్ణచంద్రరావు అన్నారు. గురువారం బీసీ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు సంగెం సూర్యారావు అధ్యక్షతన ఖైరతాబాద్‌లోని మీడియా సెంటర్ డౌన్ టౌన్ మాల్‌లో పాపన్నగౌడ్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా పూర్ణచందర్‌రావు మాట్లాడుతూ.. అణిచివేత,తిరుగుబాటు అప్పటినుంచే ఉన్నాయని,ఎన్నో వేల సంవత్సరాల క్రితమే గ్రామాలలో పెత్తనం ఉండేదని అటువంటి అన్నిటిని జయించి మొగలాయి చక్రవ ర్తి కోటలను జయించిన గొప్ప బహుజన చక్రవర్తి పాపన్న గౌడ్ అని అన్నారు. పాపన్న కాలంలో మొఘల్ పాలకులు పన్ను వసూలు చేయడానికి రెడ్డి, వెలమలను దేశ్‌ముఖ్‌లు, జాగిర్దారులుగా నియమించేవారని చెప్పారు.
వారు ఎస్సీలను, బీసీలను, ఎస్టీలను పీడించి పన్నులు వసూలు చేసేవారని గుర్తు చేశారు. స్వాతంత్య్రం వచ్చాక ఆ కుటుంబాల వారే ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యి రాజ్యం ఏలుతున్నారని పేర్కొన్నారు. అటువంటి పరిస్థితుల లో అణిచివేత నుంచి సర్వాయి పాపన్న ఉద్యమించి, గెలిచాడని చెప్పారు. ఆయన స్ఫూర్తి తోనే ఇప్పుడు బీసీల రాజ్యాధికారం సాధించుకోవాలని పిలుపునిచ్చారు.
బీసీలకు రాజ్యాధి కారం వచ్చినప్పుడే పాపన్నకు నిజమైన నివాళి అని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం కన్వీనర్ చిరంజీవులు అన్నారు. కార్యక్రమంలో బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలరాజ్ గౌడ్, బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శులు మోడల శ్రీనివాస్ సాగర్, బట్టు విజయరాజు, కొల్లూరి అర్జున్, బిసి నాయకులు రాజేశ్వర్ గౌడ్, బైరీ శేఖర్ గౌడ్, శ్రీకాంత్ నేత, అయెలి వెంకన్న గౌడ్, దుర్గ య్య, విజయకుమార్ గౌడ్, మానేఖర్ విజయకుమార్ నీలి, విశాల్ పాల్గొన్నారు.




